Congress: శాసనమండలి చైర్మన్ హోదాలో ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి సీనియర్‌మోస్ట్ పొలిటీషియన్. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆయన విమర్శలకు పోకుండా కొత్త పాలిటిక్స్ చేస్తున్నారా..? ఆయన తన వ్యాఖ్యలు, లేఖాస్త్రాలతో ప్రభుత్వానికి చురక లాంటిస్తున్నారా..? ఆయన ప్రభుత్వానికి రాస్తున్న వరస లేఖల్లో ఆంతర్యమేంటి..? అంతటి కీలక పదవిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ నేత గుత్తాప్రభుత్వానికి సడన్‌గా రాజకీయ ప్రేమ లేఖలు ఎందుకు రాస్తున్నారు?
నల్లగొండ జిల్లా రాజకీయాల్లో గుత్తా సుఖేందర్‌రెడ్డి ముద్ర
ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి సీనియర్ నేతగా ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గుత్తా సుఖేందర్ రెడ్డి.. రాజకీయాల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. మూడుసార్లు ఎంపీగా, రెండోసారి శాసనమండలి సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యాంగ బద్ధమైన శాసనమండలి చైర్మన్ గా కొనసాగుతున్నారు. నిత్యం ప్రజాజీవితంలో ఉండేందుకే ఇష్టపడే సుఖేందర్ రెడ్డి.. ముక్కు సూటిగా వ్యవహరిస్తారని పేరుంది. పార్టీల కతీతంగా వివాదారహితుడిగా గుత్తాను నేతలు, కార్యకర్తలు అభిమానిస్తారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ ఆయన ప్రజా సమస్యలపై స్పందిస్తుంటారు. అవసరమైన సందర్భాల్లో రాజకీయ వ్యాఖ్యలు చేయడంతోపాటు ప్రభుత్వానికి లేఖాస్త్రాలు సంధిస్తున్నారట. ప్రజాపాలనలో ప్రభుత్వం విమర్శలు పాలుకావొద్దని పలు సమావేశాల్లో గుత్తా పరోక్ష హెచ్చరికలు చేశారట. తన రాజకీయ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సలహాలు, సూచనలతో సుతిమెత్తని చురకలంటిస్తున్నారట.
ఇరిగేషన్ ప్రాజెక్టుల రివ్యూ సమావేశాల్లోకీలక వ్యాఖ్యలు
ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పట్టున్న గుత్తా.. ఇరిగేషన్ ప్రాజెక్టుల రివ్యూ సమావేశాల్లో .. కీలక వ్యాఖ్యలు చేశారట. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు పుట్టంగండి నుండి సాగునీటిని విడుదల చేయాలని ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. దానికి కౌంటర్ గా తనదైన శైలిలో స్పందించిన గుత్తా పుట్టంగండి పంపుహౌజ్ వద్ద ఐదో మోటారు అమర్చేందుకు రూ.148కోట్లు తక్షణమే మంజూరు చేయాలని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఎంఎమ్ఆర్‌పీ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ లైనింగ్ పనుల విషయంలో కూడా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇదేరకంగా స్పందించారట. రూ.400కోట్లు లైనింగ్ పనులకు శాంక్షన్ చేశామని మంత్రి ఉత్తమ్ చెప్పినప్పుడు కూడా కేవలం లైనింగ్ మాత్రమే సరిపోదని, కాలువ వెడల్పు కూడా పెంచాలని దానికి తగ్గట్టుగా డిజైన్ చేయాలని సూచించారట. అంతేకాదు ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యం చేస్తోందని, దాని వల్ల కేడర్‌లో అసంతృప్తి పెరిగిపోయే ప్రమాదం ఉందని గతంలో గుత్తా హాట్ కామెంట్స్ చేశారు.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి గుత్తా సుఖేందర్ లేఖ
తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా గుత్తా సుఖేందర్ లేఖ రాశారు. రాష్ట్రంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో చేసిన పనులకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించ లేదు. స్కూల్ బిల్డింగ్ ల నిర్మాణం కోసం అప్పటి కాంట్రాక్టర్లు, స్కూల్ మేనేజ్మెంట్ .. ఎస్ఎంసీ కమిటీలు అప్పుల పాలయ్యాయరని తక్షణమే రూ.361.350కోట్లు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మన ఊరు మన బడి బిల్లులు చెల్లించాలని పలువురు కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ కు లేఖ రాయడం వెనక అంతర్యమేమై ఉంటుందని జిల్లాలో చర్చ జరుగుతోందట. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒరవడిని సృష్టించుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఏ విషయంలో కూడా రాజీపడటంలేదంట. గుత్తా బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కూడా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన సందర్బాలు అనేకం ఉన్నాయట. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు భూసేకరణ విషయంలో గుత్తా చొరవతోనే రైతులను ఒప్పించగలిగారట.
కొడుకు గుత్తా అమిత్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసమా?
ఉపాధి హామీ నిధుల పంచాయితీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కౌంటర్‌గా జిల్లా కలెక్టర్ కు గుత్తా నోటీసులు ఇచ్చారు. జిల్లాలో ప్రభుత్వం తరపున జరిగే ప్రతి కార్యక్రమానికి, జిల్లా మంత్రుల రివ్యూ మీటింగ్‌లలో పాల్గొంటున్న గుత్తా ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి పరోక్ష చురకలు అంటిస్తూ, విమర్శలు చేస్తున్నారట. తనయుడు గుత్తా అమిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేయడానికి పెద్దాయన పావులు కదుపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోది. ఇప్పటికే ఆయన కుమారుడు అమిత్ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read: 4 ఆలయాలు.. 4 పిల్లులు బలి.. ఆ గ్రామానికి అరిష్టమా?
అమిత్‌రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ కోసమే గుత్తా.. రాజకీయ వ్యాఖ్యలతో, ప్రభుత్వానికి లేఖాస్త్రాలతో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారట. మొత్తానికి ఆయన పొలిటికల్ ప్రేమలేఖల వెనక ఆంతర్యం ఏంటని పొలిటికల్ సర్కిల్స్ చర్చించుకుంటున్నారట. మరికొందరు మాత్రం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖాస్త్రాలతో సరికొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టారనీ జిల్లాలో టాక్. మరి సీనియర్‌మోస్ట్ లీడర్ అయిన గుత్తా వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
Story By Rami Reddy, Bigtv