AP Politics: తిరువూరు పంచాయితీపై సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. ఇంకా ఎవరిని బతిమిలాడాల్సిన అవసరం లేదని పార్టీ నేతలతో అన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు , ఎంపీ కేశినేని చిన్నిగొడవపై సీరియస్ అయ్యారు. చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత ఇమేజ్‌తో గెలిచామనుకుంటున్నారని.. అలా అనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా బయటికి వెళ్లిపోవచ్చన్నారు. అలాంటివాళ్లు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే సత్తా ఏంటో తెలిసేదని చంద్రబాబు అన్నట్టు సమాచారం. తొందరపడి కొంతమందికి టికెట్లు ఇచ్చానేమో అని నేతల వద్ద ప్రస్తావించారు. ఇకపై పార్టీ లైన్ దాటితే.. పిలిపించి మాట్లాడే పరిస్థితి ఉండదని వార్నింగ్ ఇచ్చారు.
పార్టీ కట్టుబాట్లు దాటితే కఠిన చర్యలు ఉంటాయన్న చంద్రబాబు.. యువతకు టికెట్లు ఇవ్వాలని ఆలోచనలో .. తొందరపడ్డానేమో అని నేతలతో కామెంట్ చేశారని సమాచారం. తిరువూరు విషయంలో ఇద్దరి వివరణ తనకు నివేదిక రూపంలో ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని ఆదేశించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు పిలిచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. లండన్ పర్యటన తర్వాత ఇద్దరితో మాట్లాడతానన్నారు. ఎమ్మెల్యే కొలికిపూడి, ఎంపీ కేశినేని చిన్నిని విడివిడిగా క్రమశిక్షణ కమిటీ ముందు పిలిచి వివరణ తీసుకోవాలని పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ తిరువూరు నియోజకవర్గంలోని పంచాయితీ సమస్య రోజు రోజుకు ముదురుతుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య మొదలైన చిన్ని గొడవ, సోషల్ మీడియా, బహిరంగ వేదికలపై మాటల యుద్ధంగా మారి, పార్టీ అధిష్టానాన్ని కదిలించింది. ఈ వివాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పార్టీ నేతలకు కరెక్షన్ ఇచ్చారు
అయితే కొలికపూడి శ్రీనివాసరావు, 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌తో గెలిచిన ఎమ్మెల్యే, తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టుకుంటూ, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు మొదట స్థానిక సమస్యలకు పరిమితమైనప్పటికీ, త్వరలోనే వ్యక్తిగత ఆరోపణలుగా మారాయి. అక్టోబర్ 2025 చివరలో, కొలికపూడి తన వాట్సాప్ స్టేటస్‌లో బ్యాంకు స్టేట్‌మెంట్‌లు పోస్ట్ చేసి, 2024 ఎన్నికల సమయంలో తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని తన నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేశారని సంచలన ఆరోపణ చేశారు. ఈ డబ్బు తాను చిన్ని అనుచరులకు ఇచ్చానని, దానికి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, పార్టీలో కలకలం రేపాయి.
కేశినేని చిన్ని ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ, “మొన్నటి వరకు నన్ను దేవుడన్నారు, ఇప్పుడు దెయ్యంలా ఎందుకు చూస్తున్నారు?” అంటూ ప్రతిస్పందించారు. తాను తిరువూరులో నాలుగేళ్లుగా సేవలు చేస్తున్నానని, కొలికపూడి తీరు అభ్యంతరకరమని చెప్పారు. అంతేకాకుండా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను విమర్శించే వారిని తాను “శత్రువులుగానే” చూస్తానని స్పష్టం చేశారు. ఈ మాటల యుద్ధం బహిరంగ వేదికలపై కొనసాగడంతో, టీడీపీ కార్యకర్తల మధ్య విభేదాలు మరింత లోతుగా పుట్టుకున్నాయి. తిరువూరు టీడీపీ కార్యాలయం కూడా ఈ వివాదంలో రణరంగంగా మారిందని సమాచారం.
ఈ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అక్టోబర్ 23న దుబాయ్ పర్యటనలో ఉన్నప్పుడే, ఈ వ్యవహారం గురించి తెలుసుకుని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని ఫలితంగా, శుక్రవారం జరగాల్సిన ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల సమావేశంను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రద్దు చేశారు.
Also Read: కర్నూల్ బస్సు ప్రమాదంపై దుష్పచారం.. 27 మందిపై కేసు నమోదు
చంద్రబాబు తన పార్టీ నేతలతో భేటీలలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. “ఎవరిని బతిమిలాడాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ సొంత ఇమేజ్‌తో గెలిచామనుకుంటున్నారు. అలా అనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా బయటికి వెళ్లిపోవచ్చు” అని ఆయన స్పష్టం చేశారు. తొందరపడి కొంతమందికి టికెట్లు ఇచ్చామేమో అని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, “ఇకపై పార్టీ లైన్ దాటితే, పిలిపించి మాట్లాడే పరిస్థితి ఉండదు” అని కట్టుబాటైన వార్నింగ్ ఇచ్చారు. ఈ మాటలు పార్టీలో భయభ్రాంతులు సృష్టించాయి. ఇది కేవలం ఈ ఇద్దరి మధ్య వివాదానికి మాత్రమే కాకుండా, పార్టీలో అంతర్గత విభేదాలను అణచివేయాలనే చంద్రబాబు ఉద్దేశ్యం అన్నారు.