KCR Wrong Strategy: రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకే పూర్తి అధికారులు ఇచ్చింది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పక్కనపెట్టి నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను సైతం శాసనసభ్యులకే అప్పగించింది. దాంతో వారి పెత్తనంతో, వారి అనుచరుల దూకుడుతో కాలం గడిచిపోయింది. నియోజకవర్గాల్లో ఉన్న సీనియర్లు, కీలకంగా ఉన్న నేతలను సైతం ఎదగనివ్వకుండా, వారికి ప్రాధాన్యత లేకుండా అంతా ఎమ్మెల్యేల మయం అన్నట్లు నడిచిపోయింది. పార్టీ అధికారం కోల్పోయినా ఆ సిట్టింగులు, మాజీల్లో మార్పురాకపోవడం, ద్వితీయ శ్రేణి నాయకులకు గుర్తింపు లేకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారట.
ఎమ్మెల్యేలకే పార్టీ బాధ్యతలు అప్పగించిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో పూర్తి బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించింది. గతంలో నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల బాధ్యతను పార్టీ జిల్లా కమిటీకి, ఎంపీలు, మంత్రులకు అప్పగించేంది. దాంతో స్థానిక ఎమ్మెల్యేలకు ప్రయార్టీ తగ్గేది. అయితే 2018 ఎన్నికల తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ వాటన్నింటికి చెక్ పెట్టేందుకు నియోజకవర్గాల పూర్తి బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే పార్టీ కొనసాగింది.
ద్వితీయ శ్రేణి నాయకులకు గుర్తింపు కరువు
వారు తప్ప ఆ నియోజకవర్గంలో పార్టీకి మరొకరు దిక్కులేదనే స్థితికి చేరింది. పార్టీ అధికారం కోల్పోయిన పార్టీ నేతల్లో మార్పురాకపోవడం, ద్వితీయ శ్రేణి నాయకులకు గుర్తింపు లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారట. అధికార కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు సైతం ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరిగేలా సర్వాధికారులు ఇచ్చారు. అయితే ఇక్కడే అసలు పంచాయతీ మొదలైంది. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి వెంట కోటరి ఏర్పడటంతో ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత తగ్గుకుంటూ వచ్చింది. చివరకు పార్టీ పదవుల్లో సైతం అవకాశం ఇవ్వలేదని పలువురు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్చార్జులుగా కొనసాగుతున్న ఎమ్మెల్యేలు, మాజీలు
పలు నియోజకవర్గాల్లో అధికారంలో ఉన్నప్పుడు పోటీచేసి ఓడిపోయినవారికి, ఇతర పార్టీల్లో గెలిచి బీఆర్ఎస్ లో వచ్చినవారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే వస్తుంది. ఎమ్మెల్యేలనే సుప్రీం చేయడంతో పాటు వారికే నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించడంతో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లకే పరిమితమై ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యేల వలసలు, కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో ఓటమితో గులాబీ పార్టీ బలం 28కి చేరింది. అయితే నియోజకవర్గ పార్టీ ఇన్చార్జులుగా మాత్రం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. వారి వర్గానికే పెద్దపీట వేస్తున్నారని, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను, కేడర్ ను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారట.
అధికారం పోయినా సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టని అధిష్టానం
అధికారం కోల్పోయినా అధిష్టానం మాత్రం పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టడం లేదని క్యాడర్ మధనపడుతోందంట. ద్వితీయ శ్రేణి నాయకులకు గుర్తింపు దక్కడం లేదని జిల్లాల్లో నేతలు చిర్రుబుర్రులాడుతున్నారు. ఇంకా ఉమ్మడి జిల్లాల్లో మాజీ మంత్రులదే ఆధిపత్యం కొనసాగుతుందని…వారి కనుసన్నల్లోనే వాళ్ల అనుచరులు హంగామా చేస్తున్నారని మండిపడుతున్నారు. పార్టీ సమావేశాలకు సైతం ముందు నుంచి ఉన్నవారిని, ఉద్యమకారుల్ని ఆహ్వానించడం లేదని ఇలా అయితే పార్టీ బలోపేతం ఎలా అవుతుందని ప్రశ్నలు సంధిస్తున్నారు.
రోజులు గడుస్తున్న ప్రారంభం కాని సభ్యత్వ నమోదు
వరంగల్ లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభ తర్వాత సభ్యత్వ నమోదు చేస్తామని ప్రకటించినప్పటికీ రోజులు గడిచిపోతున్నా దానిపై క్లారిటీ రాలేదు. సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ కమిటీలు వేస్తామని పార్టీ అధిష్టానం ప్రకటించింది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీలపై చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఆ దిశగా పార్టీ కార్యచరణ మొదలుకాకపోవడంతో నేతలు అసంతృప్తి చెందుతున్నారు. కమిటీల నియామకాలతో పార్టీ ప్రక్షాళన జరుగుతుందని భావిస్తున్న నేతలు …ఆ దిశగా అడుగులు పడకపోతుండటంతో నిరాశనిస్పృహలకు గురవుతున్నారట. ఇదే జాప్యం కొనసాగితే ఎవరి దారి వారు చూసుకోవడానికి పార్టీ శ్రేణులు రెడీ అవుతున్నాయంట.
నియోజకవర్గంలో మరో నేతను ఎదగనీయని ఎమ్మెల్యేలు
గతంలో ఎమ్మెల్యేలనే నియోజకవర్గ ఇన్ చార్జులుగా నియమించడంతో ఆ నియోజకవర్గంలో మరో నేతను ప్రత్యామ్నాయంగా ఎదగనియ్యలేదనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఎవరైనా ఆ నియోజకవర్గాల్లోయాక్టివ్‌గా పనిచేస్తే వారిపై కేసులు నమోదైన ఘటనలు సైతం ఉన్నాయని నాయకులు గుర్తు చేస్తున్నారు. ఆ క్రమంలో కొంతమంది సైలెంట్ కాగా, మరికొందరు నేతలు పార్టీ మారారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేగానీ, మాజీ ఎమ్మెల్యేగానీ పార్టీ మారితే ఆ నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించే నాయకులే కరువవుతున్నారంట. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్ధతు ప్రకటించిన ఎమ్మెల్యేల పది నియోజకవర్గాల్లో అదే పరిస్థితి కనిపిస్తోందటున్నారు
Also Read: ఆపరేషన్ సిందూర్‌కి మించి మోదీ బిగ్ ప్లాన్.. ఇక పాక్ చిత్తు.. చిత్తే..!
ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు లు కాంగ్రెస్‌లో చేరడంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్యాయంగా బలమైన నేతలు కరువయ్యారు. అదే పార్టీ ఎమ్మెల్యేను కాకుండా మరొకరిని పార్టీకి నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని పలువురు నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. నియోజకవర్గాల అధ్యక్ష బాధ్యతలను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కాకుండా యాక్టివ్ గా పనిచేసేవారికి అప్పగించాలని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీ అధిష్టానం పాతవారినే కొనసాగిస్తుందా? లేకుంటే ప్రక్షాళన చేసి నేతల అభిప్రాయం తీసుకొని కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తుందా? అనేది చూడాలి.