One Nation One Election: జమిలి ఎన్నికలపై వ్యవహారం మెల్లగా ముందుకు కదులుతోంది. ఇప్పటికే పార్లమెంట్ ముందుకు బిల్లు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సో ఇప్పుడు ఆ జేపీసీ సంప్రదింపుల్లో బిజీబిజీగా ఉంది. యూపీ, ఉత్తరాఖండ్ లో పర్యటించింది. అభిప్రాయాలు తెలుసుకుంది. ఎటు చేసి వన్ నేషన్, వన్ ఎలక్షన్ కు రోడ్ మ్యాప్ క్లియర్ చేస్తున్నట్లుగానే పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. అంతా కుదిరితే 2034 నుంచి సింగిల్ పోల్ ను వర్కవుట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై పెరిగిన స్పీడ్
భారత్ లో జమిలి ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఒకే దేశం ఒకే ఎలక్షన్.. విషయంపై మోడీ ప్రభుత్వం చాలా సీరియస్ గానే వర్కవుట్ చేస్తోంది. మాటిమాటికీ ఎన్నికలు రావడం, ఏదో ఒక రాష్ట్రంలో, ఏదో ఒక ప్రాంతంలో పోలింగ్ తో ఎలక్షన్ కోడ్ లు, అభివృద్ధి ఆగడం ఇవన్నీ సమస్యలను పెంచుతోంది. ఇదంతా కాదు.. ఒకేసారి ఎలక్షన్ జరిపేస్తే.. ఇక ఐదేళ్ల దాకా ఆ జోలికి వెళ్లే పరిస్థితి ఉండదు. పాలన సాఫీగా చేసుకోవచ్చు అన్న ఆలోచనతో కేంద్రం ఉంది. ఇప్పటికే జమిలి బిల్లును గతేడాది డిసెంబర్ లో లోక్ సభ ముందుకు తీసుకొచ్చింది. మరింత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ జేపీసీకి పీపీ చౌదరి చీఫ్ గా ఉన్నారు. ఇటీవలే ఆయన కొన్ని విషయాలు షేర్ చేయడంతో జమిలి టైం దగ్గరపడిందన్న విషయాలు బయటికొచ్చాయి. దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠ పెరుగుతోంది.
ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు
స్వాతంత్ర్యం వచ్చాక అటు లోక్ సభకు, ఇటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే ప్రభుత్వాలు కూలిపోవడం, రద్దవడం వంటి చర్యలతో మొత్తం ప్రాసెస్ మారిపోయింది. ఏదో ఒక ఏడాది.. ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు చాలా కామన్ అయ్యాయి. దీంతో ఎప్పుడు చూసినా భారత్ లో ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. ఇది టిపికల్ గా మారిపోయిందన్న వాదనలు పెరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకొచ్చింది. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటి అన్ని రాష్ట్రాల్లో పర్యటించి రాష్ట్రపతికి రిపోర్ట్ కూడా సమర్పించింది. కాబట్టి ఇదంతా ముగిసిన చరిత్ర. మరి వాట్ నెక్ట్స్?
2034లో జమిలికి ముహూర్తమన్న జేపీసీ ఛైర్మన్
2034లో జమిలి ఎన్నికలకు దాదాపుగా ముహూర్తం ఖరారైనట్లే అని జేపీసీ ఛైర్మన్ పీపీ చౌదరి అంటున్నారు. ఈలోపు పరిష్కరించాల్సిన సమస్యలు, రాజ్యాంగ సవరణలు, రాష్ట్రపతి నోటిఫై చేయడం, రాజకీయ నిర్ణయాలు, లాజిస్టికల్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. మరోవైపు రాష్ట్రాల్లో సంప్రదింపులు కూడా జరగాల్సి ఉంది. ఇప్పటికే కోవింద్ కమిటీ సంప్రదింపులు చేసి రిపోర్ట్ ఇచ్చినా.. జేపీసీ ఆధ్వర్యంలో మరోసారి సంప్రదింపులు జరుగుతున్నాయి. నిజానికి 2034కి ముందు జమిలి ప్రణాళిక అమలు చేయాలనుకున్నారు. అయితే చాలా సవాళ్లు దాటాల్సి ఉండడంతో 2034కి షిఫ్ట్ అయింది.
ఆర్టికల్ 82A ని కలపాలన్న ప్రతిపాదన
పైగా ఈ జమిలి బిల్లు ఇంకా మార్పులు చేర్పుల దశలో ఉంది. అంతే కాదు.. ఈబిల్లులో పేర్కొన్న విషయం ప్రకారం చూస్తే రాజ్యాంగంలో ఆర్టికల్ 82A ని కలపాలన్న ప్రతిపాదన ఉంది. కొత్తగా ఎన్నికైన లోక్‌సభ తొలి సమావేశం సందర్భంగా రాష్ట్రపతి అపాయింటెడ్ డేట్ ప్రకటించడానికి ఈ ఆర్టికల్ అనుమతిస్తుంది. కానీ ప్రస్తుత లోక్‌సభ మొదటి సమావేశం 2024లో ప్రారంభమవడంతో 2029లోనే చేయవచ్చు.
రాష్ట్రపతి అపాయింటెడ్ డేట్ ప్రకటించడం కీలకం
అపాయింటెడ్ డేట్ రాష్ట్రపతి నోటిఫికేషన్ చేసిన తర్వాత, ఆ తర్వాత ఎన్నికైన రాష్ట్ర శాసనసభల పదవీకాలం 2029లో ప్రారంభమయ్యే లోక్‌సభ ఐదేళ్ల పదవీకాలానికి తగ్గట్లుగా మారుస్తారు. దీనర్థం ఏంటంటే.. అపాయింటెడ్ తేదీ తర్వాత ఎన్నికైన ఏ రాష్ట్ర అసెంబ్లీ అయినా దాని పదవీకాలం 2031 లేదా 2033లో ప్రారంభమైనా 2034 నాటికి ముగియాల్సిందే. సో ఈ మొత్తం ఎపిసోడ్ లో రాష్ట్రపతికి తదుపరి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం 2029 లోక్‌సభ ఎన్నికల తర్వాతే వస్తుంది. అప్పటికి బిల్లు ఆమోదం పొందితే నెక్ట్స్ లోక్‌సభ 2034 వరకు కొనసాగుతుంది.
50 శాతం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అవసరం
అప్పుడే జమిలికి ఛాన్స్ ఉంది. అయితే ఈ వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు చట్టంగా మారాలంటే పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాలి. అంతటితో మ్యాటర్ ఆగదు. చట్టం అయిన తర్వాత కనీసం 50 శాతం రాష్ట్రాల అసెంబ్లీల కూడా దీన్ని ఆమోదించాలి. అయితే ఈ విషయంలో ఎన్డీఏ ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఆ పని సులువు అవుతుంది. 20 రాష్ట్రాల్లో NDA పార్టీలు అధికారంలో ఉంటే INDIA బ్లాక్ 10 చోట్ల అధికారంలో ఉంది.
లోక్‌సభలో 364 సీట్లు, రాజ్యసభలో 164 సీట్లు కావాలి
ప్రస్తుతం NDAకి లోక్‌సభలో 292 సీట్లు, రాజ్యసభలో 129 సీట్లు ఉన్నప్పటికీ బిల్లును ఆమోదించడానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లేదు. లోక్‌సభలో 364 సీట్లు, అలాగే రాజ్యసభలో 164 సీట్లు అవసరం. కానీ ఇప్పుడు ఎన్డీఏకు ఆ బలం లేదు. దీంతో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇండియా కూటమి పార్టీలు, అలాగే తటస్థ పార్టీల మద్దతు అవసరం. మరి అవి ఎంత వరకు సపోర్ట్ ఇస్తాయన్నది కీలకంగా మారుతోంది. జాతీయ ప్రయోజనాల గురించి ఆలోచించే పార్టీలు బిల్లుకు మద్దతు ఇస్తాయని ఎన్డీఏ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.
చిన్న పార్టీలకు జమిలితో నష్టం జరగబోతోందా?
వన్ నేషన్, వన్ ఎలక్షన్ వస్తే ఏయే రాష్ట్రాల్లో అసెంబ్లీల పదవీకాలం కటాఫ్ అవుతుంది? జమిలి ఎన్నికలు నిర్వహించడంలో సవాళ్లేమిటి? ఎలక్షన్ కమిషన్ ముందున్న ఆప్షన్లు ఏంటి? 2029 నాటికి మద్దతు సరిపోతుందా? కలిసి వచ్చే పార్టీలేంటి.. దూరంగా జరగాలనుకుంటున్న పార్టీలేవి? చిన్న పార్టీలకు జమిలితో నష్టం జరగబోతోందా? రాష్ట్రాలకు, లోక్ సభకు ఒకేసారి ఓటు వేయాలనుకున్నప్పుడు జనం ఆలోచన ఎలా ఉండబోతోంది?
2027లో ఎన్నికలు జరిగితే 2032లో టెన్యూర్ ముగింపు
లోక్ సభతో పాటే ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు ఈ జమిలితో పదవీకాలానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ వెనకా ముందు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే పరిస్థితి మారబోతోంది. అంటే 2026, 2027, 2028లో జరిగే రాష్ట్రాల అసెంబ్లీలు ఐదేళ్లు ప్రశాంతంగానే ఉంటుంది. ఆ తర్వాతే కథ మారుతుంది. అంటే 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. ఆ టెన్యూర్ 2032లో ముగుస్తుంది. అంటే 2034లో జమిలి వస్తే.. రెండేళ్లకే పదవీకాలం ముగిసిపోతుంది. అంటే 2032లో ఎలక్షన్ జరిగితే 2034లో డిజాల్వ్ కావాల్సిందే అన్న మాట. సో అక్కడ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇక 2033లో రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఆపద్ధర్మ సీఎంగా ప్రకటించి ఏడాది కొనసాగిస్తారా.. లేదంటే రాష్ట్రపతి పాలన విధిస్తారా అన్నది కీలకంగా మారింది. ఎందుకంటే ఏడాది వ్యవధిలోనే రెండుసార్లు ఎన్నికలు అంటే ఖర్చు భారమే. ఓటర్లకు కూడా ఇబ్బందికరమే.
యూపీ, పంజాబ్, మణిపూర్, గోవా ఎన్నికలు
2027లో గుజరాత్, హిమాచల్, ఉత్తరాఖండ్, యూపీ, పంజాబ్, మణిపూర్, గోవాలో ఎన్నికలు ఉన్నాయి. వీటి టెన్యూర్ 2032లో ముగుస్తుంది. అంటే రెండేళ్ల కోసం మళ్లీ ఇక్కడ ఎలక్షన్ జరపాల్సి ఉంటుంది. ఇక 2028లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2033 వరకు టెన్యూర్ ఉంటుంది. ఆ తర్వాత ఈ అసెంబ్లీ పదవీకాలాన్ని ఏడాది పాటు అంటే 2034లో జరగబోయే జమిలి ఎన్నికల వరకు పొడగించే అవకాశం ఉంటుంది. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. అసోం, కేరళ, తమిళనాడు, బెంగాల్ కు మూడేళ్ల పదవీకాలం దొరకనుంది. సో రాష్ట్రాల్లో పరిస్థితులు పూర్తిగా మారుతాయి.
ఈవీఎంలు పెంచుకోవాల్సిన అవసరం
పార్లమెంటులో బిల్లును ఆమోదించడానికి విస్తృతమైన చర్చ అవసరం. రాజ్యాంగం, చట్టాలు, రూల్స్ అన్నీ ఓకే అయ్యాక అప్పుడు మరో సవాల్ మొదలువుతుంది. లాజిస్టిక్, ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల సంఖ్యను రెట్టింపు చేసుకోవాలి. అలాగే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయాలి. ఒకేసారి ఎన్నికలు జరిగితే కొత్త EVMల కోసం ప్రతి 15 సంవత్సరాలకు 10 వేల కోట్లు అవసరమని ECI అంచనా వేసింది. జమిలి పోలింగ్ కోసం చాలా మ్యాన్ పవర్ అవసరం. ఎన్నికల ఫలితాలు ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందన్న వాదన ఉంది. చిన్న చిన్న ఎలక్షన్లకే హింస కట్టడి చేయలేని పరిస్థితులు కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉంటున్నాయి.
ఒకే పార్టీ ఆధిపత్యానికి దారితీస్తుందన్న భయాలు
అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ఇండియా కూటమిలోని పార్టీలు వద్దేవద్దంటున్నాయి. జమిలి బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటోంది కాంగ్రెస్. ఈ ప్రతిపాదన దేశంలో ఒకే రాజకీయ పార్టీ ఆధిపత్యానికి దారితీస్తుందని, రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని బలహీనపరుస్తుందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదన రాష్ట్రాల స్వయంప్రతిపత్తి, అలాగే ప్రాంతీయ సమస్యలు నిర్లక్ష్యానికి గురవుతాయని సమాజ్ వాదీ పార్టీ అంటోంది. అటు తృణమూల్ కాంగ్రెస్ కూడా జమిలి ఎన్నికలకు వ్యతిరేకమే అన్నది.
రాష్ట్ర సమస్యలను డామినేట్ చేస్తాయన్న చర్చ
ఇది ప్రాంతీయ పార్టీలకు నష్టం కలిగిస్తుందని, జాతీయ సమస్యలు రాష్ట్ర స్థాయి సమస్యలన డామినేట్ చేస్తాయని వాదిస్తోంది. ఈ ప్రతిపాదన సమాఖ్య వ్యవస్థను బలహీనపరుస్తుందనుకుంటున్నారు. డీఎంకే కూడా జమిలి బిల్లును వ్యతిరేకించింది. ఇది రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని, ప్రాంతీయ పార్టీలకు ప్రతికూలంగా ఉంటుందని వాదిస్తోంది. జాతీయ పార్టీలు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుందన్న ఆందోళన డీఎంకేలో ఉంది. శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే UBT పార్టీ, ఆర్జేడీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి.
ప్రజాధనం ఆదా, ప్రభుత్వ ఖజానాకు మేలన్న కేంద్రం
అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాధనం ఆదా అవుతుందని, ప్రభుత్వ ఖజానాకు మేలు జరుగుతుందంటున్నారు. మాటి మాటికి ఓట్లు వేయాల్సిన పని జనానికి తప్పుతుందంటున్నారు. అలాగే ప్రజలు, ప్రభుత్వం, అధికారుల సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. ఒక్కసారి ఎన్నికలు జరిగి ప్రజామోదంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే వారు. పాలసీ మేకింగ్ పై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టేందుకు ఛాన్స్ ఉంటుందంటున్నారు. మాటిమాటికీ వచ్చే ఎన్నికల కోడ్ తో అభివృద్ధి పనులకు బ్రేక్ పడకుండా ఉంటుందంటున్నారు. అంతే కాదు.. ఒకేసారి ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక సంస్థలకు ఓటు వేయడం అంటే.. జనం కూడా ఆసక్తిగా పోలింగ్ కేంద్రాలకు వస్తారని దీంతో ఓట్ల శాతం పెరుగుతుందన్న లాజిక్స్ వినిపిస్తున్నారు.
ఒకేసారి పోలింగ్ అంటే జనంలో ఆసక్తి
ఇక వేర్వేరుగా జరిగే పోలింగ్ తో బ్లాక్ మనీ పెరుగుతుందని, జమిలితో ఆ నల్లధనం ప్రవాహానికి చెక్ పడుతుందంటున్నారు. తక్కువ గ్యాప్ లో ఎన్నికలు జరుగుతుంటే.. దీర్ఘకాల లక్ష్యాలపై ప్రభుత్వాలు పని చేయవని, ఓటర్లను ఆకట్టుకునే తక్కువ ప్రయోజనాలు కల్పించే పనులు చేసేందుకే మొగ్గుచూపుతాయన్న వాదనను ఇంకొందరు వినిపిస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతాల బిల్లుకు ఉభయ సభల్లో సాధారణ మెజారిటీ అవసరం కాగా, రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభ అలాగే రాజ్యసభ రెండింటిలోనూ మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు అవసరం.
జమిలితో జవాబుదారీతనం తగ్గుతుందన్న వాదన
సో ఓవరాల్ గా చూస్తే.. చిన్న, ప్రాంతీయ పార్టీలు.. జాతీయ పార్టీలతో పోటీ పడలేవని దీనివల్ల వాటి రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఎన్నికలు తరచూ జరగడం వల్ల ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయని, కానీ జమిలి ఎన్నికల వల్ల ఈ జవాబుదారీతనం తగ్గుతుందని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. ప్రభుత్వాలు నడిపే పార్టీలకు భయం లేకుండా పోతుందంటున్నాయి. సో జమిలి బిల్లుపై ఏర్పాటైన జేపీసీ ఛైర్మన్ పీపీ చౌదరి నేతృత్వంలోని 39 మంది సభ్యుల ప్యానెల్ రాబోయే రెండున్నరేళ్లలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వెళ్లి మరింతగా సంప్రదింపులు పూర్తి చేయబోతోంది. అంటే జమిలికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఒప్పించే లక్ష్యంతో ఉన్నారు.
-Story By vidya sagar, Bigtv Live