IRCTC business ideas: రైలు ప్రయాణం అంటే ప్రతి రోజు లక్షలాది మంది ఉపయోగించే ప్రధాన రవాణా సౌకర్యం. టికెట్ బుకింగ్ విషయంలో చాలా మంది IRCTC వెబ్‌సైట్, యాప్ ద్వారా స్వయంగా బుక్ చేసుకుంటారు. కానీ అందరికీ ఆన్‌లైన్ సదుపాయాలు ఉపయోగించే పరిజ్ఞానం ఉండకపోవడం వల్ల ఎక్కువమంది IRCTC అనుమతితో పని చేసే ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటారు. ఈ ఏజెంట్ల పని తీరు, సంపాదన అవకాశాలు సాధారణంగా అందరికీ తెలియవు. ఇప్పుడు ఈ ఏజెంట్లు ఎలా పనిచేస్తారు, ఎంత సంపాదిస్తారు, వారి వ్యాపారం ఏ విధంగా కొనసాగుతుందో వివరంగా తెలుసుకుందాం.
ఏజెంట్లు అంటే ఎవరు?
ముందుగా IRCTC అనుమతితో పనిచేసే ఏజెంట్లు అంటే ఎవరో చూద్దాం. వీరు అధికారికంగా IRCTC వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని, ప్రత్యేకమైన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ పొందుతారు. ఈ లైసెన్స్ వారిని చట్టబద్ధంగా టికెట్లు బుక్ చేయడానికి అనుమతిస్తుంది. వీరు టికెట్లు బుక్ చేయడానికి IRCTC నుండి ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తారు. ఈ కారణంగా కస్టమర్లు వీరిని నమ్మి టికెట్ బుక్ చేయించుకోవడానికి వస్తుంటారు.
వీరి ఆదాయమెంత?
ఇప్పుడు వీరి సంపాదన విధానం గురించి మాట్లాడితే, 2 రకాలుగా ఆదాయం వస్తుంది. ఒకటి IRCTC నుండి వచ్చే కమీషన్, మరొకటి ప్రయాణికుల నుండి తీసుకునే సర్వీస్ ఛార్జ్. IRCTC ఏజెంట్లకు స్లీపర్ క్లాస్ టికెట్ బుకింగ్‌పై సుమారు రూ. 20 కమీషన్ వస్తుంది. ఇక 3AC లేదా ఇతర AC కోచ్‌ల టికెట్ బుకింగ్‌పై రూ. 40 వరకు కమీషన్ అందుతుంది. దీని పక్కనే కస్టమర్ల నుండి కూడా సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తారు. ఈ ఛార్జ్ ఏజెంట్ లొకేషన్‌పై ఆధారపడి ఉంటుంది. చిన్న పట్టణాల్లో సాధారణంగా రూ.30 – రూ. 50 వరకు ఛార్జ్ తీసుకుంటారు, కానీ నగరాల్లో బిజీ ఏరియాల్లో ఇది రూ. 50 నుండి రూ. 100 వరకు కూడా ఉంటుంది.
ఇలా రోజుకు పది, ఇరవై లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు బుక్ చేస్తే ఒక ఏజెంట్‌కు నెలసరి ఆదాయం బాగా వస్తుంది. ఉదాహరణకు చిన్న పట్టణాల్లో ఏజెంట్ నెలకు రూ.20,000 నుండి రూ. 30,000 వరకు సంపాదిస్తారు. కానీ రైల్వే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాలు, బిజీ ఏరియాల్లో పనిచేసే ఏజెంట్లు రూ. 50,000 నుండి రూ. 1,00,000 వరకు సులభంగా సంపాదించగలరు. ముఖ్యంగా పండగ సీజన్, వేసవి హాలిడే సీజన్, ప్రత్యేక రైళ్ల సమయంలో ఈ ఆదాయం మరింత పెరుగుతుంది. ఆ సమయంలో ఒకే రోజు వందల టికెట్లు బుక్ చేయడం అసాధారణం కాదు.
పెట్టుబడి తక్కువే..
IRCTC ఏజెంట్‌గా పనిచేయడానికి కొంత ప్రారంభ పెట్టుబడి అవసరం అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు, వార్షిక రిన్యువల్ ఫీజు, మంచి ఇంటర్నెట్ సదుపాయం, ప్రింటర్, సిస్టమ్ వంటి సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలి. అలాగే తత్కాల్ బుకింగ్ సమయంలో సెకన్ల వ్యవధిలో టికెట్ కన్ఫర్మ్ అయ్యేలా మంచి టెక్నికల్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇదంతా ఉన్నవారికి ఈ వ్యాపారం లాభదాయకం అవుతుంది.
IRCTC ఏజెంట్లకు రైల్వే నుంచి మాత్రమే కాకుండా కస్టమర్ల నుంచి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక స్లీపర్ టికెట్ బుక్ చేసినా, కనీసం రూ. 30 నుండి రూ. 50 వరకు అదనంగా వస్తుంది. అదే AC క్లాస్ అయితే మరింత ఎక్కువగా వస్తుంది. ఒక రోజులో 20 టికెట్లు బుక్ చేసినా, రూ. 1,000 పైగా సంపాదించగలరు. అంతేకాదు, సీజన్ టైంలో తత్కాల్ టికెట్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఒక్క టికెట్‌కు కూడా అధిక సర్వీస్ ఛార్జ్ తీసుకోవచ్చు.
ఇక ఏజెంట్లకు అదనపు ఆదాయ మార్గాలు కూడా ఉంటాయి. కేవలం రైల్వే టికెట్లే కాకుండా బస్ టికెట్లు, విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్, పాస్‌పోర్ట్ అప్లికేషన్ సర్వీసులు, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సర్వీసులు అందిస్తే వారి ఆదాయం మరింత పెరుగుతుంది. కొన్ని ఏజెంట్లు టూరిస్ట్ ప్యాకేజీలు కూడా బుక్ చేస్తారు, వాటి ద్వారా నెలకు అదనంగా రూ.10,000 నుండి రూ. 20,000 వరకు సంపాదించవచ్చు.
ఈ వ్యాపారంలో నెట్‌వర్క్ చాలా ముఖ్యం. పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది కస్టమర్లకు పరిచయం పెంచుకుంటే, బుకింగ్స్ సంఖ్య కూడా ఎక్కువవుతుంది. ఒకసారి నమ్మకం ఏర్పడితే, కస్టమర్లు తిరిగి తిరిగి వచ్చి టికెట్లు బుక్ చేయించుకుంటారు.
Also Read: IRCTC Shirdi Package: విజయవాడ నుంచి షిరిడీకి రైల్వే సూపర్ ప్యాకేజ్.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
అయితే, చట్టబద్ధమైన లైసెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. లైసెన్స్ లేకుండా బుక్ చేసే ఏజెంట్లను రైల్వే అధికారులు గుర్తించి చర్యలు తీసుకుంటారు. అందువల్ల IRCTC అనుమతితో పనిచేస్తేనే దీర్ఘకాలికంగా, భద్రతతో ఈ వ్యాపారం కొనసాగించవచ్చు.
మొత్తం మీద, రైల్వే టికెట్లు అమ్మే ఏజెంట్లకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే రైలు ప్రయాణం భారతదేశంలో మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలకు ప్రధాన రవాణా సాధనం. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు తాము టికెట్ బుక్ చేసుకున్నా, చాలామంది ఇప్పటికీ ఏజెంట్లపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రంగంలోకి రావాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.
IRCTC అనుమతితో ఈ వ్యాపారం ప్రారంభిస్తే, ప్రారంభ దశలోనే సులభంగా నెలకు రూ. 20,000 పైగా సంపాదించవచ్చు. అనుభవం పెరిగే కొద్దీ, కస్టమర్ల సంఖ్య పెరిగే కొద్దీ, నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం కూడా ఉంటుంది.