BigTV English

Gidugu Venkata Ramamurthy : తెలుగుకు గొడుగు.. ఈ గిడుగు..!

Gidugu Venkata Ramamurthy : తెలుగుకు గొడుగు.. ఈ గిడుగు..!
Gidugu Venkata Ramamurthy

Gidugu Venkata Ramamurthy : తెలుగు భాష అందరిదీననీ, గ్రాంథికంలో ఉన్న అర్థం కాని తెలుగు కంటే.. జనం మాట్లాడే భాషలోనే జీవముందని నమ్మి, దానిని రాత భాషగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన గొప్ప భాషా వేత్త.. గిడుగు రామ్మూర్తి పంతులు గారు. భాషమీద పండితుల పెత్తనాన్ని ప్రశ్నించి, పామరులు మాట్లాడే తెలుగుకు వెలుగు తెచ్చిన ఆ మహనీయుని వర్థంతి సందర్భంగా ఆయన జీవన విశేషాలను స్మరించుకుందాం.


తల్లి పాలతో నేర్చుకొనేది మాతృభాష. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంత భాష అమృతం లాంటిది. ఒకప్పుడు గ్రాంథిక తెలుగులో రాసేవారు. అసలైన తెలుగు వ్యవహారికం అని గిడుగు రామ్మూర్తి పంతులు ప్రకటించారు. వ్యవహారిక భాష కోసం ఉద్యమం చేశారు. వ్యవహారికంలోనే ప్రజల సజీవ భాష ఉందని నిరూపించారు.

రామ్మూర్తి పంతులు గారు.. 1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటలో వీర్రాజు, వెంకమ్మ దంపతులకు జన్మించారు. 1879లో మెట్రిక్ తర్వాత టీచరుగా పనిచేస్తూనే పై చదువులు చదివారు. నాటి స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌ జే.ఏ.యేట్స్‌ అనే ఆంగ్లేయ అధికారి, ఏవీఎస్‌ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస అయ్యంగార్‌, గురజాడ అప్పారావు వంటి వారి మద్దతుతో వాడుక భాషా ఉద్యమాన్ని చేపట్టారు. ఆయన కృషి కారణంగా 1912 – 13లో స్కూలు ఫైనల్ బోర్డు పరీక్షల్లో తెలుగు వ్యాస పరీక్షను గ్రాంథికంలో గాక.. గద్యంలో లేదా వ్యావహారిక భాషలో రాయవచ్చునని ఆదేశాలు వచ్చాయి. ఇది భాషావేత్తగా ఆయనకు దక్కిన తొలివిజయం.


శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని కొండ ప్రాంతాల్లోని వేలాది మంది ‘సవర’ జాతికి చెందిన ఆదివాసులు నివసించేవారు. బయటి ప్రపంచం గురించి, చదువు సంధ్యల గురించి తెలియని వారి ‘సవర’భాషకు ఎలాంటి లిపి లేదు. అది కేవలం మాట్లాడే భాష మాత్రమే. దీంతో పంతులుగారు ఆ భాషను అర్థం చేసుకుని, దానికి ఒక లిపిని రూపొందించారు. క్రమంగా వారు మాట్లాడే పదాలకు అర్థాలను, వారి సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు.. ఇలా ప్రతి అంశానికి సంబంధించి చిన్న చిన్న పుస్తకాలు రాస్తూ వచ్చారు. క్రమంగా అక్కడి పిల్లలు చదువుకునేందుకు సిలబస్ కూడా రూపొందించారు.

క్రమంగా తెలుగు- సవర, సవర – తెలుగు డిక్షనరీని రూపొందించారు. అంతేగాక ఆ సవర పిల్లలు తమ భాషలోనే చదువకునేలా నాటి మద్రాసు ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఈయన కృషి ఫలితంగా 1911లో నాటి మద్రాసు ప్రభుత్వం ఈ సవర పుస్తకాలను, సిలబస్‌ను ఆమోదించటమే గాక సొంత నిధులతో ప్రింట్ చేసింది. ఆదివాసుల కోసం ఎంతో శ్రమించిన రామ్మూర్తి పంతులు సేవలకు నాటి ప్రభుత్వం ఇవ్వజూపిన పారితోషికాన్ని నిరాకరించిన పంతులుగారు.. ‘ఆ డబ్బుతో మంచి బడి పెట్టండి, నేను పెట్టిన బడులకు నిధులు ఇవ్వండి!’ అని కోరారు. దీంతో సవర పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి.

పంతులుగారు 1930లో సవర భాషలో ‘ఎ మాన్యువల్ ఆఫ్ సవర లాంగ్వేజ్’ అనే గ్రామర్ బుక్‌ను రూపొందించారు. అలాగే.. పండితుల రచనలలోని వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలను ఎత్తిచూపుతూ 1911-12 మధ్య ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం అనే గ్రంథాన్ని రాశారు. ఆదివాసీల అక్షరశిల్పిగా, సవర లిపి నిర్మాతగా పంతులుగారి సేవలకు మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం 1933లో కైజర్- ఇ- హింద్ బిరుదును, బంగారు పతకాన్ని బహూకరించగా, నాటి మద్రాసు ప్రభుత్వం ‘రావుబహుద్దూర్‌’ బిరుదు ఇచ్చింది. 1936లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో ఆయనను గౌరవించింది.

శ్రీకాకుళం- ఒరిస్సా బోర్డర్‌లోని తెలుగువారు మెజారిటీగా ఉన్న పర్లాకిమిడిని, మరో 200 గ్రామాలను 1935లో నాటి మద్రాసు ప్రభుత్వం ఒడిసాలో కలపటాన్ని పంతులుగారు గట్టిగా నిరసించారు. 22 ఏళ్ల పాటు మూరుమూల పర్లాకిమిడిలో జీవించి, చివరి రోజులను రాజమండ్రిలోని కుమారుడి వద్ద గడిపారు. చివరి వరకు వాడుక భాషకు గౌరవాన్ని తెచ్చేందుకు శ్రమించిన పంతులుగారు 1940 జనవరి 22న కన్నమూశారు. ఆయన జయంతిని (ఆగస్టు 29) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాతృభాషా దినోత్సవంగా జరుపుతోంది. నేటి ఆయన వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళి.

Related News

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Congress: గుత్తా లేఖల వెనక సీక్రెట్ ఏంటి?

AP Politics: టీడీపీలో సంస్థాగత మార్పులపై రచ్చ!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొత్తం స్క్రిప్టా… మరీ ఇంత మోసమా?

AP Politics: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?

Telangana BJP: సీక్రెట్‌గా షోకాజ్ నోటీసులు.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది?

Big Stories

×