CM Revanth vs BJP: తెలంగాణలో యూనివర్సిటీ పేర్ల మార్పు విషయం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేర్లను మార్చే ప్రతిపాదనలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లకు దారి తీస్తున్నాయి. తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు మార్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. యూనివర్శిటీకి పేరు మారిస్తే బీజేపీ అభ్యంతరం ఎందుకు చెబుతోంది? బీజేపీ సడన్‌గా పొట్టి శ్రీరాములు నినాదం ఎత్తుకోవడం వెనక రాజకీయ వ్యూహం ఉందా?
యూనివర్సీటీల పేర్ల మార్పుపై ప్రభుత్వ నిర్ణయం
తెలంగాణలో పలు విశ్వవిద్యాలయాలకు స్థానిక ప్రాధాన్యతతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల పేర్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని సురవరం ప్రతాప రెడ్డి పేరుతో మార్చాలని, అలాగే తెలంగాణ యూనివర్సిటీని ఈశ్వరీబాయి యూనివర్సిటీగా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థిస్తూ పరిపాలనా సౌలభ్యంతో పాటు తెలంగాణ గుర్తింపును ప్రతిబింబించేలా ఈ మార్పులు చేస్తున్నామని వివరణ ఇచ్చారు.
పొట్టి శ్రీరాములు పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లు మార్పు అంశంపై బీజేపీ సీరియస్‌గా స్పందించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకించింది. పొట్టి శ్రీరాములు పేరు మార్పు చేయడాన్ని సంస్కృతి, గౌరవానికి సంబంధించిన అంశంగా మలుస్తోంది బీజేపీ. పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్రాల ఏర్పాటుకు త్యాగం చేసిన వ్యక్తిగా, ఆయన పేరును తొలగించడం తెలుగు జాతికి అవమానమని ఆరోపిస్తూ భావోద్వేగాలను తెరపైకి తీసుకోచ్చే ప్రయత్నం చేస్తోంది. పొట్టి యూనివర్సిటీకి శ్రీరాములు పేరును తొలిగిస్తే ఆర్యవైశ్యులతో పాటు తెలుగు ప్రజలను అవమానించడమే అంటూ బీజేపీ శాసన సభ్యులు మండిపడుతున్నారు.
ఆర్యవైశ్యులతో కలిసి ఉద్యమానికి తెర లేపుతామని హెచ్చరికలు
తెలుగు యూనివర్సిటీ పేరు మార్చడంపై ప్రభుత్వం పూనారలోచన చేయాలని, లేకపోతే ఆర్యవైశ్యులతో కలిసి ఉద్యమానికి తెర లేపుతామని కాషాయనేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. తెలుగు యూనివర్శిటీకి పేరు మార్పు కాదు, దమ్ముంటే నిజాం నవాబుల నిరంకుశత్వానికి కేరాఫ్ గా ఉన్న ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి పేరు మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పొట్టి శ్రీరాములును ఒక జాతీయ వీరుడిగా.. తెలుగు రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన త్యాగధనుడిగా గుర్తు చేస్తున్నారు. ఆయన పేరును తొలగించడం తెలుగు జాతి సంస్కృతి, గౌరవానికి దెబ్బతీసే చర్యగా ప్రచారం చేస్తూ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్‌ను డిఫెన్స్ లోకి నెట్టడానికి బీజేపీ ప్రయత్నాలు
పొట్టి శ్రీరాములు సెంటిమెంటుతో బీజేపీ రెండు రాష్ట్రాల్లోని తెలుగు మాట్లాడే ప్రజల మద్దతుసంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ వ్యూహం ద్వారా బీజేపీ తెలంగాణలో బీజేపీ బలోపేతమై కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడసే విధంగా పావులు కదుపుతోందంటున్నారు. పొట్టి శ్రీరాములు పేరు మార్పు వివాదాన్ని ఒక స్థానిక సమస్యగా మాత్రమే కాకుండా, తెలుగు జాతి గుర్తింపుతో ముడిపెట్టి, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చడం ద్వారా ఓటర్ల దృష్టిని ఆకర్షించాలని కాషాయ పార్టీ భావిస్తోందంట.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సురవరం ప్రతాపరెడ్డి
బీజేపీ ప్రకటన వెనక రాజకీయం వ్యూహాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఆదే స్ధాయిలో స్పందిస్తోంది. తెలుగు యూనివర్సిటీ పేరు మార్పును తెలంగాణ అస్తిత్వంగా అభివర్ణిస్తుంది కాంగ్రెస్. సురవరం ప్రతాప రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నందున ఆయన పేరుతో యూనివర్సిటీకి నామకరణం చేయడం రాష్ట్ర ఆత్మగౌరవాన్ని పెంచుతుందని వాదిస్తోంది. ఇది తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకునే అవకాశమంటుంది. పొట్టి శ్రీరాములు పేరు మార్పును తప్పుబడుతున్న బీజేపీ డిఫెన్స్‌లో పడే విధంగా కాంగ్రెస్ కూడా రాజకీయ వ్యూహంతో ముందుకొచ్చింది.
చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని డిమాండ్
కొత్తగా నిర్మించిన చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరును పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. తమకు పొట్టి శ్రీరాములుపై గౌరవం ఉందని…అలాంటి మహనీయుడి గౌరవం తగ్గకుండా కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టే విధంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డ, బండి సంజయ్ లు కృషి చేయాలని బీజేపీ కోర్టులోకి బంతిని నెట్టేశారు. చారిత్రక వ్యక్తులను అగౌరవపరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీజేపీ చేస్తున్న విమర్శలను తిప్పికోట్టే విధంగా సీఎం చేసిన ప్రతిపాదన ఉందంటున్నారు. ఆ ప్రతిపాదనతో బీజేపీ ఇరుకున పడిందనే టాక్ నడుస్తోంది.
బీజేపీని డిఫెన్స్‌లో నెట్టడానికి కాంగ్రెస్ వ్యూహం
పొట్టి శ్రీరాములు ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ సామాజిక వర్గానికి తెలంగాణలో గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. ఆయన సెంటిమెంటుతో ఆ సామాజిక వర్గం ఓట్ బ్యాంకుని సొంతం చేసుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే చర్లపల్లి టర్మినల్‌తో ముడిపెట్టి కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనతో కమలనాథులు డిఫెన్స్‌లో పడినట్లు అయిందంటున్నారు. మరి ముఖ్యమంత్రి ప్రతిపాదనపై తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి.