Mithun Reddy: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో.. శుక్రవారం జరిగిన 80వ సర్వసభ్య సమావేశంలో, భారత్ తరఫున వైయస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి ప్రసంగించడం విశేషం. ఇది కేవలం ఆయనకు వ్యక్తిగత గౌరవమే కాకుండా, భారత ప్రతినిధిత్వానికి గర్వకారణమైంది. ఐక్యరాజ్యసమితి ఆరవ కమిటీ సమీక్షా సమావేశంలో, ఆయన అంతర్జాతీయ లా కమిషన్ నివేదికపై భారత్ అభిప్రాయాలను స్పష్టంగా వివరించారు.
మిథున్ రెడ్డి తన ప్రసంగంలో పైరసీ, సముద్ర ఆయుధ దోపిడీ, అంతర్జాతీయ చట్టాల అమలు, ప్రభుత్వ అధికారుల ఇమ్యూనిటీ వంటి కీలక అంశాలపై దృష్టి సారించారు. సముద్ర మార్గాల్లో జరుగుతున్న దోపిడీలను అరికట్టడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించాలి అని ఆయన సూచించారు. ఆధునిక టెక్నాలజీ, స్మార్ట్ సర్వైలెన్స్, ఇంటెలిజెన్స్ షేరింగ్ వంటి పద్ధతులు ఈ సమస్యలను తగ్గించగలవని పేర్కొన్నారు.
అలాగే, ప్రభుత్వ అధికారుల ఇమ్యూనిటీ విషయంలో ఉన్న ముసాయిదా నిబంధనలపై.. భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. దేశ సార్వభౌమత్వం, దౌత్య రక్షణ, న్యాయ స్వాతంత్య్రాల మధ్య సమతుల్యత అవసరమని తెలిపారు. ఆయన మాట్లాడుతూ, భారత్ ఎప్పటికీ పరస్పర చర్చలు, సంప్రదింపులు ద్వారానే వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు.
భారత్ ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక సభ్య దేశంగా, ఆ సంస్థ విధివిధానాలకు కట్టుబడి ఉంది. వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించి తలెత్తే వివాదాలు కూడా, ఐక్యరాజ్యసమితి చట్టాలు, ఆర్బిట్రేషన్, ప్రత్యామ్నాయ పరిష్కార విధానాల ద్వారా పరిష్కరించాలని భారత్ నమ్ముతున్నదన్నారు.
అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల మధ్య ఏర్పడే వివాదాల విషయంలో కూడా, దౌత్యపరమైన రక్షణలు, న్యాయ సమతుల్యత, మానవ హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ అంశాల్లో పారదర్శకత, సమన్వయం అత్యవసరమని అన్నారు.
పైరసీ, ఆయుధ దోపిడీ వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి, మిథున్ రెడ్డి సమగ్రమైన లీగల్ ఫ్రేమ్‌వర్క్ అవసరమని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను సమగ్రంగా రూపొందించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. సముద్ర చట్టాలు, అంతర్జాతీయ సదస్సుల్లో తీసుకున్న తీర్మానాలు సమన్వయంగా ఉండాలి. అప్పుడే ఆయుధ దోపిడీ వంటి ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అని ఆయన అన్నారు.
Also Read: గీత దాటితే సస్పెండ్..!! తిరువూరు పంచాయితీ పై చంద్రబాబు సీరియస్
ఇక స్టేట్స్ సక్సెషన్ (States Succession) అంశంలో కూడా భారత్ దృక్పథాన్ని వివరించిన మిథున్ రెడ్డి, ఈ అంశంలో భీమల్, పటేల్ నేతృత్వంలో ఏర్పడిన వర్కింగ్ గ్రూప్‌ను భారత్ స్వాగతిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో దేశాల సక్సెషన్ సమస్యలు సున్నితమైనవని, వీటిని పరిష్కరించడానికి స్పష్టమైన పాలనా విధివిధానాలు, సాంస్కృతిక అవగాహన, చట్టపరమైన సమతుల్యత అవసరమని వివరించారు.