Srikakulam News: తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు పెద్దలు నిరాకరించారని ఓ యువకుడి సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పొందూరు మండలం కింతలి కనిమెట్టకు చెందిన శివ కుమార్ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తానే పోలీసులకు కాల్ చేసి ఆత్మహత్యకు పాల్పడబోతున్నట్టు తన గోడు అంతా చెప్పుకున్నాడు. పోలీసులు అక్కడకు చేరుకుని యువకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తనకు న్యాయం చేస్తానని భరోసా కల్పించి చివరకు కింద దింపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కింతలి కనిమెట్టకు చెందిన శివకుమార్, ఎచ్చర్ల మండలం ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన ఓ యువతి గత ఐదేళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యారు. అంతా బాగానే ఉంది కాకపోతే ఇద్దరు కులాలు వేరు. దీంతో అమ్మాయి తరఫున కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి నిరాకరించారు. దీంతో శివకుమార్ చాలా రోజుల నుంచి మనస్థాపానికి గురయ్యాడు.
ALSO READ: Paramedical Staff Jobs: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. మంచి వేతనం, ఇంకా 5 రోజులే గడువు
కులాలు వేరే వేరు కావడంతో తమ పెళ్లి జరగడం లేదని ఎప్పుడూ ఆవేదన చెందుతూ ఉండేవాడు. చివరకు ఏం చేయాలో తోచలేక బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ.. హల్ చల్ చేశాడు. దీంతో స్థానికులకు భయాందోళనకు గురయ్యారు. తానే స్వయంగా పోలీసులకు 112కి కాల్ చేసి తాను గోడును అంతా చెప్పుకున్నాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకుని శివకుమార్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చట్ట ప్రకారం కచ్చితంగా న్యాయం చేస్తామని పోలీసులు అతనికి భరోసా కల్పించారు.
హామీ ఇచ్చిన అనంతరం యువకుడు శివకుమార్ సెల్ టవర్ నుంచి కిందకు దిగాడు. దీంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సెల్ టవర్ దిగిన అనంతరం శివ కుమార్ మాట్లాడుతూ.. తనకు న్యాయం చేయాలని పోలీసులు వేడుకున్నాడు. గత ఐదేళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. ఐదేళ్ల స్వచ్ఛమైన ప్రేమకు ఎవరూ అడ్డుపడకూడదని.. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరాడు. తర్వాత ఆ యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు.