ప్రతి గ్రామంలో వైసీపీకి స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్ ఉండాలన్నారు జగన్. వైసీపీ స్టూడెంట్ వింగ్ నేతలతో సమావేశమైన ఆయన.. యువతతోనే భవిష్యత్ రాజకీయాలు ముడిపడి ఉన్నాయని చెప్పారు. “మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్..” యువత ఎటువైపు ఉంటే రాజకీయాల్లో ఆ పార్టీదే విజయం అన్నారు జగన్.
కల్మషం లేని రాజకీయాలు ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి రావాలంటే దానికి బీజం పడాల్సింది యువతలోనే. మీరంతా జెనరేషన్ జీలో ఉన్నారు. భావితరానికి మీరే దిక్సూచి కాబోతున్నారు. రాజకీయాల్లో మీరంతా తులసి మొక్కల్లా ఎదగాలి. యువత గట్టిగా అడుగు వేస్తే దేశాల్లో గవర్నమెంట్లే మారిపోతున్నాయి. రాష్ట్ర… pic.twitter.com/D1gLy7TwFH
— YSR Congress Party (@YSRCParty) November 6, 2025
వైసీపీ యూత్ వింగ్..
2019 ఎన్నికల సమయంలో జగన్ కి యువత అండగా నిలిచిందనేది కాదనలేని వాస్తవం. అప్పట్లో ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే వైసీపీయే అధికారంలోకి రావాలంటూ జగన్ ప్రచారం చేశారు. హోదా వస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. కానీ ఏమైంది? హోదాపై మాట మార్చి, కేంద్రం వద్ద సాగిలపడ్డారనే అపవాదు మూటగట్టుకున్నారు జగన్. మళ్లీ ఇప్పుడు జగన్, యువతకు దగ్గర కావాలని అనుకుంటున్నారు. మెడికల్ కాలేజీలపై ప్రతిపక్షం చేస్తున్న పోరాటంలో యువత ముందుండాలని సూచించారు. కోటి సంతకాల సేకరణలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పారు.
గ్రామాల్లో కూడా..
గ్రామాల నుంచి యువతను పార్టీవైపు ఆకర్షించాలని డిసైడ్ అయ్యారు జగన్. గ్రామాల్లో కూడా వైసీపీ యూత్ వింగ్, వైసీపీ స్టూడెంట్స్ వింగ్ ని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈరోజు యువ నాయకులే, రేపు కాబోయే భావి నాయకులని అన్నారు. ఇప్పుడున్న యువత జెన్ -Z తరానికి చెందినదని, భావి తరానికి వాళ్లంతా దిక్సూచిలా ఉండాలని చెప్పారు. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని సూచించారు. ఫలానా వాడు మన నాయకుడు అని కాలర్ ఎగరేసేకునేలా మన ప్రవర్తన ఉండాలన్నారు జగన్.
మహిళా నాయకులెక్కడ?
వైసీపీ విద్యార్థి విభాగం నాయకులతో జగన్ సమావేశం అని అన్నారు, మరి విద్యార్థినులు లేరా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే జగన్ సమావేేశంలో విద్యార్థినులు అస్సలు కనపడలేదు. పార్టీలో మహిళలకు ప్రాధాన్యమిస్తామంటున్న జగన్, మరి విద్యార్థి విభాగంలో విద్యార్థినులకు ఎందుకు చోటివ్వలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా మహిళల్ని పక్కనపెట్టారా అనే అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అసలు వైసీపీ విద్యార్థి విభాగంలో విద్యార్థినులు ఉన్నారా అనే ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి.
జగన్ వ్యూహం ఫలిస్తుందా?
పార్టీ పటిష్టత కోసం జగన్ వ్యూహ రచన చేస్తున్నారు కానీ, క్షేత్ర స్థాయిలో యువతకు కానీ, ఇతర పార్టీ వింగ్స్ కి కానీ స్థానిక నాయకుల మద్దతు ఉందా అనేది అనుమానమే. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన చాలామంది ఇప్పుడు వ్యక్తిగత బిజినెస్ లతో బిజీగా ఉన్నారు. పార్టీకోసం బయటకు వస్తున్నవారు, మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్న వారు చాలా తక్కువమందే ఉన్నారు. అలాంటప్పుడు ఇక యూత్ వింగ్స్ ని ఎవరు పట్టించుకుంటారు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వారికి ఆర్థిక సాయం ఎవరిస్తారు? జగన్ తో పాటు స్థానిక నేతలు కూడా చురుగ్గా ఉన్నప్పుడే వైసీపీకి మంచిరోజులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.
Also Read: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: తప్పులో కాలేసిన వైసీపీ సోషల్ మీడియా..