
Amitabh Bachchan : అది 1990వ దశకం. ఒకనాడు బాలీవుడ్‌ను కనుసైగతో శాసించిన అమితాబ్ బచ్చన్‌కు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన రోజులవి. దీనికి తోడు 1999లో ఆయన ప్రారంభించిన ఏబీసీఎల్ (అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్) కంపెనీ పూర్తిగా దెబ్బతింది.
ఫిల్మ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో పనిచేసిన కంపెనీ అప్పుల కుప్పగా మారటం, రూ. రూ.90 కోట్ల అప్పు కట్టాల్సిన గడ్డురోజులవి.
దీంతో అమితాబ్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారింది. జీవితంలో తొలిసారి.. అతని బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయింది. అప్పు ఇచ్చిన వ్యక్తులు ఏకంగా ఇంటికొచ్చి.. దుర్భాషలాడడం, బెదిరించటమూ జరుగుతోంది.
బ్యాంకుల వాళ్లు ఇస్తున్న నోటీసులు, అందులోని మొత్తాలు నానాటికీ పెరిగిపోతున్న దశ అది. ఎవరినైనా కలవటానికైనా ఇంట్లో నుంచి బయటికి వచ్చి ముఖం చూపలేని దుస్థితి.
ఆ సమయంలో ఒకరోజు.. అనిల్ అంబానీ.. అమితాబ్ ఇంటికొచ్చాడు. ‘నాన్నగారు మీ అప్పులన్నీ తీర్చేద్దామని డిసైడ్ అయ్యారు. ఆ వివరాలు కనుక్కుని రమ్మన్నారు’ అన్నాడు.
అడగకుండానే చేయి అందించేందుకు వచ్చిన ధీరూభాయ్ ఔదార్యాన్ని, ఆ సందేశాన్ని మోసుకొచ్చిన ఆ కొడుకు సౌశీల్యానికి అమితాబ్ కరిగి కన్నీరయ్యాడు.
కానీ.. వారి సాయాన్ని అమితాబ్ సున్నితంగా తిరస్కరించి, కృతజ్ఞతలు చెప్పి.. అనిల్‌ను కారు వరకు వచ్చి సాగనంపాడు.
2000లో ‘మొహబ్బతే’ హిట్ కావటం, టీవీలో వచ్చిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో మళ్లీ నిలదొక్కుకొని తనకంటూ ఓ బ్రాండ్‌ను సృష్టించుకున్నాడు.
ఈ తర్వాత వచ్చిన కభీ ఖుషీ కభీ ఘమ్, ఆంఖేన్, బాగ్‌బాన్, ఖాకీ, దేవ్, లక్ష్య, వీర్-జారా, బంటీ ఔర్ బబ్లీ, చీనీ కమ్, భూత్ నాథ్, సర్కార్, పా, పికు, పింక్, గులాబో వంటి హిట్లూ అందించాడు.
సీన్ కట్ చేస్తే.. ఓ రోజు ధీరూభాయ్, అమితాబ్ ఓ పార్టీలో కలుసుకున్నారు. ఆ సందర్భంలో ధీరూభాయ్… అమితాబ్‌ను దగ్గరికి పిలిచారు.
తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇబ్బంది పడుతూనే కూర్చున్న అమితాబ్‌ను గురించి అక్కడున్న వారితో…‘ఈ కుర్రాడి పట్టుదల ముందు నా సంపద ఓడిపోయింది. జీవితంలో దెబ్బతిన్న ప్రతి మనిషికీ ఈ కుర్రాడి పట్టుదల గుర్తుకురావాలి’ అని అక్కడున్న ఆ కార్పొరేట్లకు చెప్పి.. ప్రశంసించారు.
రిలయన్స్ 40వ వార్షికోత్సవం సందర్భంగా ఆనాటి ఘటనను అమితాబ్ అందరిముందూ భావోద్వేగంతో పంచుకన్నారు. ‘నాడు ఆయన చెప్పిన రెండు మాటలు.. అంతకు ముందు ఆయన నాకు ఇవ్వాలనుకున్న మొత్తం కంటే వేల రెట్లు ఎక్కువ’ అని ధీరూబాయ్ గొప్పదనాన్ని ప్రశంసించారు.