Argentina News: దక్షిణ అమెరికాలో డ్రగ్స్ మాఫియా గురించి కథలు ఆసక్తికరం గా ఉంటాయి. ఆ ఖండంలోని చాలా దేశాలు ఆ ఉచ్చులో చిచ్చుకుని విలవిల లాడుతున్నాయి. ఇప్పటికీ దాని నుంచి బయటపడలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రొంపిలోకి దిగిన యువతీ యువకులు ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అర్జెంటీనాలో ముగ్గురు యువతులను చిత్ర హింసలు పెట్టి హత్య చేసింది డ్రగ్స్ మాఫియా. ఆ ఘోరాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఆ దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది.
అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్‌లో ఈ ఘటన జరిగింది. ముగ్గురు యువతులను చిత్రహింసలు పెట్టి దారుణంగా హత్య చేసింది ఓ గ్యాంగ్. ఈ తతంగాన్ని ఇన్‌స్టాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఆ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. యువతీయువకులు రోడ్లపైకి వచ్చిన నిరసనలు, ఆందోళనకు దిగారు.
దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వారంతా. యువతుల గోళ్లను పీకి, వేళ్లను నరికి కొట్టి చంపినట్టు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. నిందితుల్లో ఒకరు యువతుల హత్యను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. తన దగ్గర డ్రగ్స్ దొంగిలిస్తే ఇలాగే జరుగుతుందంటూ ఆ గ్రూపు నాయకుడు హెచ్చరించినట్లు ఆ వీడియోలో ఉంది.
ఈ ఘటనపై యువతుల తల్లిదండ్రులకు తెలిసి షాకయ్యారు. కుమార్తె ఎదుర్కొన్న వేధింపుల కారణంగా ఆమె మృతదేహాన్ని గుర్తించలేక పోయానని ఓ తండ్రి చెప్పుకొచ్చాడు. మరికొందరైతే ఆ గ్యాంగ్‌ను రక్తపిపాసిలు వర్ణిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇంటా బయటా విమర్శలు రేగడం మొదలయ్యాయి. చివరకు ఆ దేశ జాతీయ భద్రతా మంత్రి ప్యాట్రిసియా బుల్రిచ్ నోరు విప్పారు.
ALSO READ: భవానీ భక్తులపై దూసుకెళ్లిన కారు.. స్పాట్‌లో ఇద్దరు మృతి
ఈ ఘటనలో ఐదో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. బొలీవియా సరిహద్దు నగరమైన విల్లాజోన్‌లో అరెస్టు చేసినట్టు వివరించారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి 20 ఏళ్ల పెరువియన్ యువకుడి ఫోటోని అధికారులు విడుదల చేశారు. అతడు ఇప్పటికీ పరారీలో ఉన్నాడని తెలుస్తోంది.
ముఠా నియమావళిని ఉల్లంఘించినందుకు, ఇతరులకు హెచ్చరించేందుకు ఈ విధంగా చేశారని దర్యాప్తు అధికారులు తెలిపారు.ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ స్ట్రీమ్ జరుగుతున్నట్లు మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదని మెటా ఓ ప్రకటనలో తెలిపింది. దర్యాప్తు చేస్తున్న అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని మెటా ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘటనపై న్యాయం జరగాలని తాము కోరుకుంటున్నట్లు యువతుల పేరెంట్స్ చెబుతున్నారు. అసలైన నిజం బయటకు రావాలని, ఈ విషయంలో తాము భయపడేది లేదన్నారు.