CM Chandrababu: భారత మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేత శ్రీచరణి నేడు స్వస్థలానికి చేరుకుంటుంది. దేశానికి గర్వకారణమైన ఈ క్రీడాకారిణి విజయవంతమైన ప్రస్థానం ప్రతి భారతీయుడిని ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించి భారత జట్టుకు విజయం అందించిన శ్రీచరణిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరించేందుకు సిద్ధమైంది.
శ్రీచరణి ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనుంది. ప్రభుత్వం తరఫున మంత్రులు, అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలకనున్నారు. ఏసీఏ (ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్) ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
గన్నవరం నుంచి బెంజ్ సర్కిల్ వరకు శ్రీచరణి విజయరథం ప్రత్యేక వాహనంలో ప్రయాణించనుంది. ఈ మార్గంలో ప్రజలు స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ర్యాలీని నిర్వహిస్తోంది.
శ్రీచరణి ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడును క్యాంప్ కార్యాలయంలో కలవనున్నారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, కోచ్, క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన శ్రీచరణిని సీఎం ప్రత్యేకంగా సత్కరించనున్నారని సమాచారం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీచరణికి భారీ నగదు బహుమతి ప్రకటించే అవకాశం ఉంది. అదనంగా, రాష్ట్ర క్రీడా ప్రమోషన్ కౌన్సిల్‌లో గౌరవ పదవిని కూడా ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. క్రీడా రంగంలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పలు కొత్త పథకాలు సిద్ధం చేస్తోంది.
Also Read: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..
తన చిన్ననాటి నుంచి క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న శ్రీచరణి, అనేక సవాళ్లు ఎదుర్కొంటూ జాతీయ స్థాయికి చేరుకుంది. కష్టసాధ్యమైన సాధన, కుటుంబం, కోచ్ సహకారంతో ఆమె నేటి స్థాయికి ఎదిగింది. ప్రపంచకప్ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో దేశానికి గెలుపు అందించి చరిత్ర సృష్టించింది. ఆమె విజయగాథ రాష్ట్రంలోని యువ క్రీడాకారిణులందరికీ ప్రేరణగా నిలుస్తోంది.
మరోవైపు ఉమెన్స్ వరల్డ్ కప్ గెలుపులో తన వంతు కృషి చేసిన అరుంధతి రెడ్డికి.. శాలువా కప్పి సన్మానించిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి.