Bandi Sanjay: మరో నాలుగు రోజుల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం ముగియనుండగా, అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బోరబండలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ నిర్వహించ తలపెట్టిన రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈరోజు సాయంత్రం జరగాల్సిన ఈ కార్యక్రమానికి తొలుత అనుమతి ఇచ్చి, ఆపై రద్దు చేయడంపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివాదంపై పోలీసులు చేసిన వ్యాఖ్యలు బండి సంజయ్‌ను మరింత ఆగ్రహానికి గురిచేశాయి. రోడ్ షో కోసం బీజేపీ నేతలు అసలు అనుమతే కోరలేదని పోలీసులు ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసుల వాదన అబద్ధమని నిరూపించేందుకు, తాము అనుమతి కోరుతూ సమర్పించిన దరఖాస్తు కాపీని, అలాగే అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ఇచ్చిన అధికారిక సర్క్యులర్‌ను ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. “తమాషా చేస్తున్నారా? ప్రజలను పిచ్చివాళ్లనుకుంటున్నారా?” అంటూ పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు.
Read Also: CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. సీఎం రేవంత్ కీలక సమావేశం
పోలీసుల చర్య వెనుక రాజకీయ కుట్ర ఉందని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో “దారుస్సలాం పాలన” (ఎంఐఎంను ఉద్దేశిస్తూ) నడుస్తోందా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీకి, ముఖ్యంగా ఎంఐఎంకు తొత్తులుగా మారారా అని మండిపడ్డారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ, బీజేపీ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం పరిపాటిగా మారిందని విమర్శించారు. బోరబండలో బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామని సవాల్ విసిరారు.
పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కార్యక్రమాన్ని ఆపేది లేదని స్పష్టం చేసిన బండి సంజయ్, బీజేపీ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులు ఎవరికీ భయపడకుండా భారీ సంఖ్యలో బోరబండకు తరలిరావాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటున్న సమయంలో, అనుమతుల రద్దు వివాదం ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.