CM Chandrababu : వికసిత్ భారత్ 2047.. స్వర్ణాంధ్ర.. ఇప్పుడీ అంశాలపై దేశానికే రోల్‌మోడల్‌లా మారింది ఏపీ. దీనికి కారణం నీతి ఆయోగ్‌లో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఓ ప్రజంటేషన్. ఇది ఇతర రాష్ట్రాల నేతలతో పాటు.. ఏకంగా ప్రధాని మోడీని కూడా ఆకట్టుకోంది. ఇవే కాదు.. ఈ వారంలో సీఎం చంద్రబాబు అనేక ప్రజాసంక్షేమ నిర్ణయాలతో పాటు.. కొన్ని పనులు కూడా చేపట్టారు. అవేంటో చూద్దాం.
19-05-2025 సోమవారం ( పుస్తకావిష్కరణ )
సీబీఎన్ పాత్ వేస్ టు సక్సెస్ అనే పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల జీవిత ప్రస్థానాన్ని, విజన్, విజయ సూత్రాలు, అభివృద్ధి విధానాలు ఈ పుస్తకం లో ఆవిష్కరించారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి డి. రాజేష్ కుమార్, రీచ్ ఎయిట్స్ ఈటీ & సీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డీ.ఏ.రాజు సంయుక్తంగా దీన్ని రచించారు.
19-05-2025 సోమవారం ( పథకాల అమలుపై రివ్యూ )
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రేషన్ సరకుల పంపిణీ, దీపం స్కీమ్ కింద ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ, ఎపిఎస్ఆర్టీసీ, పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలను పరిశీలించారు.
19-05-2025 సోమవారం ( ఆకస్మిక తనిఖీలు)
ప్రభుత్వ పథకాలు, పౌరసేవలపై జూన్ 12 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తామని సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ప్రజల నుంచి IVRS, క్యూర్ కోడ్ వంటి విధానాల ద్వారా అభిప్రాయాలు తీసుకున్నట్లు సీఎం తెలిపారు. ఈ అభిప్రాయాలపై సీఎస్, సీఎంవో, సెక్రటరీలతో సీఎం చర్చించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తుందని అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు ప్రజా సేవల విషయంలో పూర్తి స్థాయి సంతృప్తి కనిపించాలని సీఎం తేల్చి చెప్పారు.
19-05-2025 సోమవారం ( డేటా అనలిటిక్స్ కీకలం)
ప్రభుత్వ సేవల విషయంలో డేటా అనలిటిక్స్ కీలకమన్నారు సీఎం చంద్రబాబు. డేటా ఆధారంగా ఆయా ప్రభుత్వ శాఖల పనితీరును క్షేత్రస్థాయి నుంచి పరిశీలించేందుకు అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు వాట్సప్ గవర్నెన్సు ద్వారా 325 సేవలు అందుతున్నాయని జూన్ 12 నాటికి 500 సేవలు అందించాలని సీఎం సూచించారు. మన మిత్ర ద్వారా వాట్సప్ సేవలు అందుబాటులోకి వచ్చాక ఇప్పటి వరకూ 45 లక్షల మంది సేవల్ని వినియోగించుకున్నట్టు తెలిపారు.
20-05-2025 మంగళవారం ( కేబినేట్ నిర్ణయాలు )
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరిగింది. మొత్తం 24 అంశాలపై చర్చ జరగగా.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసీకి ఉచితంగా 615 ఎకరాల భూ కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి భూ కేటాయింపు చేసే ప్రతిపాదనకు మంత్రి వర్గం అమోదం తెలిపింది.
20-05-2025 మంగళవారం ( కేబినేట్ నిర్ణయాలు )
సత్యసాయి జిల్లా తాడిమర్రిలో అదానీ పవర్‌కు 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రోపవర్ ప్రాజెక్టుకు, కడప జిల్లాలోని కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటుకు భూ కేటాయింపునకు నిర్ణయం తీసుకున్నారు. 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామక నిర్ణయానికి ర్యాటిఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీలోని విద్యార్ధులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీసెంటర్ల ఏర్పాటుకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకీ అనుమతి ఇచ్చారు. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపారు.
20-05-2025 మంగళవారం ( రైతు సమస్యలపై సుదీర్ఘ చర్చ )
ఏపీ కేబినెట్‌లో రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చజరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశవిదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం పడిందని మంత్రివర్గంలో చర్చ జరిగింది.
20-05-2025 మంగళవారం ( తెలుగు విశ్వవిద్యాలయం ఏపీకి తరలింపు )
హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
21-05-2025 బుధవారం ( గంగమ్మ జాతరలో పాల్గొన్న చంద్రబాబు)
కుప్పంలో ఘనంగా జరుగుతున్న ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. లాంఛనాలతో సారె సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
21-05-2025 బుధవారం ( రికార్డులు తిరగరాయాల్సిందే )
అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జూన్ 21న యోగా డే సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 5 లక్షల మందితో యోగా కార్యక్రమం చేపడతామని ఆయన ప్రకటించారు.
21-05-2025 బుధవారం ( యోగా దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష )
అలాగే నెల రోజుల పాటు రాష్ట్రంలో నిర్వహించే యోగాంధ్ర-2025లో కనీసం 2 కోట్ల మంది పాల్గొనాలని పిలుపునిచ్చారు. కనీసం 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు.
23-05-2025 శుక్రవారం ( అమిత్ షాతో భేటీ )
మూడు నూతన నేర నిరోధక చట్టాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. శాంతిభద్రతలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్షించారు. శాంతిభద్రతల కోసం కేంద్రహోంమంత్రి కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా అమరావతిని విభజన చట్టంలో పెట్టాలని కోరగా… సానుకూలంగా స్పందించారని చంద్రబాబు తెలిపారు.
23-05-2025 శుక్రవారం ( నిర్మలా సీతారామన్‌తో భేటీ )
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి రావాల్సిన విభజన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించారు. ఈ ప్రాజెక్టు కోసం 80 వేలు ఖర్చు అవుతుందని.. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలను దారి మళ్లించవచ్చని చెప్పారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుతో ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.
23-05-2025 శుక్రవారం ( కేంద్ర మంత్రులతో వరుస భేటీలు )
పెన్షన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిలతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. వీరందరితో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు చంద్రబాబు.
24-05-2025 శనివారం ( నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు)
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలకమండలి సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. 2029 నాటికి పేదరిక నిర్మూలన లక్ష్యంగా పని చేస్తున్నామని నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబుగారు వివరించారు. డిజిటల్ గవర్నెన్స్ లో గూగుల్ AI వంటి టెక్నాలజీ వినియోగం… ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్‍బుక్ – ప్రతి నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు, 175 నియోజకవర్గాల్లో 175 MSME పార్కులు మొదలైన వాటి గురించి ఆయన వివరించారు.
24-05-2025 శనివారం ( వికసిత్ భారత్-2047 )
వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నీతి ఆయోగ్‌లో నివేదిక ఇచ్చారు చంద్రబాబు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తన ప్రజంటేషన్‌లో చంద్రబాబు వివరించారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ఏపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందన్నారు. వికసిత్ భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు.
24-05-2025 శనివారం ( మోడీ ప్రశంసలు )
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు బ్లూ ప్రింట్ ప్రజంటేషన్‌ను ప్రధాని అభినందించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న సంస్కరణలను అధ్యయనం చేయాలని… చంద్రబాబు రూపొందించిన ప్రణాళిక ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు.
24-05-2025 శనివారం ( రైల్వే మంత్రితో భేటీ )
కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై నేతలు చర్చించారు.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.
25-05-2025 ఆదివారం ( వైభవంగా గృహప్రవేశం )
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో సొంత ఇంటిని నిర్మించుకున్నారు. దీనికి సంబంధించిన గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయ పద్దతిలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం టీడీపీ నేతలు, స్థానిక ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా 30 వేల మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ గృహ ప్రవేశంతో 35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. సొంత ఇల్లు లేదన్న విపక్షాల విమర్శలకు ఇక చెక్ పెట్టినట్టైంది.
Story By వంశీ కృష్ణ