TTD Reforms: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తాజాగా భక్తుల సౌకర్యాలు, ఆలయ పాలనా విభాగాల్లో పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో, సాధారణ భక్తుల దర్శన వేళలను మెరుగుపరచడంతో పాటు దాతల సేవా నిబంధనల్లో పారదర్శకతకు పెద్దపీట వేశారు. విరాళాల నిర్వహణలో ఏకరీతి విధానాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కొత్త మార్పులను ప్రవేశపెట్టారు.
భక్తుల సౌకర్యాలు,మౌలిక వసతులు..
తిరుమలలో సర్వదర్శనం కోసం వేచి ఉండే భక్తులకు ఊరటనిస్తూ రూ.6.31 కోట్లతో ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, ఆధునిక మరుగుదొడ్ల నిర్మాణానికి టెండర్లు ఆమోదించారు. అలాగే, ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కుమారధార, పసుపుధార డ్యామ్‌ల వద్ద రూ.2.77 కోట్లతో డబుల్ లేన్ వంతెనను నిర్మించనున్నారు. పాతపడిపోయిన ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేసేందుకు రూ.5 కోట్లు, భక్తుల రక్షణ కోసం ఆలయాలు, వసతి గృహాల్లో అగ్నిమాపక వ్యవస్థల నిర్వహణకు రూ.2.35 కోట్లు కేటాయించారు. టి.బి.సి, ఎ.టి.సి ప్రాంతాల్లోని 12 పాత భవనాలను తొలగించి, దాతల సాయంతో కొత్తవి నిర్మించనున్నారు.
దాతల నిబంధనలు ..
టీటీడీ ట్రస్టులకు విరాళాలిచ్చే దాతల ప్రివిలేజెస్‌లో మార్పులు చేశారు. ఇకపై దాతలకు ఏడాదికి ఒకసారి మాత్రమే బ్రేక్ దర్శనం లభిస్తుంది. అయితే, పాత దాతలకు పాత నిబంధనలే వర్తిస్తాయి. తిరుమల ఎస్వీ మ్యూజియం నిర్వహణ బాధ్యతలను టాటా సంస్థకు అప్పగించాలని బోర్డు నిర్ణయించింది. అలాగే, 12 ఏళ్లు పైబడిన సందర్శకులకు రూ.50 ప్రవేశ రుసుమును ఖరారు చేశారు.
Also Read: ఏపీ రాజకీయాల్లో పెను విషాదం.. ముద్రగడ పద్మనాభం కన్నుమూత
వేద పండితులు, కళాకారులకు ప్రోత్సాహం..
ధార్మిక ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తూ, వేద పారాయణ స్కీం కింద 791 మందిని సంభావన వేద పండితులుగా నియమించనున్నారు. వీరు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో నిత్య వేద పారాయణం చేస్తారు. దీనితో పాటు హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య, దాస సాహిత్య ప్రాజెక్టుల కళాకారుల పారితోషికాన్ని వారి నైపుణ్యం ఆధారంగా పెంచనున్నారు. టీటీడీ క్యాంటీన్లలోని 65 సర్వర్ పోస్టులను క్యాటరింగ్ సూపర్‌వైజర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
ఇతర ఆలయాల అభివృద్ధి..
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయ మూలవిరాట్లకు బంగారు కవచాల తయారీ కోసం టీటీడీ ట్రెజరీ నుంచి 1,000 గ్రాముల బంగారాన్ని కేటాయించారు. అలాగే అక్కడ రూ.17.84 కోట్లతో 100 గదుల వసతి గృహాన్ని, ఈశాన్య మాడవీధి విస్తరణకు రూ.2.11 కోట్ల భూసేకరణ వ్యయాన్ని ఆమోదించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ముఖమండపంపై ‘సాలహారం’ నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరు చేశారు. భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా 2027 నాటికి 10 లక్షల డైరీలు, 14.25 లక్షల క్యాలెండర్ల ముద్రణకు కూడా బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
