BigTV English
Advertisement

Israel Gaza Attack: గాజాలో 413 మంది మరణం.. ఇజ్రాయెల్ భీకర దాడి.. యద్ధం మళ్లీ మొదటికే

Israel Gaza Attack: గాజాలో 413 మంది మరణం.. ఇజ్రాయెల్ భీకర దాడి.. యద్ధం మళ్లీ మొదటికే

Israel Gaza Attack|  ఇంత కాలం అమెరికా, అరబ్ దేశాలన్నీ కలిసి గాజా యుద్ధాన్ని ఆపేందుకు చేసిన శాంతి ప్రయత్నాలన్నీ.. బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. గాజాలో ప్రశాంతత కేవలం రెండు నెలల ముచ్చటగా ముగిసింది. రంజాన్ మాసం ముగిసే వరకు సంయమనం పాటిస్తామన్న హామీని ఇజ్రాయెల్ తుంగలో తొక్కింది.


కాల్పుల విరమణ ఒప్పందంలో ఇజ్రాయెల్ కోరిన మార్పులకు హమాస్ నిరాకరించడంతో..  ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కోపంతో కన్నెర్ర చేశారు. ఆయన ఆదేశాలతో ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మంగళవారం తెల్లవారుజామునే భారీ స్థాయిలో దాడులకు దిగింది.

ఎడతెరిపి లేని బాంబుల వర్షంతో హమాస్ అగ్ర నాయకత్వాన్ని దాదాపుగా తుడిచిపెట్టేసింది. గాజాలో హమాస్ ప్రభుత్వ సారథి ఇస్మాయిల్ అల్-దాలిస్ తో పాటు, అంతర్గత శాఖ సారథి మహమూద్ అబూ వటాఫ్, అంతర్గత భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ బహజాత్ అబూ సుల్తాన్ తదితర అగ్ర నేతలు ఈ దాడుల్లో మృతి చెందారు. ఈ విషయాన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది. దాడుల్లో కనీసం 413 మందికి పైగా మరణించారని, 600 మందికి పైగా గాయపడ్డారని  గాజా యంత్రాంగం ప్రకటించింది. వారిలో చాలామంది చిన్నపిల్లలేనని  ఆవేదన వ్యక్తం చేసింది.


Also Read: తొమ్మిది నెలల తర్వాత.. స్పేస్ నుంచి భూమి పైకి వ్యోమగామి సునీత, విల్మోర్‌లు

అయితే తమ ప్రతిస్పందన తీవ్రస్థాయిలో ఉంటుందని, ఇంతకింతా ప్రతీకారం తీర్చుకుంటామని హమాస్ హెచ్చరించింది. తమ వద్ద బందీలుగా ఉన్న 25 మందికి పైగా ఇజ్రాయెలీలకు తాజా దాడులు మరణశాసనమేనని హమాస్ ప్రతినిధి ఇజ్జత్ అల్-రిషెక్ కోపంతో పేర్కొన్నారు. ప్రమాదంలో పడ్డ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి శాంతి ప్రయత్నాలకు నెతన్యాహు ఉద్దేశపూర్వకంగానే అడ్డంకులు కలిగించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని తీవ్రంగా స్పందించారు.

తమ బందీలను సైనిక చర్య ద్వారానే విడిపించుకుంటామని ప్రకటించారు. హమాస్పై ఇక మరిన్ని సైనిక దాడులతో విరుచుకుపడతామని కుండబద్దలు కొట్టారు. తర్వాతి చర్యలపై అత్యున్నత స్థాయి భద్రతా అధికారులతో మంగళవారం సాయంత్రం లోతుగా మంతనాలు సాగించారు. తాజా పరిణామాలతో గాజాలో శాంతి ప్రయత్నాలకు తెర పడ్డట్టేనని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ తమను సంప్రదించిన తర్వాతే తాజా దాడులకు దిగిందన్న అమెరికా ప్రకటన కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది.

భూతల దాడులు:
మంగళవారం నాటి దాడుల్లో డజన్ల కొద్దీ లక్ష్యాలను సమూలంగా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాపై అతి త్వరలో భూతల దాడులకు కూడా సిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది. తూర్పు గాజాను ఖాళీ చేయాల్సిందిగా తాజా దాడుల తర్వాత ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. వారంతా మధ్య ప్రాంతంవైపు వెళ్లాలని పేర్కొంది. మిగిలి ఉన్న హమాస్ నేతలను కూడా అంతం చేయడంతో పాటు, దాని వనరులు, మౌలిక సదుపాయాలన్నింటినీ ధ్వంసం చేయడమే ఇకపై లక్ష్యమని ఇజ్రాయెల్ అధికారి ఒకరు తెలిపారు.

2023 అక్టోబర్ 7న హమాస్ సాయుధులు ఇజ్రాయెల్లోకి చొరబడి విచక్షణారహితంగా దాడులకు దిగడం తెలిసిందే. వందలాది మంది పౌరులను కాల్చి చంపడమే గాక, 250 మందికి పైగా ఇజ్రాయెలీలను బందీలుగా తీసుకెళ్లారు. దానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ తెర తీసిన యుద్ధం 17 నెలలపాటు సాగింది. ఫలితంగా 50 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజా దాదాపుగా నేలమట్టమైంది.

ఈ నేపథ్యంలో ఈజిప్ట్, ఖతార్, అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన శాంతి చర్చలు ఫలించి, జనవరి నుంచి ఆరు వారాల పాటు కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. 25 మంది బందీలను హమాస్ విడిచిపెట్టగా, బదులుగా 2,000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. అది ముగిశాక రెండో దశ విరమణకు జరుగుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. తన వద్ద మిగిలిన 59 మంది ఇజ్రాయెలీ బందీలను వదిలేస్తానని, బదులుగా యుద్ధానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి సైన్యం గాజా నుంచి పూర్తిగా వైదొలగాలని హమాస్ డిమాండ్ చేసింది. అందుకు ఇజ్రాయెల్ ససేమిరా అంది.

హమాసే కారణం: అమెరికా
ఇజ్రాయెల్ తాజా దాడులను అమెరికా సమర్ధించింది. ఈ విషయమై ఇజ్రాయెల్ తమను ముందుగానే సంప్రదించిందని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లెవిట్ వెల్లడించారు. ఉగ్రవాద చర్యలకు మూల్యం తప్పదంటూ హౌతీలతో పాటు హమాస్ను కూడా ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారని ఆమె గుర్తు చేశారు. తాజా పరిస్థితికి హమాసే కారణమని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి బ్రయాన్ హ్యూస్ ఆరోపించారు.

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×