Elon Musk: రెండోసారి అమెరికా గద్దెనెక్కిన ట్రంప్ తన స్టైల్ పాలన మొదలుపెట్టారు. అయితే, ఈసారి ట్రంప్ టీమ్‌లో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కూడా యాడ్ అవ్వడంతో వ్యవహారం మరింత ముదిరింది. ముఖ్యంగా, అమెరికా ఎకానమీలో సమూల మార్పుల కోసం ట్రంప్, మస్క్‌లు ఏ మాత్రం కాంప్రమైజ్ కావట్లేదు. ఎన్ని విమర్శలు వచ్చినా మస్క్ మార్క్ ఆర్థిక వ్యవస్థ కావాల్సిందే అంటున్నారు ప్రెసిడెంట్ ట్రంప్. దీనితో, మస్క్ కత్తికి పదును పెట్టారు. ఇప్పటి వరకూ అమెరికా ట్యాక్స్ పేయర్ల డబ్బు ఎలా దారి మళ్లిందో లెక్క కడుతున్నారు. రాంగ్ రూట్లో డాలర్లు కుమ్మరించింది ఎక్కడ, ఎవరు అనే విషయాలన్నీ తోడి తీస్తున్నారు. ఇంతకీ, మస్క్ తేల్చిందేంటీ..?
అమెరికా డబ్బు దారితప్పడంపై మస్క్ ఎక్స్ పోస్ట్‌లు
డొనాల్డ్ ట్రంప్ 2.0 ప్రభుత్వంలో మస్క్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరెన్నిచెప్పినా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్.. అమెరికా ఎకానమీని సెట్ చేస్తారని ప్రెసిడెంట్ ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. దీనితో, ప్రభుత్వ సంస్థల్లోనూ మస్క్ ఎంట్రీ సంచలనాలకు కారణం అవుతోంది. ఫెడరల్ ప్రభుత్వాన్ని కుదించడానికి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్న ఎలన్ మస్క్.. తన స్టైల్లో ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. గత కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా ఎక్స్ వేదిక ద్వారా అమెరికా డబ్బు ఎలా దారితప్పిందో వివరిస్తూ వరుస పోస్ట్‌లు పెడుతున్నారు. ముఖ్యంగా, కరోనా దెబ్బతో మొదలైన ‘పేచెక్ ప్రొటక్షన్ ప్రోగ్రామ్’కు సంబంధించిన మోసపూరిత లోన్ వ్యవహారాలన్నింటినీ తోడి తీస్తున్నారు.
ట్రెజరీ ప్రధాన కార్యాలయానికి తాళం వేసేదాకా పరిస్థితులు
ఆయా సందర్భాల్లో జరిగిన ఆర్థిక తప్పిదాలను ఒకొక్కటిగా మస్క్ ఎక్స్ వేదికపై ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. వీళ్లందరికీ విచ్చలివిడిగా గ్రాంట్లు విడుదల చేసిన యూఎస్ ట్రెజరీ పైన కూడా మస్క్ మండిపడ్డారు. ఏకంగా, దీని అవసరమే లేదన్నట్లు కామెంట్లు చేశారు. దీనితో, యూఎస్ ట్రెజరీ ప్రధాన కార్యాలయానికి తాళం వేసేదాకా తీసుకొచ్చారు ఎలన్ మస్క్. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా మస్క్ అభిప్రాయాలను బలంగా ఆమోదించడంతో… చేసేదేమీ లేక ప్రభుత్వ అధికారులంతా ఇప్పుడు కోర్టుల వైపు దీనంగా చూస్తున్నారు. అయితే, ఇంతగా పరిస్థితి దిగజారడానికి చాలా బలమైన కారణాలున్నాయని మస్క్ ఎక్స్ పోస్ట్‌లు చూస్తే స్పష్టమౌతోంది.
PPP పథకం చెల్లింపుల్లో $100 బిలియన్లకు పైగా లూటీ
గత కొన్ని రోజులుగా ఎలన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో వరుస పోస్ట్‌లతో సంచలన చర్చలను లేవనెత్తుతున్నారు. కోవిడ్ కాలంలో చాలా కంపెనీలకు నష్టం వాటిల్లిన నేపధ్యంలో.. పలు కంపెనీల ఉద్యోగులకు ప్రభుత్వమే రెండు నెలల జీతం ఇచ్చే విధంగా.. పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌ని తీసుకొచ్చారు. అయితే, ఈ పథకం ద్వారా చేసిన చెల్లింపుల్లో $100 బిలియన్ డాలర్లకు పైగా.. అంటే, రూ.87 లక్షల కోట్లకు పైగా లూటీ జరిగిందనీ.. ఇంత మొత్తాన్నీ అధికారిక విదేశీ మోసపూరిత ముఠాలు దొంగిలించాయని మస్క్ సీరియస్ ఎలిగేషన్ వేశారు. ఈ క్రమంలోనే.. ఎక్స్ వేదికపై జరిగిన సోషల్ మీడియా చర్చలో విదేశీ సహాయ సంస్థ యూఎస్ ఎయిడ్‌ను మూసివేయడానికి తాము కృషి చేస్తున్నామని చెప్పారు.
యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAid)
ఈ క్రమంలో.. మాజీ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి, రిపబ్లికన్ సెనేటర్ జోనీ ఎర్న్స్ట్, మైక్ లీలతో కూడిన కమిటీ చర్చించి.. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్-USAid ను మూసివేసే దిశగా చర్యలు చేపట్టినట్లు మస్క్ చెప్పారు. ఇంత మొత్తంలో అమెరికా ట్యాక్స్ పేయర్ల డబ్బు వృధా చేయడం.. రిపేర్ చేయలేని స్థాయిలో ఉందని మస్క్ అన్నారు. ఇక, ట్రంప్ కూడా తమ వాదనపై విశ్వాసం ఉంచి దానిని మూసివేయాలని అంగీకరించినట్లు మస్క్ వెల్లడించారు.
మహిళల ఆరోగ్యం, పరిశుభ్రమైన నీరు, HIV/Aids చికిత్సలు..
ట్రంప్ 2.0లో ఎలన్ మస్క్‌కి అమెరికా ఆర్థిక పగ్గాలు అందాయి. ఎక్కడ డబ్బు పెట్టాలి, ఎక్కడ కట్ చేయాలనేది ఇప్పుడు మస్క్ అంగీరిస్తే తప్ప ముందుకు కదలని పరిస్థితి. ఈ నేపధ్యంలో.. మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న గవర్నమెంట్ ఎఫిషియన్నీ డిపార్ట్‌మెంట్ దూకుడు పెంచింది. డోజ్ అని పిలిచే ఈ విభాగం అన్ని శాఖల్లో తలదూర్చడంతో.. దాన్ని ఆపడానికి కొందరు ఉన్నతాధికారులు ప్రయత్నించారు. ఈ పరిణామం తర్వాత, USAid లోని ఇద్దరు ఉన్నత భద్రతా అధికారులను కూడా ట్రంప్ తొలగించినట్లు నివేదికలు వచ్చాయి.
2024లో ఐరాస ట్రాక్ చేసిన మానవతా సహాయంలో దీని వంతు 42%
ప్రపంచంలోనే అతిపెద్ద ఏకైక దాతగా ఉన్న యూఎస్ ఎయిడ్ ద్వారా ఇంత మోసం జరిగిందనే విషయాన్ని మస్క్ మస్త్‌గా ప్రచారం చేస్తున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో, ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణ ప్రాంతాలలో మహిళల ఆరోగ్యం, పరిశుభ్రమైన నీరు, HIV/Aids చికిత్సలు, ఇంధన భద్రత, అవినీతి నిరోధక చర్యల వంటి పనుల్లో ప్రతిదానికీ $72 బిలియన్ల సహాయాన్ని అమెరికా అందించింది. 2024లో ఐక్యరాజ్యసమితి ట్రాక్ చేసిన అన్ని మానవతా సహాయంలో దీని వంతు 42%గా ఉంది. అయితే, ఇంత మొత్తంలో అధిక భాగం వృధాగా ఖర్చు చేస్తున్నారంటూ మస్క్ టీమ్ ఆరోపణ చేస్తోంది.
పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ పేరుతో బిలియన్ డాలర్ల సాయం
“ప్రొఫెషనల్ విదేశీ మోసపూరిత ముఠాలు” నకిలీ డిజిటల్ పత్రాలతో యుఎస్ పౌరులుగా నటించడం ద్వారా.. భారీ మొత్తాలను దొంగిలిస్తున్నాయని మస్క్ వాదిస్తున్నారు. కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో మిలియన్ల కొద్దీ అమెరికన్ వ్యాపారాలు దివాలా తీయడంతో, సమాఖ్య ప్రభుత్వం పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అనే పథకం ద్వారా బిలియన్ల డాలర్ల సహాయాన్ని అందించడానికి రెడీ అయ్యింది. దీనితో స్కామర్లంతా కూడబలుక్కున్నట్లు లూటీ ప్రారంభించారు. అయితే, ఇందులో అమెరికాలో ఉన్న భారతీయుల కంపెనీలు కూడా భారీ మొత్తంలో డబ్బులు లూటీ చేసాయని సాక్ష్యాధారాలతో సహా మస్క్ బయటపెడుతున్నారు.
భారీ మొత్తంలో ప్రభుత్వ సొమ్ము కాజేసిన కేటు కంపెనీలు
గత కొన్నేళ్లుగా దీనికి సంబంధించి విచారణలు జరుగుతుండగా.. ఇప్పటికే, పదుల సంఖ్యలో స్కామర్లు అరెస్ట్ అయ్యారు. ఇందులో భారతీయుల కంపెనీల యజమానులు కూడా పాతిక మందికి పైగా ఉన్నారు. ఒక్క టెక్సాస్‌లో పది మందికిపైగా కంపెనీ ఓనర్లు ఇప్పుడు ఊసలు లెక్కపెడుతున్నారు. లేని కంపెనీలు ఉన్నట్లు చూపించడం.. లేని ఉద్యోగుల పేరుతో అప్లికేషన్లు పెట్టి, భారీ మొత్తంలో ప్రభుత్వ సొమ్మును కాజేశారు వీళ్లంతా. చాలా అకౌంట్ల ద్వారా జరిగిన ఈ స్కామ్‌ను ఇప్పటికి కూడా ఫెడరల్ గవర్నమెంట్ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిందంటే.. ఏ లెవల్లో స్కామ్ జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే, ఇప్పటి వరకూ ఎప్పుడు జరగని అతి పెద్ద మోసంగా దీన్ని పరిగణిస్తున్నారు.
కరోనా వైరస్ ఎయిడ్, రిలీఫ్, ఎకనామిక్ సెక్యూరిటీ యాక్ట్-CARES
కరోనా వైరస్ ఎయిడ్, రిలీఫ్, ఎకనామిక్ సెక్యూరిటీ యాక్ట్… షార్ట్ కట్‌లో CARES పేరుతో వచ్చిన ఈ చట్టం కింద ఫెడరల్ పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. కరోనా కాలంలో వేతనాలు, ఖర్చులను కవర్ చేయడానికి.. క్షమించదగిన రుణాలను అందించారు. అంటే, లోన్ తీసుకున్న తర్వాత పరిస్థితులు మెరుగుపడకపోతే వాటిని తిరగి కట్టాల్సిన పనిలేదు. నిజానికి, వ్యాపారాలు, తమ ఉద్యోగులను కొనసాగించడంలో సహాయపడటమే ఈ పథకం లక్ష్యం. ఏప్రిల్ 2020 నుండి మే 2021 వరకు అడపాదడపా నడిచిన ఈ పథకం.. మహమ్మారి మధ్యలో కష్టపడి పనిచేసే ఉద్యోగులను తొలగించాల్సి రావడం, వారి వేతనాలు, హెల్త్ ఇన్య్సూరెన్స్ తీసివేయడం గురించి ఆందోళన చెందుతున్న కంపెనీ యజమానులకు ఒక జీవనాడిలా కనిపించింది.
గరిష్టంగా $10 మిలియన్ల వరకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం
దీనితో, వాణిజ్య బ్యాంకుల ద్వారా ఫెడరల్ ప్రభుత్వం నుండి PPP రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గరిష్టంగా $10 మిలియన్ల వరకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చు. అయితే, దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన PPP రుణాలు ఎవరికి వెళ్లాయి, అవి ఎలా ఉపయోగించబడ్డాయి అనేది ట్రాక్ చేయడం దాదాపు అసాధ్యంగా మారింది. ఇక, ఇంత పెద్ద స్థాయిలో జరిగిన మోసాన్ని సరిగ్గా మానిటర్ చేయని విభాగాలు, అధికారులపై ఇప్పుడు మస్క్ సలహాతో ట్రంప్ గురిపెట్టారు.
రుణాలు పొందినవారిలో బడా కంపెనీలే అధికం
కరోనా సాయం పేరుతో వచ్చిన పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కింద అమెరికాలోని చిన్న చిన్న కంపెనీలు ఊపిరి పీల్చుకుంటాయని అనుకున్నారు. కానీ, ఆ మధ్య యూఎస్ ట్రెజరీ విడుదల చేసిన జాబితాలో.. రుణాలు పొందినవారిలో ఎక్కువ కంపెనీలు పేరు మోసిన బడా కంపెనీలే అని తేలడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ లిస్ట్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కుటుంబానికి చెందిన వ్యాపారాలు.. నాటి రవాణా కార్యదర్శి ఎలైన్ చావో కుటుంబానికి చెందిన షిప్పింగ్ వ్యాపారం, కాంగ్రెస్ సభ్యుల బంధువుల కుటుంబాలు, వారి జీవిత భాగస్వాముల కంపెనీలు.. ఇలా, పలుకుబడి ఉన్న కుటుంబాల వ్యాపారాలకు లోన్లు అందాయని ఆరోపణలు ఉన్నాయి.
సెలబ్రెటీలకు చెందిన ఫ్యాషన్ కంపెనీలకూ లూటీలో వాటా
చాలా మంది సెలబ్రెటీలకు చెందిన ఫ్యాషన్ కంపెనీలు కూడా ఈ లూటీలో వాటా పొందారు. అంతేనా… ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన డజన్ల కొద్దీ అద్దెదారులు కూడా ఈ పథకం కింద డబ్బు నొక్కేసారు. ఇప్పుడు వాటన్నింటి లెక్కా తేల్చాలంటూ అదే ట్రంప్ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టడం విచిత్రంగానే కాదు, షాకింగ్ కూడా. అయితే, దీనికి బాధ్యత మాత్రం గత ప్రభుత్వంలోని అధికారులదే అన్నది మస్క్ వాదన. ఏది ఏమైనప్పటికీ.. దీన్ని పెంచి పోషించిన అమెరికన్ ట్రెజరీని మూసేయడమే పనిగా మస్క్ చర్యలు ఉన్నాయి.
ఆఫ్‌లైన్‌లో పడిన యూఎస్ ఎయిడ్ వెబ్‌సైట్
అయితే, అమెరికన్ ట్రెజరీలో లెక్కల లుకలుకలు బయటపెట్టడానికి ట్రెజరీ వ్యవస్థకు సంబంధించిన అన్ని శాఖల్లో మస్క్‌కు యాక్సెస్ ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీనితో, ట్రెజరీలో ఆందోళనలు మొదలయ్యాయి. ఫెడరల్ ఏజెన్సీల తరపున సంవత్సరానికి $6 ట్రిలియన్లకు పైగా చెల్లింపులు చేస్తున్న ట్రెజరీ లెక్కలను ఇలా ఎవరికి పడితే వాళ్లకు చూపించడం పద్దతి కాదంటూ అధికారులు వాపోతున్నారు. సోషల్ సెక్యూరిటీ చెల్లింపుల నుండీ ట్యాక్స్ రిటర్న్స్, ప్రభుత్వం నుండి ఇతర గ్రాంట్ల చెల్లింపుల వరకూ.. వీటన్నింటీనీ స్వీకరించే మిలియన్ల మంది అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని ప్రజాప్రతినిధులు కాని వాళ్లు యాక్సెస్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీనిపైన, సెనేట్ ఫైనాన్స్ కమిటీ సభ్యులు.. పన్ను చెల్లింపుదారుల సున్నితమైన డేటా ఎందుకు బయటకు ఇస్తున్నారంటూ వివరణ అడుగుతున్నారు. అయితే, మస్క్‌కు ట్రంప్ మద్దతు ఉంది కాబట్టి, ఇప్పుడు వీళ్ల మాటలు పెద్దగా చెల్లవు. అందులోనూ, మస్క్ పనితనం గురించి, ట్రంప్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. “అమెరికా పెట్టే దుబారా ఖర్చును తగ్గించడంలో మస్క్ మస్త్‌గా పనిచేస్తున్నారని” అంటున్నారు.
ఇక, ఇప్పటికే, USAid వెబ్‌సైట్ ఆఫ్‌లైన్‌లో పడింది. కొంతమంది వినియోగదారులు దానిని యాక్సెస్ చేయలేకపోతున్నారు. అయితే, USAidను పూర్తిగా మూసివేస్తే… అందులో పనిచేసే 10 వేల కంటే ఎక్కువ మంది సిబ్బంది పరిస్థితి ఏంటన్నది ఇప్పుడొస్తున్న ప్రశ్న. అయితే, ట్రంప్ తన “అమెరికా ఫస్ట్” విధానంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా అందిస్తున్న విదేశీ సహాయాన్ని స్తంభింపజేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ఈ ఆర్డర్‌తో ప్రపంచవ్యాప్తంగా షాక్ తగిలింది.
థాయ్ శరణార్థి శిబిరాల్లోని ఫీల్డ్ ఆసుపత్రులు…
థాయ్ శరణార్థి శిబిరాల్లోని ఫీల్డ్ ఆసుపత్రులు, యుద్ధ ప్రాంతాల్లో ల్యాండ్‌మైన్ తొలగింపులు, HIV వంటి వ్యాధులతో బాధపడుతున్న లక్షలాది మందికి చికిత్స చేయడానికి మందులు, నిర్మూలన ప్రమాదంలో ఉన్న కార్యక్రమాల పరిస్థితి సందిగ్థంలో పడింది. అయితే, పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ.. అమెరికా ఖర్చులు, పథకాల పేరుతో జరుగుతున్న మోసం తగ్గించడం గురించి మరింత విస్తృతంగా పనిచేస్తామని మస్క్ అంటున్నారు. ట్రంప్ పరిపాలనలో వచ్చే ఏడాదికి అమెరికా లోటు నుండి $1 ట్రిలియన్లను తగ్గిస్తుందని మస్క్ అంచనా వేస్తున్నారు.
HIV వంటి వ్యాధులతో బాధపడుతున్నవారికి చికిత్స, మందులు
మస్క్ బాధ్యత వహిస్తున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ.. యూఎస్ ఎయిడ్‌ను “నేర సంస్థ”, “ఫైనాన్షియల్ బ్లాక్ హోల్” అని పేర్కొంది. మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో, ఈ ఏజెన్సీ చాలా కాలంగా అమెరికన్ ప్రయోజనాలపై ప్రభావం చూపని ప్రాజెక్టుల్లోకి డబ్బును మళ్లిస్తోందని ఆరోపిస్తోంది. యునైటెడ్ స్టేట్స్ కోసం వ్యూహాత్మక సాధనంగా కాకుండా ప్రపంచ దాతృత్వ సంస్థగా యూఎస్ ఎయిడ్ పనిచేస్తోందని పేర్కొంది.
అమెరికన్ ప్రయోజనాలకు పనికిరాని ప్రాజెక్టుల్లోకి డబ్బు
ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ.. ఒక ప్రభుత్వ విభాగాన్ని పూర్తిగా మూసివేయడంపై ఇప్పుడు అమెరికా మండిపడుతోంది. ఇక, పెరుగుతున్న ప్రజా ఒత్తిడి కారణంగా.. ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ప్రస్తుత యూఎస్ ఎయిడ్ నాయకత్వాన్ని తొలగించి, సెనేటర్ మార్కో రూబియోను ఏజెన్సీ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించారు. ఈ చర్య వల్ల ఏజెన్సీ విశ్వసనీయతను పెంచడం, దాని నిధులు అమెరికన్ జాతీయ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడే విధంగా మార్చడానికి పూనుకున్నారు.
1951లో ఇండియా అత్యవసర ఆహార సహాయ చట్టం
నిజానికి, ఈ యూఎస్ ఎయిడ్ నుండి భారత్‌కి కూడా ఆర్థిక సాయం అందుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్.. 1951లో ఇండియా అత్యవసర ఆహార సహాయ చట్టంపై సంతకం చేసారు. అప్పటి నుండి అమెరికా భారతదేశానికి అభివృద్ధి, మానవతా సహాయం అందిస్తోంది. దీనితో, దశాబ్దాలుగా అత్యవసర ఆహార సరఫరా నుండి మౌలిక సదుపాయాల అభివృద్ధి, కీలకమైన భారతీయ సంస్థల సామర్థ్యం పెంచడం వంటి కార్యక్రమాలకు నిధులు వాడుతున్నారు. అమెరికా నుండి అందిన ఆర్థిక సహాయంతో.. దేశంలో మొదటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు, ఎనిమిది వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, 14 ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాలల స్థాపనలో సహాయం అందింది.
అమెరికన్ ప్రయోజనాలకు పనికిరాని ప్రాజెక్టుల్లోకి డబ్బు
అలాగే, భారత జాతీయ రోగనిరోధకత, కుటుంబ నియంత్రణ, మాతా శిశు ఆరోగ్యం, HIV/AIDS, క్షయ, పోలియో కార్యక్రమాలు కూడా బలోపేతం కావడంలో సహాయపడింది. అయితే, వీటన్నింటికీ అన్ని దేశాల మాదిరిగానే షరతులు కూడా లేకపోలేదు. ఉదాహరణకి, 1965లో యూఎస్ ఎయిడ్ నుండి భారతదేశానికి చెన్నైలో ఒక రసాయన ఎరువుల కర్మాగారాన్ని నిర్మించడానికి $67 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చింది. అయితే, దీనికి భారత ప్రభుత్వం కాకుండా, ఒక ప్రైవేట్ అమెరికన్ కంపెనీ పంపిణీ బాధ్యత వహించాలని షరతు ఉంది. అలాగే, ఈ ప్రాంతంలో అదనపు ఎరువుల కర్మాగారాలు నిర్మించకూడదనే షరతు కూడా ఉంది. అయితే, 2004లో, భారత ప్రభుత్వం షరతులతో వచ్చే ఎలాంటి విదేశీ సహాయాన్ని అయినా తిరస్కరించాలని నిర్ణయించింది. దీనితో, అటువంటి సహాయం తగ్గుతూ వచ్చింది.
రసాయన ఎరువుల కర్మాగార నిర్మాణానికి $67 మిలియన్ల రుణం
ఇక, ఏది ఏమైనప్పటికీ.. అమెరికా ఆర్థిక వ్యవస్థను రిపేర్ చేసే క్రమంలో.. మస్క్ తేల్చాలనుకుంటున్న లెక్కలతో అమెరికా బాగుపడుతుందని ట్రంప్ వాదిస్తున్నారు. అయితే, దేశమంటే ప్రజలు సుభీక్షంగా ఉండటమే గానీ.. డబ్బు పోగేసుకొని, పెత్తందార్లు బతకడం కాదంటున్నారు ఇంకొందరు. ఎవరు ఏమనుకున్నా.. బాధ్యత లేని పథకాలను ప్రవేశపెడితే.. అది దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తుందని అమెరికా ఒక గుణపాఠాన్ని నేర్పుతోందన్నది వాస్తవం.
బాధ్యత లేని పథకాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బ
ఒక ప్రయివేటు వ్యక్తికి దేశ ట్రెజరీని సమీక్షించే యాక్సెస్ ఇవ్వడం దేశ ఆర్థిక భద్రతకు హాని కలిగిస్తుందనే విమర్శల మధ్య మస్క్‌ను ఉప-ప్రభుత్వ ప్రతినిధి అంటూ ట్రంప్ పరిచయం చేస్తున్నారు. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పటికీ.. దాని ఫలితం ఎలా ఉంటుందనేది ఇప్పుడు అంతర్జాతీయంగా భారీ చర్చ జరుగుతోంది. మరి చివరికి, అమెరికాను ట్రంప్, మస్క్ ద్వయం ఎటు నడిపిస్తారో అనేది ఆసక్తిని రేపుతోంది.