ఇండియన్ ఆటో మోబైల్ ఇండస్ట్రీలో రారాజుగా కొనసాగుతున్న టాటా మోటార్స్ కు సంబంధించి గత కొద్ది రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టాటా సంస్థ ఇకపై మోటార్ సైకిల్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నట్లు పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించి పలు ఫోటోలు షేర్ చేస్తున్నారు. టాటా కంపెనీ ఇకపై ఈ టూవీలర్స్ రంగంలోనూ దూసుకుపోవడం ఖాయమంటున్నారు. ఇంతకీ ఈ ఊహాగానాల్లో నిజం ఎంత? నిజంగానే టాటా టూ వీలర్ రంగంలోకి ఎంట్రీ ఇస్తుందా? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి వైరల్ అవుతున్న ఫోటోల్లో మోటార్ సైకిల్‌పై టాటా బ్రాండింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, టాటా మోటార్స్ కు సంబంధించి ఈ కొత్త సెగ్మెంట్ నుంచి 125 సిసి కమ్యూటర్ బైక్ రాబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ మోటార్ సైకిల్ లీటర్ పెట్రోల్ కు ఏకంగా 90 కిలో మీటర్ల మైలేజీని కలిగి ఉంటుందని చెప్తున్నారు. అయితే, ఈ బైక్ గురించి చాలా మంది పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. టాటా నుంచి బైక్ లు రావాలని కోరుకుంటున్నారు.
అసలు విషయాన్ని పరిశీలిస్తే, టాటా మోటార్స్ ద్విచక్ర వాహన మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. దానికి కారణం ఏంటంటే.. ఇప్పటి వరకు టాటా కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించి ఎలాంటి క్రెడిబులిటీ లేదు. ఈ కథనాలకు ఎటువంటి ఆధారం లేదు. వీటిని ఎవరో క్రియేట్ చేయగా, మరెవరో వైరల్ చేస్తున్నారు. దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారులలో ఒకటి అయిన టాటా మోటార్స్ ప్రయాణీకులకు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. అంతేకాదు, ట్రక్కులు, పెద్ద పెద్ద యంత్రాలను కలిగి ఉన్న వాణిజ్య వాహన మార్కెట్లో ప్రసిద్ధ బ్రాండ్ గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మోటార్ సైకిల్ మార్కెట్‌లో సమయం, డబ్బును ఖర్చు చేయడానికి ఆలోచించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆధారాలు లేవు.
Read Also: విమానాలకు ఎడమ వైపే ఎంట్రీ ఎందుకు ఉంటుంది? కుడి వైపు డోర్ ఎందుకు ఉండదు? కారణం ఇదేనట!
ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారులు కొందరు భారతదేశంలో దశాబ్దాలుగా రాణిస్తున్నారు. ఇప్పుడు నేరుగా ఆ సంస్థలతో పోటీపడే ప్రయత్నం టాటా చేయదని చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి అనుభవం లేకుండా నేరుగా ఆ మార్కెట్‌లో పోటీ పడటం తెలివైన పని అనిపించదంటున్నారు. సో, టూ వీలర్ రంగంలోకి టాటా మోటార్స్ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు చాలా వరకు నిజంగా కాదంటున్నారు నిపుణులు. కంపెనీ అధికారికంగా ప్రకటిస్తే తప్ప, ఇలాంటి వార్తలను నమ్మకూడదని సూచిస్తున్నారు.
Read Also: నా డెత్ సర్టిఫికెట్ పోయింది.. న్యూస్ పేపర్‌లో ఊహించని ప్రకటన, ఎవరు ఆ ఆత్మారాం?