BIG Twist in TDP MLA Koneti Adimulam Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు క్లోజ్ అయింది. తన కేసు కొట్టి వేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ విచారణలో బాధితురాలు అయిన వరలక్ష్మి కూడా ఇంప్లీడ్ అయి తాము రాజీకీ వచ్చామని కేసు అవసరం లేదని హైకోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఈ కేసును కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో హైదరాబాద్ వెళ్లి మరీ ప్రెస్‌మీట్ రచ్చ చేసిన మహిళ ఇప్పుడు సడన్‌గా రాజీమంత్రం పఠిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధిస్తున్నారని అదే నియోజకవర్గానికి చెందిన వరలక్ష్మి అనే మహిళ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి.. కోనేటి ఆదిమూలంతో తాను ఉన్న ప్రైవేటు వీడియోలను కూడా మీడియాకు రిలీజ్ చేయడం తీవ్ర కలకలం రేపింది. తనని తాను టీడీపీ నేతగా చెప్పుకున్న ఆమె కోనేటి ఆదిమూలంపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీని.. ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని చంద్రబాబు, లోకేష్ దృష్టికి సైతం తీసుకెళ్లానని, వారు పట్టించుకోలేదని అప్పట్లో ఆ మహిళ ఆరోపించింది.
మహిళ ఆరోపణలతో కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. కోనేటి ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. ఇదిలా ఉన్న సమయంలోనే కోనేటి ఆదిమూలంపై ఆరోపణలు చేసిన మహిళ తీరు కూడా చర్చనీయాంశమైంది. వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించడం, వైద్య పరీక్షలు చేయించుకోవడాన్ని వాయిదా వేయడంపై అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే చివరకు పోలీసుల కౌన్సిలింగ్‌తో బాధితురాలు వైద్య పరీక్షలు చేయించుకుంది. అయితే ఈ లోపు కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తనపై పోలీసులు నిబంధనలకు వ్యతిరేకంగా కేసులు పెట్టారని బాధితురాలు ఫిర్యాదు చేయకపోయినా కేసు పెట్టారని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా ఆరోపణల్లో నిజానిజాలు చూడకుండా పోలీసులు కేసు నమోదు చేశారని వాదించారు. ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా బయట పెట్టడం వెనుక కుట్ర ఉందన్నారు. ఈ ఘటన హనీట్రాప్‌గా ఆదిమూలం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Also Read: వైసీపీ పాలనలో 219 ఆలయాలు అపవిత్రం.. పవన్ ఆగ్రహం
హైకోర్టు విచారణ జరుపుతున్న సమయంలోనే ఆదిమూలంపై నమోదైన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసకుంది … ఫిర్యాదిదారు స్వయంగా న్యాయస్థానానికి హాజరై ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్ని అవాస్తం అని న్యాయవాదితో నోటరీ చేసిన అఫిడవిట్‌ను కోర్టులో దాఖలు చేశారు. ఇద్దరి తరుపు లాయర్లు.. తమ క్లయింట్లు ఇద్దరూ రాజీకి వచ్చారని హైకోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు బయట సమస్యను పరిష్కరించుకునేందుకు పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
హైకోర్టు తీర్పుతో సత్యవేడు ఎమ్మెల్యేపై టీడీపీ సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశముంది .. అయితే అంత రచ్చ చేసిన మహిళ సడన్‌గా రాజీకి రావడం చర్చనీయాంశంగా మారింది… ఆదిమూలం నైజం తమకు తెలుసని.. ఎవరికీ హాని చేసే వ్యక్తి కాదని ఆయన అనుచరులు ముందునుంచి చెప్తున్నారు. అలాంటాయనపై ఏడు పదుల వయస్సులో అత్యాచారం ఆరోపణలు చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. ఆదిమూలం గత ఎన్నికల్లో అదే సత్యవేడు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బద్ద శత్రువుగా మారారు.
దాంతో పెద్దిరెడ్డి గత ఎన్నికల్లో ఆదిమూలంకు సత్యవేడు టికెట్ దక్కకుండా చేశారు. అయితే ఆదిమూలం టీడీపీ టికెట్ దక్కించుకుని వైసీపీపై విజయం సాధించి పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చారు. ఆ కక్షతోనే పెద్దిరెడ్డి ఆయనపై తప్పుడు కేసు పెట్టించారని ఎమ్మెల్యే అనుచరులు వాదిస్తున్నారు. సత్యవేడులో టీడీపీ టికెట్ ఆశించిన నేతలు ఆదిమూలంకు టికెట్ దక్కడంతో గుర్రుగా ఉన్నారు. ఎన్నికల్లో వారు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదిపినప్పటికే కూటమి వేవ్ ఆదిమూలానికి కలిసి వచ్చింది. అలాంటి ఆదిమూలం వ్యతిరేకనేతలతో పెద్దిరెడ్డి పావులు కదిపి ఆ కేసు పెట్టించారన్న వాదన ఉంది. ఆ క్రమంలో ఇప్పుడు వరలక్ష్మికి జరిగిన వైద్య పరీక్షల ఫలితాలు బయటకు వస్తే అది తప్పుడు కేసని తేలిపోతుందనే ఆమె రాజీకి వచ్చారని వారంటున్నారు. అయితే పరువు కాపాడుకోవడానికి ఆదిమూలం ఆమెకు ప్యాకేజ్ ఎర చూపి రాజీపడ్డారన్న మరో వాదన కూడా వినిపిస్తుంది. మొత్తానికి ఆదిమూలం కథ అలా సుఖాంతమైంది.