BigTV English
Advertisement

Montha Cyclone: గ్రేటర్ వరంగల్.. వరదలకు శాశ్వత పరిష్కారమే లేదా..?

Montha Cyclone: గ్రేటర్ వరంగల్.. వరదలకు శాశ్వత పరిష్కారమే లేదా..?

Montha Cyclone: తెలంగాణలో రెండో అతిపెద్ద మహానగరం వరంగల్. హైదరాబాద్ తర్వాత.. రెండో రాజధానిగా పిలిచే ఓరుగల్లులో.. పరిస్థితులు అస్సలు బాగోలేవు. గట్టిగా ఓ వర్షం పడితే.. ఇళ్లలో నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. బయటే ఉంటే.. ఇంటికి చేరుకునే మార్గం కనుమరుగయ్యే దుస్థితి ఉంది. భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా వరంగల్ ఎందుకు మునిగిపోతోంది? అక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్ తీరంలో తుపాను వచ్చినా.. ఇక్కడ వరదలు ఎందుకొస్తున్నాయి?


పేరుకే ట్రై సిటీ! వానొస్తే.. నగరమంతా సో పిటీ!
వరంగల్.. పేరుకే ట్రై సిటీ. వానొస్తే చాలు.. నగరమంతా సో పిటీగా మారిపోతోంది. అంతా.. ఇంతా అని కాదు.. ఎన్ని సెంటీమీటర్ల వర్షం కురిసినా.. వరంగల్‌లో సెంటీమీటర్ ఖాళీ లేకుండా తడిసిపోతోంది. కాజీపేట అయినా, హన్మకొండ అయినా, కోర్ వరంగల్ నగరమైనా.. ఎక్కడ చూసినా రోడ్లు చెరువుల్లా మారిపోతున్నాయ్. ఇళ్లలోకి చేరుతున్న వరద నీరు.. నగరవాసులకు కనుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు వర్షమొచ్చినా సరే.. త్రినగరిలో ముంపు విలయమే కనిపిస్తోంది. వరంగల్ మొత్తం స్తంభించిపోతోంది. మొన్న వచ్చిన మొంథా తుపాను దెబ్బకు.. గ్రేటర్ వరంగల్ అంతా చెరువైంది. ఏ రోడ్డులో చూసినా నీళ్లే ఉన్నాయ్. ఏ కాలనీ వైపు కన్నెత్తినా.. ముంపులోనే కనిపించింది. వాహనాలు తిరగాల్సిన రోడ్లమీదకి పడవలొచ్చాయ్. భారీ వర్షం కురుస్తాయనే వాతావరణ శాఖ అలర్ట్ ఎప్పుడొచ్చినా.. వరంగల్ గుండెల్లో దడ మొదలవుతోంది. వాన జల్లు వస్తే చాలు.. ఓరుగల్లు ఒళ్లు జలదరిస్తోంది.

2021 నుంచి వరదలకు ప్రభావితమవుతున్న వరంగల్
గడిచిన ఐదేళ్లలో.. భారీ వర్షాలు ఎప్పుడొచ్చినా.. వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు, అనేక కాలనీలు తరచుగా వరదలకు గురవుతున్నాయ్. 2021 నుంచి ఇప్పటివరకు.. ప్రతి సంవత్సరం.. కనీసం ఒక్కసారైనా వరంగల్ తీవ్రమైన వరదలకు ప్రభావితమైంది. గడిచిన ఐదేళ్లలో.. ఐదుసార్ల కంటే ఎక్కువే.. వరంగల్‌లో వరదలు వచ్చాయ్. పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగించాయ్. ప్రతి ఏడాది.. వర్షాకాలంలో వరంగల్‌లో వరదలు కామనైపోయాయ్. అనేక కాలనీలు నీట మునగడం, ఇళ్లలోకి బురద చేరడం లాంటి సీన్లు తరచుగా కనిపిస్తున్నాయ్. ఇక.. భారీ తుఫానులు, కుండపోత వర్షాల సమయంలో.. వరంగల్‌లో పరిస్థితులు మరీ దారుణంగా ఉంటున్నాయ్. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీట మునగడం సాధారణమైపోయింది. 2023లో వరంగల్‌లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయ్. దాంతో.. అనేక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయ్. ఈ ఏడాది ఆగస్టులోనూ.. భారీ వర్షాలకు వరంగల్, హన్మకొండ, కాజీపేట నగరాల్లోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయ్. ఇటీవల వచ్చిన మొంథా తుపాను కూడా వరంగల్‌ని ముంచేసింది.


15 సెంటీమీటర్ల వర్షం కురిస్తే.. వరంగల్ పనై పోయినట్లే!
భారీ వర్షాలు, తుపానుల సమయంలో.. వరంగల్ మునిగిపోయేందుకు, తరచుగా వరదలు వచ్చేందుకు అనేక కారణాలున్నాయ్. ఒక్కరోజులోనే.. 15 సెంటీమీటర్లు, అంతకంటే ఎక్కువ వర్షం కురిసిందంటే.. వరంగల్ పనైపోయినట్లే అనే చర్చ జరుగుతోంది. హన్మకొండ నడిబొడ్డున ఉన్న గోకుల్ నగర్.. చిన్నపాటి వర్షానికే ముంపునకు గురవుతోంది. అదేవిధంగా.. శాంతినగర్, అశోక్ నగర్, శ్రీనివాస కాలనీ, విద్యానగర్ ప్రాంతాలు చెరువుల్లా మారిపోతున్నాయ్. ఆదాలత్, సుబేదారి, వడ్డేపల్లి ఏరియా నుంచి వస్తున్న వరద నీరు.. గోకుల్ నగర్‌ని ముంచెత్తుతోంది. ఓ గంటపాటు గట్టిగా వర్షం కురిస్తే చాలు.. ఇళ్లలోకి నీరు చేరి.. వరద బీభత్సం సృష్టిస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో.. నీరంతా రోడ్ల మీదకొస్తోంది. వడ్డేపల్లి నుంచి వచ్చే వరద.. స్నేహానగర్, వికాస్ కాలనీ, అశోక కాలనీ మీదుగా.. గోకుల్ నగర్‌కే చేరుతోంది. వడ్డేపల్లి నుంచి వచ్చే వరదను.. వికాస్ నగర్ నుంచి.. డ్రైనేజీ నిర్మించి నయీంనగర్ నాలాలోకి మళ్లిస్తే.. సమస్య సగం తీరేది. అశోక కాలనీలో డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేకపోవడంతో.. ఆ ప్రాంతమంతా ముంపునకు గురవుతోంది. అనేక కాలనీల్లో నాలాల మార్గం కబ్జాలకు గురవడంతో.. వర్షపు నీరంతా.. ఇళ్ల మధ్యే ఆగిపోతోంది.

చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి మోకాళ్ల లోతు నీరు..
భద్రకాళి చెరువు పరిసర ప్రాంతాలు కూడా తరచుగా ముంపునకు గురవుతున్నాయ్. ఎన్టీఆర్ నగర్, బృందావన్ కాలనీ, సంతోషిమాత కాలనీ, చిన్నవడ్డేపల్లి చెరువు పరిసరాల్లో ఉన్న ఎస్ఆర్ నగర్, సాయి గణేశ్ కాలనీ, శివనగర్ అండర్ రైల్వే బ్రిడ్జి, లక్ష్మిగణపతి కాలనీ, మైసయ్య నగర్, డీకే నగర్ ప్రాంతాల్లో.. చిన్నపాటి వర్షానికే రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలుస్తోంది. ఇక.. కుండపోత వానలు కురిస్తే.. ఇక్కడ ఇబ్బందులు చెప్పతరం కాదు. వరద నీళ్లు ఇళ్లలోకి చేరి.. జలదిగ్బంధంలో చిక్కుకుపోతున్నాయ్. వరంగల్‌ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమే.. ఈ వరదలకు కారణమవుతోంది. ఇప్పటికే ఉన్న డ్రైనేజీలు పాతబడి, ఇరుకుగా ఉండటంతో.. చిన్న వర్షానికి పొంగిపొర్లుతున్నాయ్. గ్రేటర్ వరంగల్ సిటీ వేగంగా విస్తరించడం, కాలనీలు పెరగడం వల్ల.. వర్షపు నీరు సహజంగా ప్రవహించే కాలువలు, వాగులు, చెరువులున్న ప్రాంతాలు ఆక్రమణలకు గురికావడంతో.. నీరు సాఫీగా వెళ్లే మార్గం లేక.. కాలనీల్లోకి చేరుతోంది. ఇలా.. వర్షాకాలంలో వరద ముంపు సీన్లు వరంగల్‌లో కామనైపోయింది.

వరంగల్ పేరు వింటే.. కాకతీయుల వైభవం గుర్తొస్తుంది. తెలంగాణ సంస్కృతి కనిపిస్తుంది. అలాంటి ఓరుగల్లుకు కావాల్సింది.. కేవలం తాత్కాలిక ఉపశమనమేనా? నగరాన్ని ముంచే ఈ వరదలకు.. శాశ్వత పరిష్కారమే లేదా? రెండో రాజధాని అనే కీర్తి, ప్రఖ్యాతలు.. పిలుపులకే పరిమితమా? వరదగల్లుగా మారిన ఓరుగల్లు.. ఇంకెప్పుడు హైదరాబాద్‌ స్థాయికి ఎదుగుతుంది? గ్రేటర్ వరంగల్‌ని.. గ్రేట్ వరంగల్‌గా చేసేందుకు.. అధికారులు, పాలకులు, ప్రభుత్వం చేయాల్సిందేమిటి?

కాజీపేట, హన్మకొండ, వరంగల్ కలిసి ఉన్న మహానగరం
హైదరాబాద్, సికింద్రాబాద్ కలిస్తేనే.. ఓ మహా నగరం ఆవిష్కృతమైంది. గ్లోబల్ సిటీగా ఎదిగే దిశగా దూసుకెళ్తోంది. అలాంటిది.. వరంగల్ ట్రైసిటీ. కాజీపేట, హన్మకొండ, వరంగల్ కలిసి ఉన్న అరుదైన మహానగరం. ఇప్పటికే.. వరంగల్ అభివృద్ధిలో ఎంతో ముందుకెళ్లాల్సి ఉంది. కానీ.. ఓరుగల్లు కేవలం తెలంగాణ రెండో రాజధాని అనే పిలుపు దగ్గరే ఆగిపోయింది. హైదరాబాద్ తర్వాత.. రెండో రాజధానిగా పరిగణించే నగరం ఎలా ఉండాలి? కానీ.. ఇప్పుడెలా ఉంది? జస్ట్.. ఓ కుండపోత వాన కురిస్తే చాలు.. వరంగల్ మీదున్న లెక్కలన్నీ మారిపోతాయ్. ఆ లోతట్టు ప్రాంతాలను, రోడ్లపై ప్రవహించే వరదనీటిని చూస్తే చాలు.. కాకతీయుల నగరిపై ఉన్న ఆశలన్నీ ఆ నీటిలోనే మునిగిపోతాయ్. వర్షమొస్తే చాలు.. వరంగల్ ఉక్కిరిబిక్కిరైపోతోంది. నగర జనం అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. వీటన్నింటికి కావాల్సింది.. తాత్కాలిక ఉపశమనం కాదు. శాశ్వత పరిష్కారం కావాలి. అప్పుడే.. వరంగల్ అభివృద్ధి చెందుతుంది. ఓరుగల్లు రూపురేఖలు మారతాయ్. అలా జరగాలంటే.. కచ్చితంగా వరంగల్‌ ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడాలి. ఎంత వర్షం వచ్చినా.. రోడ్లపై చుక్క నీరు కూడా నిలవని ఏర్పాట్లు చేయాలి. జనం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తగ్గిపోవాలి. అప్పుడే.. వరంగల్‌లో మార్పు కనిపిస్తుంది. అభివృద్ధిపై ఆశ చిగురిస్తుంది.

వరంగల్ నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి..
వరంగల్‌ను పీడిస్తున్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు.. విస్తృతమైన, సమన్వయంతో కూడిన ప్రణాళికలు కావాలి. వీటిలో.. నిర్మాణపరమైన, నిర్వహణపరమైన చర్యలుండాలి. ముఖ్యంగా నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి జరగాలి. వరంగల్ సిటీలో.. ఇప్పటికీ దశాబ్దాల నాటి డ్రైనేజీ వ్యవస్థే ఉంది. ఇరుకైన మురుగు కాలువలకు బదులుగా.. పెరుగుతున్న జనాభాకు, వర్షపాతానికి తగ్గట్లుగా.. డ్రైనేజీ వ్యవస్థ కావాలి. దీనికోసం.. 4 వేల కోట్లకు పైగా నిధులతో.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇది.. మురుగు నీరు, వర్షపు నీరు కలవకుండా నిరోధిస్తుంది. ఎంత వర్షం కురిసినా.. నీరు రోడ్లమీదకు రాకుండా ఉంచుతుంది. సిటీలో ఉన్న నాలాలని కూడా విస్తరించాల్సిన అవసరముంది. వరదలు ఎక్కువగా వచ్చే లోతట్టు ప్రాంతాల్లో కొత్త డ్రైన్లని నిర్మించాలి. వరద నీరు సహజంగా ప్రవహించే నాలాల వెంబడి ఉన్న ఆక్రమణలను తొలగించి.. వాటిని పూర్తి విస్తీర్ణం మేరకు పునరుద్ధరించాలి. నగరంలో ముఖ్యమైన భద్రకాళి చెరువు, చిన్న వడ్డేపల్లి చెరువుల్లాంటి వాటి పూడిక తీసి.. నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. చెరువుల ఇన్-ఫ్లో, ఔట్-ఫ్లో మార్గాలను పటిష్టం చేసి.. సరైన నిర్వహణ ఉండేలా చూడాలి.

వరంగల్ సిటీ మాస్టర్ ప్లాన్ 2041ని అమలు చేయాలి..
ముఖ్యంగా.. వరంగల్ సిటీ మాస్టర్ ప్లాన్ 2041 ని పటిష్టంగా అమలు చేయాలి. ఇందులో.. భవిష్యత్తులో అవసరమయ్యే డ్రైనేజీ నెట్‌వర్క్, రోడ్ల నిర్మాణాలు లాంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలున్నాయ్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ లాంటి శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉంటేనే.. నగరం అభివృద్ధి చెందుతుంది. కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు ముంపు ప్రమాదాలను పరిగణనలోకి తీసుకోవాలి. వరద తీవ్రతను అంచనా వేయడానికి, ముంపు ప్రాంతాల ప్రజలకు సకాలంలో సమాచారం అందించడానికి.. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. వీటన్నింటిని.. పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే వరంగల్‌కు వరద సమస్య నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.

మెట్రో సిటీగా ఎదగాలంటే.. వరంగల్ అభివృద్ధి చెందాలి..
నిజంగానే.. వరంగల్ రెండో రాజధాని కావాలన్నా.. తెలంగాణలో అన్ని రకాల సదుపాయాలున్న మరో మెట్రో సిటీగా ఎదగాలన్నా.. వరంగల్ అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా.. హైదరాబాద్‌పై ప్రెజర్ తగ్గాలంటే.. వరంగల్ కచ్చితంగా డెవలప్ అయి తీరాలి. ఇప్పటికే.. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్ ఉంది. త్వరలోనే.. మామూనూరులో ఎయిర్‌పోర్ట్ కూడా రాబోతోంది. హైదరాబాద్ నవాబ్ సిటీ అయితే.. వరంగల్ కాకతీయుల నగరి. టూరిజం పరంగానూ.. వరంగల్‌కు ఎంతో ఫ్యూచర్ ఉంది. వీటికి తగ్గట్లుగా ఓరుగల్లును అభివృద్ధి చేయగలగాలి. పైగా.. వరంగల్ నగరాన్ని ఎంతవరకైనా విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నా సరే.. వరంగల్ మాత్రం ఎందుకో వెనకబడి ఉందనే చర్చ జరుగుతోంది. గ్రేటర్ వరంగల్ అనేది కేవలం కాగితాలకే పరిమితమైందనే వాదనలు వినిపిస్తున్నాయ్. ముందు వరంగల్ రూపురేఖలు మారితేనే.. ఈ నగరం హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

Story By Anup, Bigtv

Related News

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం.. బీఆర్ఎస్ గుండెల్లో గుబులు..!

Mukunda Jewellers: ముకుంద ఆధ్వర్యంలో పూర్వీ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్ కొత్త షోరూం ప్రారంభం

Hydra Demolishing: మియాపూర్‌లో హైడ్రా దూకుడు.. ఐదు అంతస్తులు చూస్తుండగానే నేలమట్టం

Bomb Threat: బాంబు పెట్టాం.. ఇండిగో విమానానికి బెదిరింపు మెయిల్

Telangana Politics: మంత్రి అజారుద్దీన్‌కు ఏ శాఖ కేటాయిస్తారు..? సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..

Mukunda Jewellery: హైదరాబాద్‌లో ముకుందా జ్యువెలరీ పూర్వి గ్రాండ్ ఓపెనింగ్..

Jubilee Hills: అభివృద్ధికి, సెంటిమెంట్‌కు మధ్య పోటీ.. ‘సెంటిమెంట్’ అడిగే హక్కు బీఆర్ఎస్‌కు లేదన్న సీఎం రేవంత్

Big Stories

×