Visakhapatnam Drugs Case: విశాఖలో చోటుచేసుకున్న డ్రగ్స్ కేసు ఇప్పుడు రాజకీయ మలుపు తిరుగుతోంది. ఈ కేసులో వైసీపీ స్టూడెంట్ వింగ్ నాయకుడు కొండారెడ్డి అరెస్టు వివాదాస్పదంగా మారింది. పోలీసులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని చెబుతుండగా, వైసీపీ మాత్రం దీనిని ప్రభుత్వ కుట్రగా పేర్కొంటోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీసు వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ ఆరోపణల ప్రకారం.. కొండారెడ్డిని ఉదయం 7 గంటల సమయంలోనే పోలీసులు అరెస్టు చేశారని, అయితే కేసు నమోదు మాత్రం సాయంత్రం 4.30కి చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపై వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. పార్టీ నాయకులు పలు వీడియోలు, టైమ్ స్టాంపులు ఆధారంగా చూపిస్తూ.. అరెస్టు సాయంత్రం జరిగిందని పోలీసులు చెబుతుంటే, ఉదయం 11.30 గంటలకు టీడీపీ అధికారిక సోషల్ మీడియా పేజీలో అరెస్ట్ ఫోటోలు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు.
కొండారెడ్డి అరెస్టు అనంతరం ఆయనను సమీపంలోని టాస్క్ ఫోర్స్ పోలీస్‌స్టేషన్ (మూడే కిలోమీటర్ల దూరంలో)కి తీసుకెళ్లకుండా.. 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో స్థలానికి తీసుకెళ్లారని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ టైమ్‌లో కొండారెడ్డి ఎక్కడ ఉన్నారు? ఎవరిని కలిశారు? ఎవరైనా ఒత్తిడి చేశారా? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
అరెస్టు అనంతరం కొండారెడ్డి మీడియా ముందు కన్నీళ్లతో మాట్లాడుతూ.. నా కొడుకును నిర్దోషిగా లాక్కెళ్లి, ప్రైవేట్ పార్ట్స్‌పై కొట్టి బలవంతంగా నేరాన్ని ఒప్పించారని ఆరోపించారు. డ్రగ్స్ కేసుతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని, అవసరమైతే ఏ టెస్టుకైనా సిద్ధంగా ఉన్నామని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
వైసీపీ నేతలు ఈ ఘటనను రాజకీయంగా ప్రేరేపిత అరెస్టుగా పేర్కొంటూ.. హోమ్ మినిస్టర్ కేవలం జగన్‌ని విమర్శించడానికే ఉన్నారు. ప్రజల భద్రత గురించి పట్టించుకోవడం లేదు అని వైసీపీ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.
Also Read: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్
ఇక వైసీపీ మహిళా నాయకులు కూడా హోమ్ మినిస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఎన్సీఆర్బి రిపోర్టు ప్రకారం, అమ్మాయిల మిస్సింగ్ కేసులు రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆమె ఏ హోమ్ కి మినిస్టర్ అంటూ వైసీపీ విమర్శలు గుప్పించారు. కొండారెడ్డి అరెస్టు వ్యవహారంలో వైసీపీ వీడియోలు బయట పెట్టడంతో డైలమాలో కూటమి ప్రభుత్వం పడిందని విమర్శించారు.