CM Revanth Reddy: కృష్ణా గోదావరి నది జలాల వాటా కోసం అఖిలపక్ష సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. అటు గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభం, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను మరింతగా విస్తరించడం కోసం సహాయ సహకారాలు, తెలంగాణలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానం తీసుకురావడం, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో తెలంగాణ భవన్ లో ప్రత్యేక హెల్ప్ లైన్, రాష్ట్రంలోని 34 మెడికల్ కాలేజీలకు పూర్తిస్థాయి వసతులు కల్పించడం, రైతులందరికీ రైతు భరోసా అందించడం, రైతునేస్తం కార్యక్రమాలతో ఈ వారం సీఎం రేవంత్ షెడ్యూల్ బిజీబిజీగా గడిచింది.
15-06-2025 ఆదివారం ( వీఎఫ్ఎక్స్, గేమింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ )
తెలంగాణలో వీఎఫ్ఎక్స్, గేమింగ్, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ కు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి సూచించారు. హైదరాబాద్ సీఎం నివాసంలో ఈనెల 15న జరిగిన భేటీలో వీటికి సంబంధించి చర్చలు జరిగాయి. తెలంగాణలో తాము ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసి, దానిని ఐటీఐలతో అనుసంధానిస్తామని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. జాతీయ నైపుణ్య శిక్షణ కింద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి మద్దతు ఇవ్వాలని రేవంత్ కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఐటీఐలన్నింటికీ ఉచితంగా కరెంట్ సప్లై చేయాలని కేంద్ర మంత్రి కోరగా, రాష్ట్రవ్యాప్తంగా ఐటీఐల్లో సోలార్ పవర్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సీఎం వెంటనే అధికారులను ఆదేశించారు. ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని, ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించాలన్నారు సీఎం.
VO: 15-06-2025 ఆదివారం ( సర్కారీ బడుల్లో ఆధునిక విద్య )
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. విద్యారంగంలో విశేష సేవలు అందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్‌టెక్ సదుపాయాలు అందించనుంది. ఆ మేరకు వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న స్వచ్చంద సంస్థలతో రాష్ట్ర విద్యా శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. రోహిణి నందన్ నీలేకని నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ గారి ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో విద్యాశాఖ MOU కుదుర్చుకుంది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెంచాలన్న సీఎం నిర్ణయంతో ఆయా సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. దేశంలో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో EdTech సదుపాయాలు కల్పించడం వల్ల రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉంది. AI ప్లాట్ ఫారమ్‌తో ఏక్ స్టెప్ సంస్థ 540 స్కూళ్లలో పని చేస్తోంది. ఈ సంస్థలన్నీ ఒక్కో రంగంలో ఒక్కోలా విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తాయి. పోటీ పరీక్షలు, లేటెస్ట్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తాయి.
16-06-2025 సోమవారం ( రైతన్నకు భరోసా )
రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపడుతోంది. గత 18 నెలల కాలంలో వ్యవసాయ రంగంపై 1 లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు అందించాల్సిన సంక్షేమం ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈనెల 16న రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడే వీలుకల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా 1600 వందల రైతు వేదికలకు అనుసంధానం చేసే వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలో రైతులను చైతన్య పరిచి వాణిజ్య పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయంలో అవసరమైన పనిముట్లను అందించి రైతులను ప్రోత్సహించాలని సూచించారు. రైతుల పెట్టుబడికి రెండింతలు లాభం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుందని చెప్పారు సీఎం. తొలకరి ప్రారంభమై వ్యవసాయ పనులు ముమ్మరమైన టైంలో సీఎం రేవంత్ రైతు భరోసా నిధులను రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70,11,984 మంది రైతులకు పెట్టుబడి సాయంగా దాదాపు 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నగదు బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు. అన్నట్లుగానే వరుసగా రైతుల అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది.
16-06-2025 సోమవారం ( మెడికల్ కాలేజీల్లో వసతుల కల్పన )
రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పని చేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆ కమిటీ రాష్ట్రంలోని ప్రతి కళాశాలను సందర్శించి సమగ్రమైన వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు సంబంధించి జాతీయ వైద్య మండలి ప్రస్తావించిన అంశాలపై ఈనెల 16న తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రివ్యూ చేశారు. ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారిని పరీక్షించే డాక్టర్లు, హాస్పిటల్స్ సమయాల పర్యవేక్షణకు ఒక యాప్‌ను వినియోగించే అంశంపై స్టడీ చేయాలని అధికారులకు సూచించారు.
17-06-2025 మంగళవారం ( గో సంరక్షణ దిశగా అడుగులు )
తెలంగాణలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాల అధ్యయనానికి ముగ్గురు అధికారులతో కమిటీని నియమించారు. రాష్ట్రంలో గో సంరక్షణపై ఈనెల 17న రివ్యూ చేశారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన ఉండాలన్నారు. కోడె మొక్కులు చెల్లించే దేవాలయాలైన వేములవాడ, యాదగిరిగుట్టతో పాటు, హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికేపల్లి, పశు సంవర్థక శాఖ విశ్వవిద్యాలయం సమీపంలో తొలుత గోశాలలు నిర్మించాలని చెప్పారు. భక్తులు సమర్పించే కోడెల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలన్నారు. వేములవాడ సమీపంలో వంద ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలన్నారు.
17-06-2025 మంగళవారం ( హెల్ప్ లైన్ ప్రారంభం )
ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు, తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఈనెల 17న ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. ముందు జాగ్రత్తగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.
18-06-2025 బుధవారం ( నీటి వాటాలపై అఖిలపక్షం )
గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం బాధ్యతగా రాజకీయ, న్యాయ పోరాటం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నీటి వాటాపై తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాటం సాగిస్తామన్నారు. కృష్ణా, గోదావరి జలాలపై హక్కులు, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏపీ చేపడుతున్న బనకచర్ల లింక్ ప్రాజెక్టు, దాని పర్యవసనాలు, తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం సచివాలయంలో అఖిల పక్ష ఎంపీల సమావేశం నిర్వహించారు. గోదావరి, కృష్ణా జలాల వినియోగం, పోలవరం బొల్లెపల్లి రిజర్వాయర్ నుంచి ప్రతిపాదిత బనకచర్ల రెగ్యులేటరీ వరకు నీటిని తరలించే ప్రాజెక్టు వివరాలను ఇంజనీరింగ్ నిపుణులు సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్. న్యాయం కోసం ఎవరినైనా కలుస్తామని, రివర్ మేనేజ్మెంట్ బోర్డు, పర్యావరణ, జలశక్తి వంటి వ్యవస్థలన్నింటితోనూ సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామన్నారు.
18-06-2025 బుధవారం ( గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రారంభం )
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకమైన గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 18న ప్రారంభించారు. హైటెక్ సిటీ సమీపంలో దివ్యశ్రీ బిల్డింగ్‌లో GSEC ను ప్రారంభించారు. ఏసియా-పసిఫిక్ రీజియన్‌లో గూగుల్ మొట్టమొదటి GSEC సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం గర్వకారణంగా ఉందని సీఎం అన్నారు. ప్రపంచంలో పెట్టుబడులకు గమ్యస్థానం ఏదంటే సమాధానం తెలంగాణ అని వస్తుందని చెప్పారు. ఈ GSEC అందరూ గర్వపడేలా పని చేస్తుందని విశ్వసిస్తున్నానన్నారు. తెలంగాణ లక్ష్యాలను సాధించడంలో గూగుల్ మద్దతు అవసరమన్నారు. విద్య, భద్రత, మ్యాపింగ్, ట్రాఫిక్, స్టార్టప్స్, ఆరోగ్యం వంటి అనేక రంగాల్లో ఇప్పటికే గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. గూగుల్ వచ్చినప్పటి నుంచి ప్రపంచ మారిందని, జీవితాలు పూర్తిగా డిజిటల్ మయమయ్యాయన్నారు.
18-06-2025 బుధవారం ( బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరణ కోసం )
బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను మరింతగా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్, బెంగళూరు అనుకూలమైన ప్రాంతమని సీఎం చెప్పారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ ను జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసింది. BrahMos ఏరోస్పేస్ ఎండీ, సీఈఓ డాక్టర్ జైతీర్థ్ ఆర్ జోషి, బ్రహ్మోస్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివ ప్రసాద్, DRDL జీఏ శ్రీనివాస మూర్తితో పాటు పలువురు సీఎంను కలిశారు. దేశంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రదేశమని ప్రతినిధి బృందానికి సీఎం వివరించారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరణ కోసం తెలంగాణ, హైదరాబాద్‌ను ఎంచుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.
19-06-2025 గురువారం ( తెలంగాణ రైజింగ్ అద్భుతం )
తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ అద్భుతంగా ఉందని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధి దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక ఉందని కొనియాడారు. టోనీ బ్లెయిర్ 1997 – 2007 మధ్య పదేళ్లపాటు బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు. ఇంగ్లండ్ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. రాజకీయాల నుంచి తప్పుకొన్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని నాయకులకు విజన్, వ్యూహ రచన.. వాటి అమలుకు సహకరించాలనే ఉద్దేశంతో టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ సంస్థను స్థాపించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న టోనీ బ్లెయిర్‌తో సీఎం రేవంత్ ఈనెల 19న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 ముఖ్యాంశాలను వివరించారు. ఈ విజన్ డాక్యుమెంట్‌ను ప్రజా ప్రభుత్వం రెండో వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 9, 2025న అధికారికంగా ఆవిష్కరించనున్నారు. తెలంగాణలో రైతులు, యువత, మహిళలు వంటి విభిన్న వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం చెప్పారు. తెలంగాణ కోర్ అర్బన్, సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల వారీగా అభివృద్ధి కోసం సూక్ష్మ ప్రణాళికను సరికొత్తగా రూపొందిస్తున్నట్టు తెలిపారు.
19-06-2025 గురువారం ( మెట్రో ఫేజ్ 2 అనుమతి కోసం )
హైదరాబాద్ మెట్రో ఫేజ్-II కు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు విజ్ఞప్తి చేశారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్-II అవసరం ఎంతో ఉందన్నారు. ఈనెల 19న ఖట్టర్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. 24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టేందుకు రెడీగా ఉన్నామన్నారు. మెట్రో ఫేజ్-II సాకారమైతే సిటీలో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రోడ్లపై రద్దీ తగ్గుతుందని.. సుస్థిరాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. పట్టణాభివృద్ధి శాఖ సూచనతో అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించామన్నారు.
19-06-2025 గురువారం ( బనకచర్ల ఆపండి.. )
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు ప్రీ – ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తిరస్కరించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 19న ఢిల్లీలో కోరారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ -1980 , ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయన్నారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోందని, అయితే జీడబ్ల్యూడీటీ-1980లో వరద జలాలు, మిగులు జలాల పరస్తావనే లేదన్నారు.
కృష్ణా నదిలో 500 టీఎంసీలు కావాలన్న సీఎం
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటే ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం, జల్‌శక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఎపెక్స్ కౌన్సిల్‌లో చర్చించి అనుమతి పొందాలని, అయితే బనకచర్ల విషయంలో ఏపీ వీటన్నింటిని ఉల్లంఘిస్తోందన్నారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 తీర్పు త్వరగా వెలువడేలా చూడాలని, తెలంగాణ పరయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమన్నారు. తెలంగాణకు గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ఎన్‌వోసీ జారీ చేయాలన్నారు.
20-06-2025 శుక్రవారం ( ఓల్డ్ సిటీలో నయా మెట్రో )
పాతబస్తీలో చేపట్టిన మెట్రో కారిడార్‌కు రాష్ట్ర ప్రభుత్వం బూస్టప్ ఇస్తోంది. 2025-26 బడ్జెట్‌లో కేటాయించిన 500 కోట్లలో 125 కోట్లను రిలీజ్ చేసింది. రెండో దశ విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్‌ను చేపడుతున్నారు. ఈ పనులకు మొత్తం 2,741 కోట్లు కేటాయించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 శాతం ఉంది. మిగతా నిధులు కేంద్రం, అంతర్జాతీయ బ్యాంకుల నుంచి సేకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 822 కోట్లను కారిడార్‌కు వెచ్చించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 106 కోట్లను చెల్లించింది. తాజాగా 125 కోట్లను విడుదల చేసేందుకు అనుమతులిచ్చింది. ఈ నిధులతో పాతబస్తీలో ఇండ్లు కోల్పోతున్న బాధితులకు అందించే పరిహారంతో పాటు కూల్చివేతలు, ఇతర పనులకు ఉపయోగపడనున్నాయి.
21-06-2025 శనివారం ( మహిళాసాధికారత కోసం )
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రతి సందర్భంలోనూ ప్రాధాన్యత పెంచుతోంది. ఇప్పటికే ఉన్న పథకాలను బలోపేతం చేయడంతో పాటు కొత్త స్కీంలను కూడా ప్రవేశపెడుతోంది. ఇది మహిళల సాధికారతకు ఉపయోగంగా ఉంటోందని ప్రభుత్వం భావిస్తోంది. మహిళలు స్వయం ఉపాధి పొందేలా స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ను ప్రోత్సహిస్తోంది. తాజాగా మహిళలసాధికారత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తొలి మహిళా ఆర్టీసీ బస్ డ్రైవర్‌గా చరిత్ర సృష్టించిన సరితను ఆదర్శంగా తీసుకుని.. మహిళలకు ఉచిత బస్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని పేదరిక నిర్మూలన సంస్థ SERP ద్వారా, మోవో స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఆర్టీసీలో భారీ సంఖ్యలో మహిళా డ్రైవర్లగా నియమించేందుకు ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమానికి కూడా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యంత వెనకబడిన ఆరు వేల కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా అన్నిరకాల సహాయ సహకారాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది.
Story By vidya sagar, Bigtv Live