Ishika Taneja: చాలామంది సినీ సెలబ్రిటీలు సైతం 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళలో భాగమవుతున్నారు. ఇతర భక్తులలాగానే వారు కూడా పుణ్య స్నానాలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ఇదంతా సహజమే కానీ సినీ సెలబ్రిటీలు సైతం తమ జీవితంలోని సుఖాలు అన్నీ వదిలేసి సన్యాసినులుగా మారడం మాత్రం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఇప్పటికే ఒక సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ కుంభమేళలో సన్యాసినిగా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరొక బాలీవుడ్ సెలబ్రిటీ కూడా యాడ్ అయ్యింది. తనే ఇషికా తనేజా. తాజాగా ఇషికా కూడా కుంభమేళలో సన్యాసం తీసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మర్చిపోలేని క్షణాలు
సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే సినీ సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. కానీ దానినే జీవితంగా మార్చుకొని ఒకరి తర్వాత ఒకరుగా సన్యాసం తీసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి అని ప్రేక్షకుల్లో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ముందుగా మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో గురు దీక్షా కార్యక్రమానికి హాజరయ్యింది ఇషికా. ఆ తర్వాత జనవరి 29న మహా కుంభమేళకు వచ్చి అక్కడ పవిత్రమైన కార్యంలో భాగమయ్యింది. శంకరాచార్య స్వామి సదానంద్ సరస్వతీ జీ మహారాజ్ చేతుల మీదుగా తను ఆధ్యాత్మిక దీక్షను చేపట్టింది. అది జీవితంలోనే తనకు మర్చిపోలేని క్షణం అంటూ మీడియాతో చెప్పుకొచ్చింది ఇషికా తనేజా.
డ్యాన్స్‌లకే పరిమితం కాదు
‘‘నేను సనాతనీగా ఉండడానికి గర్వపడుతున్నాను. నేను ఆధ్యాత్మికలో సేవ చేయడంలో చాలా కనెక్ట్ అయ్యి ఉంటాను. మహా కుంభమేళలో ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి. శంకరాచార్య జీ నుండి గురు దీక్షను అందుకోవడానికి నా జీవితంలోనే ఘనతను సాధించినట్టుగా ఫీలవుతున్నాను. ఆయన ఒక గురువులాగా ఉండి నా జీవితానికి దారి చూపించారు. చిన్న చిన్న బట్టలు వేసుకొని డ్యాన్స్‌లు చేయడానికి మాత్రమే ఆడవారి జీవితం పరిమితం కాలేదు. సనాతన ధర్మంలో సేవ చేయడానికే వారి జీవితం పరిమితం కావాలి. అందుకే హిందూ ఆచారాలను ఫాలో అవుతూ వాటిని ప్రమోట్ చేసేలా మహిళలు జీవించాలని ఆశిస్తున్నాను’’ అంటూ ఆడవారికి పిలుపునిచ్చింది ఇషికా తనేజా.
Also Read: ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోలపై సంచలన ఆరోపణలు… ఈ హీరోయిన్‌కు ఇంత అవమానం జరిగిందా..?
శాశ్వత మార్పు
ఇషికా తనేజా (Ishika Taneja) హీరోయిన్‌గా మాత్రమే కాకుండా మేకప్ ఆర్టిస్ట్‌గా కూడా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించింది. 2017లో విడుదలయిన ‘ఇందు సర్కార్’ అనే సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఇషికా. అయినా ఇప్పుడు ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పి సన్యాసంలో కలిసిపోయింది. 2018లో మిస్ వరల్డ్ టూరిజం అనే బ్యూటీ పోటీల్లో పాల్గొని విన్నర్‌గా కూడా గెలిచింది ఇషికా తనేజా. ఎన్నో సినిమాల్లో, మ్యూజిక్ వీడియోల్లో నటిగా కనిపించిన తర్వాత సన్యాసినిగా మారడం.. తనకు ఇంటికి తిరిగి వచ్చినట్టుగా ఉందంటూ వ్యాఖ్యలు చేసింది. ఇది కేవలం తాత్కాలిక నిర్ణయం కాదని, తన జీవితాన్ని పూర్తిగా మార్చేసే నిర్ణయం అని తెలిపింది.