Tirumala News: తిరుమలకు వచ్చే భక్తులకు శుభవార్త. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే భక్తులకు బీమా సదుపాయం కల్పించే దిశగా ఆలోచన చేస్తోంది టీటీడీ. ఈ ప్రతిపాదన ఇంకా రూపుదిద్దుకోనప్పటికీ సాధ్యాసాధ్యాలపై పాలక మండలి, అధికార వర్గాల్లో ఆ ఆలోచన మొదలైంది. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో నిర్ణయంపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
దేశంలోని ప్రధాన దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకుంది. ఆయా దేవాలయాల వద్ద భారీ స్థాయిలో సెక్యూరిటీ ఉన్నా, కొన్నిచోట్ల తొక్కిసలాట ఘటనలు జరుగుతున్నాయి. పరిస్థితి గమనిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు బీమా పథకం వర్తింపచేయాలనే ఆలోచన చేస్తోంది. దీనిపై పాలక మండలి, అధికారుల్లో చిన్నపాటి చర్చ మొదలైంది.
టీటీడీ కొత్త ఆలోచన?
జూన్ మూడోవారంలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం జరిగింది. అజెండాతో సంబంధం లేకుండా తిరుమలకు వచ్చే భక్తులకు బీమా సదుపాయం కల్పించడంపై పాలకవర్గ సభ్యులు, అధికారుల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తిరుమలకు వచ్చే భక్తులు అనారోగ్యం బారిన పడినా, గాయపడినా ఇప్పటివరకు వైద్య సదుపాయాలు కల్పిస్తోంది.
ఎవరైనా అనారోగ్యంతో లేక ప్రమాదాల్లో మరణిస్తే ఎక్స్‌గ్రేషియా అందిస్తోంది. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే ఘాట్ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. వీటికితోడు నడక దారిలో జంతువుల కారణంగా భక్తులకు ప్రమాదం పొంచి ఉంది.
ఘటన నేపథ్యంలో..
ఈ ఏడాది జనవరిలో వైకుంఠద్వారం దర్శనం కోసం తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన టీటీడీలోని లోపాలను ఎత్తిచూపింది. ఆ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ఆర్థిక సాయం చేసింది టీటీడీ. ఆనాటి నుంచి యాత్రికులకు బీమా సదుపాయం కల్పించాలన్న ఆలోచన చేస్తోంది.
తిరుమలకు ప్రతీ రోజు సగటున 70 వేలకు పైగానే భక్తులు వస్తుంటారు. వారాంతం, సెలవు దినాలు, ఆ సంఖ్య లక్ష మార్క్‌ని తాకుతుంది. దీంతో అంత మందికి బీమా సదుపాయం కల్పించడం సాధ్యమేనా అన్న ప్రశ్న మొదలైంది. ప్రతి భక్తుడికి టీటీడీనే ఏడాదిని బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవిధంగా చెప్పాలంటే టీటీడీపై ఇది పెనుభారం.
రైలు ప్రయాణికుల మాదిరిగా..
తిరుమలకు వచ్చే యాత్రికులకు ఏ ప్రాతిపదికన బీమా కల్పించాలన్నది ప్రధాన ప్రశ్న. ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకున్నవారి మాట ఓకే. శ్రీవారి మెట్టు, అలిపిరి నడక దారి, ఘాట్ రోడ్డు ఇలా మూడు మార్గాల్లో తిరుమలకు భక్తులు వస్తుంటారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేవారు, సిఫారసు లేఖలతో వెళ్లేవారు, టైమ్ స్లాట్ బుకింగ్‌తో వెళ్లేవారికి ఏదో ఒక ఆధారం ఉంటుంది.
ఉచిత లేదా సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు ఎలాంటి రశీదులూ, ఆధారాలూ ఉండవు. ఆధార్ వెంట తెచ్చుకునే పరిస్థితి ఉండదు. అలాంటి సందర్భంలో వారికి బీమా కల్పించడం సాధ్యమేనా? అన్నది ప్రధాన పాయింట్. కాలి నడకన వచ్చే భక్తులకు అప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అవసరం. ఈ పని కోసం యంత్రాంగం కావాలి.
ఇవన్నీ టీటీడీపై అదనంగా భారం మోపనుంది. బీమా అంశం ప్రస్తుతానికి ఆలోచన దశలో ఉంది. టీటీడీ ఉన్నతాధికారులు, పాలకవర్గం దీనిపై లోతైన కసరత్తు చేయాలి. ఆ తర్వాత ప్రతిపాదనలు రెడీ చేయాల్సి ఉంటుంది. చిక్కంతా ఉచిత దర్శనానికి వచ్చే భక్తుల విషయంలో. వారికి దర్శనం టికెట్ల ఇచ్చినప్పుడు అప్పుడు వివరాలు నమోదు చేసుకుని ఇస్తారేమో చూడాలి.