Good News: చికెన్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. నాన్ వెజ్ ప్రియులకు ముక్కలేనిదే ముద్ద దిగదు. సండే వస్తే సంతకు వెళ్లి చికెన్ తెచ్చుకోవడం కామన్. పొరిగింట్లో పొయ్యిమీద చికెన్ వండితేనే ఆ పొగలకు మన నోట్లో నీళ్లూరుతాయి. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్, కేఎఫ్‌సి లాంటి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు లొట్టలేసుకుంటూ తింటారు. అది మార్కెట్లో చికెన్‌కు ఉండే క్రేజ్. అలాంటి చికెన్ లవర్స్‌కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా చికెన్ రేట్లు తగ్గాయి. మొన్నటి వరకు కిలో చికెన్ రూ.220 నుంచి రూ.230 వరకు ఉండగా, ప్రస్తుతం భారీగా తగ్గింది. ప్రస్తుతంరూ. 150 నుంచిరూ. 170 మధ్య ఉంది. ఇటు ఎగ్స్ రేట్లు కూడా తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్ కేవలం కిలో 40 రూపాయలకే అమ్ముతున్నారట.
చికెన్ రేట్లు తగ్గడానికి కారణం ఇదే..
ఏపీలో పలు ప్రాంతాల్లో కోళ్లు మృతి చెందడంతో చాలా మంది ప్రజలు.. చికెన్ తినవచ్చా లేదా అన్న అనుమానాలతో వాటికి దూరంగా ఉంటున్నారు. ఇప్పటివరకు గుర్తించని ఓ వైరస్ కోళ్లకు సోకుతుండడంతో కోళ్లఫారం యజమానులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఏం జరుగుతుందో తెలియదు.. ఏ మహమ్మారి సోకుతుందో తెలీదు.. కానీ కోళ్లు పిట్టల్లా రాలిపోతున్నాయి. అంతు పట్టని వైరస్ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లోని నాటు, బ్రాయిలర్ కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి.
షెడ్డులో ఒక్క కోడికి వైరస్ సోకితే సాయంత్రానికి మిగతా కోళ్లకు పాకి సాయంత్రానికల్లా చనిపోతున్నాయి. చికెన్ లేనిదే ముద్ద దిగదు. ఐతే ఇదంతా మొన్నటి వరకు..! ఇప్పుడు చికెన్ అంటేనే వణికిపోతున్నారు జనం. బర్డ్‌ఫ్ల్యూ భయంతో.. చికెన్‌షాపుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దాంతో కస్టమర్లు లేక చికెన్ సెంటర్లు బోసిపోతున్నాయి. ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఏది ఏమైనా కొద్దిరోజులు చికెన్ తినకుండ ఉండటమే బెటర్ అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఇక తాజాగా బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న సమయంలో ముందస్తు చర్యలను తెలంగాణ సర్కారు చేపట్టింది. ఏపీ పౌల్ట్రీఫామ్స్ నుంచి వస్తున్న కోళ్ల వాహనాలను రాష్ట్ర సరిహద్దు వద్ద అడ్డుకుంటున్నారు. ఏపీలోని ఏలూరు జిల్లాకు సరిహద్దుగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వద్ద ఉన్న తనిఖీ కేంద్రం వద్ద కోళ్ల వాహనాలను అడ్డుకుని వెనక్కి పంపుతున్నారు.
Also Read: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. తెలంగాణలో ఏపీ కోళ్లు బ్యాన్..!
ఏపీలోని డెల్టా ప్రాంతంలోని పౌల్ట్రీల్లోని లక్షలాది కోళ్ళు మృత్యువాత పడటం.. ల్యాబ్ టెస్టుల్లో కోళ్లకు బర్డ్స్ ఫ్లూ పాజిటివ్‌గా రావటంతో తెలంగాణ సర్కారు అప్రమత్తం అయ్యింది. ఏపీ నుంచి కోళ్లను.. తెలంగాణలోకి అనుమతించవద్దని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో 24 గంటలూ చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. వైరస్ పూర్తిగా పోయాకే.. కోళ్లను అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లాలోని కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సీతానగరం మండలం మిర్తిపాడులో బర్డ్ ఫ్లూ అనుమానంతో శాంపిల్స్ ను సహకరించామని పశుసంవర్థకశాఖ అధికారులు చెబుతున్నారు. మిర్తిపాడు గ్రామంలో కిలోమీటర్ మేర రెస్ట్డ్ ఏరియా.. పది కిలోమీటర్ల వరకు సర్వే లైన్స్ పెట్టి పూర్తిగా అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు చెబుతున్నారు. మిర్తిపాడు ఏరియాలో మాంసం విక్రయాలను పూర్తిగా నిలిపివేసినట్లుగా జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి శ్రీనివాస్‌రావు వెల్లడించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నామంటున్నారు.