హస్తా సాముద్రికం… మన భారతదేశంలో ఎంతో మంది నమ్మే శాస్త్రం. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని చెప్పేదే హస్త సాముద్రికం. అరచేతుల్లో ఉండే రేఖలలో, చిహ్నాలు, ఆకారాల్లోనే జీవితంలోని ప్రతి సంఘటన దాగి ఉంటుందని హస్త సాముద్రిక శాస్త్రం చెబుతోంది. కొన్ని చిహ్నాలు సంపదను, శ్రేయస్సును, ఊహించని లాభాలను సూచిస్తాయని వివరిస్తోంది. హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం మన అరచేతిలో మూడు రకాల చిహ్నాలు ఉంటే అవి అత్యంత శుభప్రదంగా చెబుతారు. ఆ మూడు చిహ్నాలు కమలం, చేప, త్రిభుజం. వీటి ఉనికి ఆ వ్యక్తిని ధనవంతుడిగా, అదృష్టవంతుడిగా మారుస్తుందని అంటారు.
త్రిభుజం ఉంటే
మీ అరచేతుల్లో ఉన్న గీతలలో ఎక్కడైనా త్రిభుజం లాంటి ఆకారం ఏర్పడిందేమో చూడండి. ఇది అత్యంత శుభ సంకేతాలలో ఒకటి. దీనినే సంపదకు సూచనగా చెప్పుకుంటారు. త్రిభుజాకారం ఎంతో శుభప్రదమైనది. సంపదను ఆర్జించి పెట్టేది అని అంటారు. అరచేతులలో ఈ గుర్తును కలిగి ఉన్నవారు జీవితాంతం డబ్బును సంపాదిస్తూనే ఉంటారు. వ్యాపారమైనా, ఉద్యోగమైనా కూడా వీరికి కలిసి వస్తుంది. ఇక ఆ త్రిభుజం లోపల క్రాస్ గుర్తు ఉంటే మాత్రం సంపాదించిన డబ్బును కోల్పోయే ప్రమాదం ఉందని అర్థం.
కమలం
అరచేతిలో మీకు ఎక్కడైనా కమలంలాంటి పువ్వు ఆకారం ఉందేమో చూడండి. అలా ఉంటే మీ అంత అదృష్టవంతుడు వేరొకరు లేరు. కమలం అనేది విష్ణువును సూచిస్తుంది. అంటే మీకు విష్ణు యోగం ఉన్నట్టే. ఇలాంటి వ్యక్తులు లక్ష్మీదేవి, విష్ణువుల ఆశీస్సులను కచ్చితంగా పొందుతారు. అరచేతిలో కమలం గుర్తు ఉన్నవారికి నాయకత్వ లక్షణాలు, తెలివితేటలు, మాట్లాడే పటిమ అధికంగా ఉంటుంది. వీరు రాజకీయ నాయకులుగా ఎదుగుతారు. డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు. కొత్త ఆదాయ వనరులు సృష్టిస్తూనే ఉంటారు.
చేప
అరచేతి పై భాగంలో మణికట్టు దగ్గర ఉన్న జీవన రేఖపై ఉన్న చోట చేప చిహ్నం ఉందేమో చూడండి. అలా ఉంటే అది ఎంతో శుభప్రదమైనది. ఇది ఆకస్మిక సంపదను సూచిస్తుంది. లాటరీ ద్వారా, వ్యాపారాల ద్వారా, ఇతరుల నుంచి వచ్చే బహుమతుల ద్వారా ఊహించని లాభాలను పొందుతారు. ఇలాంటి వ్యక్తులు, పూర్వీకుల ఆస్తిని కూడా సంపాదిస్తారని చెబుతారు. సమాజంలో గౌరవాన్ని కూడా పొందుతారు. చేప చిహ్నం ఉన్నవారు విదేశీ ప్రయాణాల నుంచి అధిక లాభాలను పొందే అవకాశం ఉంది.