Kasibugga Temple Stampade: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా ఈరోజు(శనివారం) ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి.. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు భక్తులు స్పృహతప్పి పడిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
సీఎం తీవ్ర దిగ్బ్రాంతి..
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో.. తొక్కిసలాట ఘటన కలచివేసిందని సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరాను అని సీఎం చంద్రబాబు అన్నారు.
నారాలోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి
కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి.. పలువురు భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఏకాదశి రోజు తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తోంది. సమాచారం అందిన వెంటనే అధికారులు, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు గారితో, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష గారితో మాట్లాడాను. బాధితులకు తక్షణ సహాయం అందజేయాలని ఆదేశించానని నారా లోకేష్ తెలిపారు.
వైఎస్ షర్మిల తీవ్ర దిగ్భ్రాంతి
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో.. తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు వైఎస్ షర్మిల . అత్యంత విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ శ్రేణులు వెంటనే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టకపోవడం బాధాకరం. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా చర్యలు చేపట్టాలి. అలాగే బాధితులను, బాధిత కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.