
India: ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఏదీ? ఈప్రశ్నకు సమాధానం మొన్నటి వరకు చైనా.. నేడు భారత్. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా ఐక్యరాజ్య సమితి వెల్లడించిన మరో విషయం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఆరుగురిలో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. మరి దీనికి కారణమేంటి? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయ్?
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ తొలిస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఆస్థానంలో ఉన్న చైనాను ఇండియా అధిగమించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57 కోట్లు కాగా.. మన దేశ జనాభా 142.86 కోట్లకు చేరింది. ప్రధాన నగరాల్లో కోటి మందిపైగా జనాభా నివస్తున్నారు. 50 శాతానికిపైగా 30 ఏళ్ల లోపు వారే ఉన్నారు. అంటే సగం మందికిపైగా యువతే ఉంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ నగరాల్లో దాదాపు కోటి మందిపైగా జనాభా నివస్తున్నారు. ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. దేశంలో ప్రతి ఆరుగురులో ఒకరు సంతానాలేమితో బాధపడుతున్నారు. ఇది ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది వ్యంధత్వ సమస్యతో బాధపడుతున్నారు. దంపతులు 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు లైంగిక సంబంధాన్ని కొనసాగిస్తున్నప్పటికీ స్త్రీలు గర్భం దాల్చలేకపోతున్నారు.
ఏ వయసుకా ముచ్చట అని పెద్దవాళ్లు ఊరికినే అనలేదు. సరైన వయసులో పిల్లల్ని కనకపోతే, ఇక ఆ తర్వాత కష్టమవుతుంది. చదువులూ, కెరీర్‌లంటూ పరుగులు తీసేసరికే కనీసం 30 ఏళ్లు దాటుతున్నాయి. అప్పుడు పెళ్లి చేసుకుని బిడ్డను కనాలంటే ఇక చాలామందిలో అనేక సమస్యలు ఉంటున్నాయి. అందుకే 20 ఏళ్ల క్రితం 7 శాతం మంది సంతానలేమితో బాధపడితే ఇప్పుడది డబుల్ అయింది. ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఆహారపు అలవాట్లు కూడా మారాయ్. నగరాల్లో అయితే ఎవరూ ఇంట్లో వండుకుని తినే పరిస్థితి కనిపించడం లేదు. ఆన్‌లైన్ ఫుడ్ కు అలవాటు పడి, విచ్చలవిడిగా జంక్ ఫుడ్ తినేస్తున్నారు. అంతేకాదు ఒకప్పుడు సహజసిద్ధంగా పండించే ఆహార ధాన్యాలు, కూరగాయలు తినేవారు. కాని ఇప్పుడు.. పెరుగుతున్న జనాభా కారణంగా విచ్చలవిడిగా పురుగుల మందులు వాడుతున్నారు. లేచినదగ్గర నుంచి పడుకునే వరకు అంతా ప్లాస్టిక్‌మయపోయింది. ఫ్లోర్, బాత్‌రూమ్, సింక్ క్లీనర్స్‌లో ఉపయోగించే కెమికల్స్… నీటితో కలిసి చెరువులు, నదుల్లో కలుస్తున్నాయ్. ఇవి తిరిగి భూగర్భ జలాల్లోనూ చేరుతున్నాయ్. జనం ఇవే నీటిని తాగడం సంతాన లేమికి కారణమవుతోంది. ఎంత ఫిల్టర్ చేసినా నీటిలో కలిసిపోయిన రసాయనాలు మాత్రం అలానే ఉండిపోతున్నాయనేది నిపుణుల మాట.
సంతానలేమి సమస్యకు దంపతులిద్దరూ సమానంగా కారణమవుతారు. మహిళల్లో ఎండోమెట్రియాసిస్, ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ లాంటివి మెడికల్ కారణాలు. ఇవన్నీ వైద్య సంబంధమైన కారణాలు. కొన్ని స్వయంకృతాపరాధాలు కూడా ఉన్నాయ్. మారిన జీవనశైలి ఇందులో ఒకటి. శారీరక శ్రమ లేని ఉద్యోగాలు, సెడెంటరీ లైఫ్ స్టయిల్ తో బరువు పెరిగిపోతున్నారు. అమ్మాయిల్లో కూడా పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం లాంటి దురలవాట్లు పెరిగిపోతున్నాయి. దాంతో వాళ్లలో కూడా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చిపడుతున్నాయి. స్మోకింగ్ వల్ల అండాల నాణ్యత తగ్గిపోతుంది. ఆల్కహాల్ వల్ల కూడా ఇన్ ఫర్టిలిటీ సమస్యలు పెరుగుతున్నాయ్.
రెండు పడవలపై కాళ్ళు పెట్టిన చందంగా ఇల్లు-ఆఫీసు బాధత్యల మధ్య మహిళలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. పురుషులు కూడా వ్యాపారాలు, ఉద్యోగాలతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, కాలుష్య వాతావరణంలో జీవించడం, సెల్ ఫోనులు అధికంగా ఉపయోగించడం లాంటివి సంతానలేమికి కారణమవుతోంది.
ప్రస్తుతం ఎక్కువ మంది పురుషులు సిగరేట్, మద్యానికి బానిసలవుతున్నారు. బిగుతైన దుస్తులు ధరించడం, అధికబరువు, మానసిక ఒత్తిడి, కొన్నిరకాల మందులు, ఆరోగ్యకరమైన వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తున్నాయ్. . పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం కూడా సంతానలేమికి ఓ కారణం. ప్రతి పురుషుడిలో సాధారణంగా 3 నుంచి 6 మిల్లీలీటర్ల వీర్యం ఉత్పత్తి అవుతుంది. ఇందులో దాదాపు 60 నుండి 150 మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి. కానీ రాను రాను ఈ సంఖ్య తగ్గిపోతోంది. ముఖ్యంగా ఐటీ రంగాలలో పనిచేసే ఉద్యోగుల్లో ప్రతి ఏడుజంటల్లో ఒక జంట సంతాన లేమితో బాధపడుతోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువగా ల్యాప్‌ట్యాప్‌లను ఒడిలో పెట్టుకుని పని చేయడం వల్ల వీర్యకణాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
మొత్తానికి దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరు సంతానలేమి సమస్యతో బాధపడటం.. జనాభా పెరుగుదలను మించి ఆందోళన కలిగిస్తోంది.
Viveka Murder Case: సునీత కాదట.. మరి, అవినాషేనా? షర్మిల మాటలకు అర్థం అదేనా?