Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి.. 12మంది భక్తులు మృతి చెందారు. ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. ఊహించని సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో రెయిలింగ్ ఊడిపడిపోయింది. అదే సమయంలో రెయిలింగ్ ఊడిపోవడంతో అక్కడున్న వారంతా కింద పడిపోయారు. ఒకరిమీద ఒకరు పడటంతో ఊపిరిఆడక మహిళా భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొంతమంది అక్కడే ప్రాణాలు విడిచారు.
శ్రీకాకుళం తొక్కిసలాటపై దేవాదాయశాఖ ప్రకటన విడుదల చేసింది. కాశీబుగ్గ ఆలయం నిర్వాహణ దేవాదాయశాఖ పరిధిలో లేదని క్లారిటీ ఇచ్చారు. అది ప్రైవేట్ ఆలయమని చెబుతున్నారు. తిరుమల మీద అలిగి, ఒడిశా రాజకుటుంబం..ఆ గుడిని కట్టినట్టుగా చెబుతున్నారు. భక్తుల రాకపై గుడి నిర్వాహకులు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదని దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. తొక్కిసలాటకు గుడి నిర్వాహకుల వైఫల్యమే కారణమని స్టేట్‌మెంట్ ఇచ్చింది.
సమాచారం అందటంతో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష స్పాట్ కు వెళ్లారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కాశీబుగ్గ విషాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భక్తులు మృతి చెందడం తనను కలచివేసిందన్నారు. దురదృష్టకర ఘటనలో భక్తుల చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. భక్తుల మృతిపై సానుభూతి వ్యక్తం చేశారు. సహాయ చర్యల్లో అధికారులు వేగంగా పాల్గొనాలని ఆదేశించారు.
కార్తీక శుక్ల ఏకాదశి! పుణ్య తిథి, వైకుంఠవాసుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. జీవితంలోని కష్టాలు, సంతోషాలు… అన్నింటినీ మర్చిపోయి, ఆ వెంకటేశ్వరస్వామి పాదాల చెంత శాంతిని వెతుక్కుంటూ ఎందరో భక్తులు తరలివెళ్లారు. ప్రతి హృదయం భక్తితో నిండిపోయింది. కళ్లల్లో ఆశ, పెదవులపై నామం… ఆ దేవదేవుడిని దర్శించుకోవాలనే భక్తిభావన వారిని ముందుకు నడిపించింది. ఏకాదశి కావడంతో రద్దీ పెరిగిందనే విషయం వారి మనసుల్లో మెదలలేదు. తమ ఎదురుచూపులన్నీ ఆ స్వామి చిరునవ్వుతో పటాపంచలవుతాయనుకున్నారు. కానీ, విధి వక్రీకరించింది. వెంకన్న దర్శనం కోసం తహతహలాడిన వేల గొంతులు ఒక్కసారిగా ఆర్తనాదాలుగా మారాయి. రద్దీ పెరిగింది…ఎంతగా అంటే, ఇనుప రెయిలింగ్‌ల బలం కూడా ఆ భక్త సంద్రం ఉధృతిని తట్టుకోలేకపోయింది. మెట్లు ఎక్కే క్రమంలో ఒకరుపై ఒకరు పడిపోవడంతో 12 మంది మృతిచెందారు.
పవిత్రమైన ఏకాదశి రోజున, స్వామిని చూడాలనుకున్న 12మంది అమాయక జీవితాలు ఆ దేవాలయం మెట్లపైనే నిశ్శబ్దమయ్యాయి. క్షణంలో ఆనందం, ఉల్లాసం ఆవిరైపోయి… గుడి ప్రాంగణమంతా భయంకరమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. స్వామి దర్శనం కంటే ముందే, విధి వారిని మృత్యువు ఒడిలోకి తీసుకువెళ్లింది.
Also Read: బాబు ముందుకు కొలికపూడి Vs కేశినేని చిన్ని పంచాయితీ!