Ram Mohan Naidu: సైన్స్ ఎక్స్పోజర్ టూర్ లో భాగంగా ఏపీ నుంచి దిల్లీ వచ్చిన 52 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం సాయంత్రం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేశ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో టూర్ విజిట్ పెడుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలకు ప్రైవేట్ స్కూల్ పిల్లల్లో కంటే ఎక్కువగా అవకాశం కల్పించాలని మూడు రోజులపాటు దిల్లీలో కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు. మొదటిసారి ప్రభుత్వ పాఠశాలల పిల్లలందరూ విమాన ప్రయాణం చేశారన్నారు. ఈ ఎయిర్ ట్రావెల్ విద్యార్థుల్లో ఉత్సాహం నింపిందన్నారు.
సైన్స్ ఎక్స్పోజర్ కూడా విద్యలో ఒక భాగం లాంటిదే అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. దిల్లీ టూర్ కి వచ్చిన విద్యార్థులందరూ ఇతర విద్యార్థులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని సూచించారు. దిల్లీలో చూసిన విశేషాలు అన్నింటిని ఇతర విద్యార్థులతో పంచుకోవాలన్నారు. ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్ లాంటిదేనని, రకరకాల టెక్నాలజీలు దేశంలో వచ్చాయన్నారు. వాటి వలన క్షణాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చన్నారు.
‘ఎడ్యుకేషన్ లో టెక్నాలజీ ఉంది. అన్నింట్లో ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ సంస్థ AI పెట్టాలని, లక్ష 50 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఏడాదికాలంగా కంపెనీలతో చర్చించి గూగుల్ సెంటర్ ను తీసుకొచ్చారు. అన్ని రంగాల్లో భారతదేశం అభివృద్ధి చెందడం కోసం మోదీ చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా హౌరా విమానయాన శాఖను అభివృద్ధి చేస్తున్నారు. అతి పిన్న వయసులో నాకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా మోదీ, చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. విమానయాన రంగంలో ఇప్పటి వరకు 843 విమానాలు ఉన్నాయి. అదనంగా మరో రెండింతలు సేవలు అందేలా చర్యలు చేపట్టాం. సీఎం చంద్రబాబు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ స్థాయిలో తెలుగువారు ఉండాలి’- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
న్యూ దిల్లీలోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 52 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వడం తనకు ఎంతో ఆనందంగా అనిపించిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి అభినందనలు తెలిపారు. ఇలాంటి ముందుచూపు కార్యక్రమాల ద్వారా ఏపీలో విద్యా రంగం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాకెట్రీ, స్పేస్ సైన్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌తో పాటు సాంస్కృతిక వారసత్వం వంటి రంగాల్లో విలువైన అవగాహన ఏర్పడుతుందన్నారు.
’52 మంది విద్యార్థులకు ఇది తొలి విమానయానం కావడం విశేషం. వారితో మాట్లాడినప్పుడు ఒక చిన్న ప్రయాణం కూడా ఎంతటి పెద్ద కలలకి రెక్కలివ్వగలదో అనిపించింది. వారి ఆలోచనల్లోని స్పష్టత, మాటల్లో ధైర్యం, ముందుకు సాగాలనే పట్టుదల నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ప్రభుత్వ పాఠశాలల నుంచి వస్తున్న ఈ అసాధారణ ప్రతిభ కలిగిన విద్యార్థులను చూస్తే గర్వంగా ఉంది. ఇలాంటి అవకాశాలు వారిని వికసిత్ ఆంధ్ర – వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములుగా తీర్చిదిద్దుతాయని విశ్వసిస్తున్నాను’ – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు