BigTV English
Advertisement

Madapati Hanumantrao : సంస్కరణల ఘనాపాటి.. మన మాడపాటి..!

Madapati Hanumantrao : సంస్కరణల ఘనాపాటి.. మన మాడపాటి..!
Madapati Hanumantrao

Madapati Hanumantrao : నిద్రాణమై ఉన్నతెలంగాణ సమాజాన్ని విద్యాపరంగా, సాంస్కృతికంగా వారిని చైతన్య పరచిన మహనీయుల్లో మాడపాటి హనుమంతరావు అగ్రగణ్యులు. తెలంగాణలో ‘ఆంధ్రమహాసభ’ సంస్థాపక కార్యదర్శిగా, గ్రంథాలయ ఉద్యమ పతాకగా, తెలంగాణ విముక్తి పోరాటానికి సూత్రధారిగా ఆయన సేవలందించారు.


హనుమంతరావు 1885 జనవరి 22న కృష్ణా జిల్లా నందిగామ తాలూకా పోకునూరు గ్రామంలో జన్మించారు. తండ్రి వెంకటప్పయ్య, తల్లి వెంకట సుబ్బమ్మ. అయిదేళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న హనుమంతరావును సూర్యాపేటలో ఉండే మేనమామ జమలాపురం వెంకట్రావు తీసుకుపోయి అక్కడే చదివించారు. వెంకట్రావు తహశీల్దార్ ఆఫీసులో ‘పేష్కారు’గా పనిచేయటం, ఉద్యోగ బదిలీల్లో భాగంగా సూర్యాపేట, జడ్చర్ల, నల్గొండలకు మారటంతో హనుమంతరావు కూడా ఆయా ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేయాల్సి వచ్చింది.

1898లో ఉర్దూ మిడిల్ పరీక్షలో, 1900లో ఇంగ్లిష్ మిడిల్ క్లాసులో, 1903లో వరంగల్ హై స్కూల్ నుంచి మెట్రిక్యులేషన్‌లో హనుమంతరావు ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లిష్, ఉర్దూతో పాటు పారశీకం, తెలుగు, సంస్కృత భాషల్లోనూ పట్టు సాధించిన ఆయన, 1904లో హన్మకొండలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ‘మీర్ మున్షీ’ ఉద్యోగం సంపాదించారు. తర్వాత హైదరాబాద్‌లో ‘లా’ చదివి ‘సిరస్తెదారు’గా విధులు నిర్వహించారు.


నిజాం పాలనలో ఉర్దూకు తప్ప తెలుగుకు ఏ విలువా లేకపోవటం, 1918లో ఏర్పడిన ఉస్మానియా వర్సిటీలోనూ ఉర్దూ మీడియమే ఉండటం, మొత్తం తెలంగాణలో 18 మాధ్యమిక పాఠశాలలే ఉండటం, గ్రామాల్లో స్కూళ్లే లేకపోవటంతో ఆయన సొంత స్కూల్ పెట్టాలని ప్రయత్నించారు. కానీ.. ప్రైవేట్ పాఠశాలలకు నిజాం సర్కారు ‘నో’ చెప్పటంతో రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి సాయంతో ప్రభుత్వాన్ని ఒప్పించి 1921లో ‘పరోపకారిణీ బాలికా పాఠశాల’ను, నారాయణగూడలో ‘ఆంధ్ర బాలికోన్నత పాఠశాల’ను ప్రారంభించారు. తెలుగు బాల బాలికలకు హాస్టళ్లు, వితంతు బాలికలకు శరణాలయాలు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ సంస్థానంలో ఒక్క తెలుగు లైబ్రరీ కూడా లేకపోవటంతో, 1901లో హైదరాబాద్ సుల్తాన్ బజారులో ‘శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం’ స్థాపించి, దానిని తెలంగాణలో గ్రంథాలయోద్యమానికి కేంద్రంగా మార్చారు. ఈ వెంటనే 1904లో హన్మకొండలో ‘శ్రీ రాజరాజనరేంద్ర ఆంధ్రభాషా నిలయం’ స్థాపన జరిగింది. ఇలా.. 1914 నాటికి తెలంగాణలో 125 గ్రంథాలయాలు స్థాపించి వాటిలో సాహిత్య, సాంస్కృతిక, వైజ్ఞానిక సభలు నిర్వహిస్తూ గ్రామీణుల్లో చైతన్యం తీసుకొచ్చారు. దీంతో ఇక్కడి యువతలో తెలుగు పట్ల మమకారం మరింత పెరిగింది. 1917లో ఉద్యోగానికి రాజీనామా చేసి లాయరుగా పనిచేశారు.

సరిగ్గా.. ఇదే 1921 నవంబర్ 11, 12 తేదీల్లో ‘గౌలీగూడా’లోని ‘వివేకవర్థినీ’ థియేటర్‌లో ‘నిజాం రాష్ట్ర సంఘ సంస్కరణ సభ’ జరిగింది. దీనికి ప్రముఖ సంఘ సంస్కర్త, పుణే మహిళా వర్సిటీ స్థాపకుడైన ‘మహర్షి ధోండే కేశవ కార్వే’ అధ్యక్షత వహించి, మరాఠీలో, ఆ తర్వాత ఇంగ్లిష్‌లో ప్రసంగించారు. అనంతరం అల్లంపల్లి వెంకట రామారావు తెలుగులో ఉపన్యాసం ప్రారంభించగానే సభలోని ఆంధ్రేతరులు ఆయన తెలుగు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో 11 మంది తెలుగు యువకులు ‘ఆంధ్ర జన సంఘం’ స్థాపించారు. నిజాం రాష్ట్రంలో ఆంధ్రుల మొదటి ప్రజా సంస్థ ఇదే. దీనికి హనుమంతరావును కార్యదర్శిగా ఎన్నుకున్నారు.

యూరప్‌లో 18వ శతాబ్దంలో అంతమైన ‘ఫ్యూడల్ వ్యవస్థ’ హైదరాబాద్ సంస్థానంలో 20వ శతాబ్దం మధ్య వరకూ కొనసాగటం మీదా హనుమంతరావు పోరాడారు. ‘బ్రిటిష్ ఇండియా రాష్ట్రాల్లో 1885లో అమల్లోకి తెచ్చిన స్థానిక స్వపరిపాలనా పద్ధతిని హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశపెట్టాలని 1935లో ఆంధ్రమహాసభ నిజాంను వేడుకోవటాన్ని బట్టి ఇక్కడి ప్రజలు మిగిలిన సమాజం కంటే 50 ఏళ్లు వెనకబడ్డారని ప్రకటించారు. దీనికోసం కొత్వాల్ రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు లాంటి ప్రముఖులతో కలసి నిజాంపై పలు పోరాటాలకు దిగారు.

బుక్కపట్నం రామానుజాచార్యులు అనే న్యాయవాదితో కలిసి ‘తెలంగాణా పత్రిక’ను ప్రారంభించారు. సురవరం ప్రతాపరెడ్డి ‘గోలకొండ’, వద్దిరాజు సీతారామచంద్రరావు‘తెలుగు పత్రిక’, సబ్నవీసు వెంకట రామనరసింహారావు ‘నీలగిరి’ పత్రికల్లో, ‘ముషీరె దక్కన్’ అనే ఉర్దూ పత్రికలోనూ పలు వ్యాసాలు రాశారు. సుమారు పాతికకు పైగా పుస్తకాలు, కథలు రాశారు. బంకించంద్ర ఛటర్జీ బెంగాలీ నవల ‘ఆనందమఠం’ను తెలుగులోకి అనువదించారు. 1911లో ‘గారిబాల్డీ’ జీవిత చరిత్ర రాశారు. 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను స్వీకరించారు.

మాడపాటి హనుమంతరావు తన మేనమామ కూతురు అన్నపూర్ణమ్మను వివాహం చేసుకున్నారు. ఈమె 1917లో మరణించగా, తర్వాత మాణిక్యమ్మతో వివాహమైంది. ఈమె ‘సిరిసిల్ల’లో జరిగిన ‘ఆంధ్ర మహాసభకు’ అధ్యక్షత వహించారు. 1941 నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసి, 1951 హైదరాబాద్ మేయరుగా ఎన్నికై 1954 వరకు కొనసాగారు. 1952 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థిగా గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓడినా, 1958లో శాసనమండలి ఛైర్మన్‌గా ఎన్నికై 1964 వరకు మండలిని హుందాగా నడిపారు. 1955లో పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. దీనిని అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఆయనే. తెలంగాణ భాషా వికాసానికి, సామాజిక చైతన్యానికి జీవితాంతం కృషిచేసిన మాడపాటి హనుమంతరావు 1970 నవంబర్ 11న హైదరాబాద్‌లో కన్నుమూశారు. వారి స్మృతికి ఘన నివాళి.

Related News

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Big Stories

×