BigTV English
Advertisement

Malepati Subbanayudu: కావలి టీడీపీలో రగిలిన వర్గపోరు..

Malepati Subbanayudu: కావలి టీడీపీలో రగిలిన వర్గపోరు..

Malepati Subbanayudu:  కావలి టీడీపీలో సీనియర్ నాయకుడు మాలేపాటి సుబ్బానాయుడు మరణంతో పార్టీలోని అంతర్గత విబేధాలు మరోసారి బట్టబయలయ్యాయి? తనకు టికెట్ దక్కక పోవడం, స్థానిక ఎమ్మెల్యేతో వైరంతో ఆ నేత మనో వేదనకు గురై మరణించారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.. ఆ క్రమంలో సొంత పార్టీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మాలేపాటి సొంత మండలం దగదర్తి నాయకులు వ్యతిరేకిస్తున్నారంట.. అసలు కావలి టీడీపీలో నడుస్తున్న రాజకీయం ఏంటి?


సీనియర్ నేత మరణంతో బయట పడ్డ విభేదాలు:

నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉంటాయి. తాజాగా ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మరణంతో ఒక్కసారిగా కావలి నియోజకవర్గం టీడీపీలోని వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఇక్కడ టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు సీనియర్ నేత మరణంతో ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇది ఇప్పుడు పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందట. 2024 ఎన్నికల సమయంలో టీడీపీ గెలుపే లక్ష్యంగా..సామాజిక సమీకరణాలు, ఆర్థిక బలం ఉన్న నేతల వైపు అధిష్టానం మొగ్గు చూపింది.

2022 నుంచి 2024 వరకు టిడిపి ఇన్చార్జిగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడుని కాదని టిడిపి అధిష్టానం అప్పట్లో పసుపులేటి సుధాకర్, బీద రవిచంద్ర పేర్లు పరిశీలించింది. పసుపులేటి సుధాకర్ కి ఐవిఆర్ఎస్ సర్వేలో పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో బీద రవిచంద్ర సతీమణిని బరిలో దించాలని అధిష్టానం భావించింది కానీ వైసీపీ నుండి రెడ్డి సామాజిక వర్గం పోటీలో ఉండటంతో..టీడీపీ కూడా అదే సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని భావించింది. ఇక్కడే అసలు రాజకీయం నడిచింది.


కావ్య కృష్ణారెడ్డికి టీడీపీ టికెట్ ఖరారు:

ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తన రాజకీయ చతురతతో… అప్పటిదాకా వైసీపీలో ఉన్న కావ్య కృష్ణారెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించి, టికెట్ ఖరారు చేయించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎన్నికల సమయంలో దగదర్తి మండలంలో మాలేపాటి సుబ్బానాయుడు వర్గం ఎమ్మెల్యే కి పనిచేయలేదని ఎమ్మెల్యే వర్గంలో పెద్ద చర్చే నడిచింది.

కావ్య కృష్ణారెడ్డికి సుబ్బానాయుడుకి మధ్య విభేదాలు:

ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచీ కావ్య కృష్ణారెడ్డికి, మాలేపాటి సుబ్బానాయుడుకు మధ్య విభేదాలు కొనసాగుతూ వస్తున్నాయి. దగదర్తి కేంద్రంగా సుబ్బానాయుడు కుటుంబం పార్టీలో కొనసాగగా, ఆయన కావలిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి రాజకీయాలు నడపడం ఎమ్మెల్యేకు నచ్చలేదట. దీంతో ఎమ్మెల్యే నేరుగా అధికారులకు ఫోన్ చేసి సుబ్బానాయుడుకు, ఆయన అనుచరులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి పనులు చేయొద్దని చెప్పినట్లు ప్రచారం ఉంది. ఈ విషయాలను సుబ్బానాయుడు.. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్‌కు, ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రకు పలుమార్లు వివరించారట.

ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా సుబ్బానాయుడు:

ఇద్దరూ కలిసి పనిచేయాలని అధిష్టానం చెప్పినా సయోధ్య కుదరలేదట. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు మాలేపాటి సుబ్బానాయుడుకు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా అవకాశం లభించింది. ఇటీవల డీఆర్ ఛానెల్‌ కాలువలో అవినీతి జరిగిందని సుబ్బానాయుడు అధికారులను నిలదీయడంతో కావలిలో మరోసారి వీరిద్దరి మధ్య ఉన్న రాజకీయ వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. తరువాత స్థానిక రెవెన్యూ అధికారులు సుబ్బానాయుడు పొలంలోకి వెళ్లి వివాదం సృష్టించారని ఈ పరిణామాల నేపథ్యంలోని ఆయన మనస్థాపానికి గురయ్యారని మాలేపాటి వర్గీయులు వాదన.

2019 ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేయడంతో ఆ ఎన్నికలలో ఆయన ఓటమి పాలయ్యారు. అధిష్టానం విష్ణువర్ధన్ రెడ్డిని పక్కన పెట్టడంతో కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి లేకపోవడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో ఉన్న సమయంలో టిడిపి అధిష్టానం బీద రవిచంద్రను ఇన్చార్జిగా వ్యవహరించాలని కోరింది. ఆయన ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొననని దగదర్తి మండల నాయకుడైన మాలేపాటి సుబ్బానాయుడిని బాధ్యతలు తీసుకోవాలని బీద కోరడంతో 2022నుండి 2024 వరకు సుబ్బారాయుడు ఇన్చార్జిగా కొనసాగారు.

టీడీపీ కార్యకర్తలు , నాయకులకు అండగా సుబ్బానాయుడు:

సుబ్బానాయుడు..నియోజకవర్గంలోని టిడిపి కార్యకర్తలకు, నాయకులకు అండగా నిలబడ్డారు. వైసిపి పార్టీ విమర్శలను ఎదుర్కొంటూ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ తరుణంలో ఆయనపై 16 కేసులు నమోదయ్యాయి. కొన్ని కారణాలవల్ల 2024లో టిడిపి అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటినుండి వీరిద్దరి మధ్య వర్గ విభేదాలు ప్రారంభమయ్యాయి. గడిచిన ఎన్నికలలో మాలేపాటి ఎమ్మెల్యే గెలుపుకు పని చేయలేదు అనేది ఎమ్మెల్యే భావించారట. దీంతో ఎమ్మెల్యే కూడా మాలేపాటి వర్గాన్ని దూరం పెట్టారనేది టాక్. దీంతో వీరిద్దరి మధ్య రాజకీయ వర్గ విభేదాలకు ఆజ్యం పోసుకున్నాయి.

టీడీపీ నాయకుల ప్రాధాన్యత పై ఆరోపణలు:

పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగుతున్న నాయకులకు ప్రాధాన్యత లేదని ఓ వర్గం ఆరోపిస్తుంది. టీడీపీలో సీనియర్ నాయకుడిగా పనిచేసిన మాలేపాటి సుబ్బానాయుడును మరో వర్గం ఇబ్బందులు పెట్టడంతో మనస్థాపం చెందారని మాలేపాటి వర్గీయులు ప్రధానమైన ఆరోపణ. ఇటీవల దగదర్తిలో జరిగిన సంఘటన, సుబ్బానాయుడు అనుచరుల ఆందోళన ఈ విభేదాలకు నిదర్శనమట. కావలిలో వీరిద్దరి మధ్య జరుగుతున్న రాజకీయ విభేదాలు బీద రవిచంద్ర, టిడిపి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందట.

ఆరోపణల నేపథ్యంలో మృతి చెందిన మాలేపాటి సుబ్బానాయుడు:

బీద రవిచంద్ర ఓ వర్గానికి సపోర్ట్ చేస్తున్నారని మరొక వర్గం ఆరోపిస్తుంది. ఈ ఆరోపణల నేపథ్యంలో మాలేపాటి సుబ్బానాయుడు మనస్థాపానికి గురై బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందారని మాలేపాటి వర్గీయులు ఆరోపిస్తున్నారు. మాలేపాటి సుబ్బానాయుడు అకాల మరణం తరువాత పరిస్థితి మరింత చేయిదాటిపోయింది. స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలిలోనే ఉన్నప్పటికీ, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి హాజరుకకాక పోవడం గమనార్హం. ఆ క్రమంలో మాలేపాటి సుబ్బానాయుడు బ్రెయిన్ డెడ్ స్థితిలో అచేతనంగా ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆయన పేరుతో ఉన్న భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పై ఆరోపణలు వచ్చాయి.

భూముల రిజిస్ట్రేషన్ పై కుటుంబ సభ్యుల స్పష్టం:

అయితే సుబ్బా నాయుడు పేరు మీద ఉన్న భూములు రిజిస్ట్రేషన్ అయిన మాట నిజమే కాని వాటిని ఆయన మూడేళ్ల క్రితమే విక్రయించి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారని కొనుగోలు చేసిన యాజమానులు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇది మాలెపాటి కుటుంబానికి తెలిసే జరిగిందని.. దీనిపై అభ్యంతరాలు లేవని సుబ్బా నాయుడు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీద రవిచంద్ర మీద ఈ బురద పడడానికి కారణం ఏమిటి అన్నది ప్రశ్నార్ధకంగా మారడంతో.. ఆ వార్త వెనుక కావలి ఎమ్మెల్యే ఉన్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.

తారాస్థాయికి చేరిన రెండు గ్రూపు విభేదాలు:

ఇలా రెండు గ్రూపుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో పరిస్థితిని చక్కదిద్దడానికి మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని సుబ్బానాయుడు కర్మకాండలకు హాజరుకావాలని ఎమ్మెల్యేకు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఇన్‌ఛార్జ్ మంత్రి ఫరూక్ తో కలిసి కావ్య కృష్ణారెడ్డి మాలేపాటి ఉత్తర క్రియలకు దగదర్తి వెళ్లారు. కానీ, అక్కడ కనీసం కారు దిగకుండానే మాలేపాటి అనుచరులు గొడవ చేశారు. సంతాప సభలోనూ ఎమ్మెల్యేపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. మరోవైపు, మాలేపాటి, బీద రవిచంద్ర భూ వివాదాన్ని కూడా కొందరు తెరపైకి తీసుకొచ్చారు. ఇందులోనూ ఎమ్మెల్యే అనుచరుల హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది.

కావలి టీడీపీలో కొనసాగుతున్న కావ్య-మాలేపాటి గ్రూపుల మధ్య ఈ విభేదాలు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తెరచాటున అదునుగా వాడుకుంటున్నారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. ఈ సమస్య ఇప్పట్లో సర్దుబాటు అయ్యేలా కనిపించడం లేదట. ఈ పరిణామాలు టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయంట. మరి కావలి టీడీపీలో నెలకొన్న వర్గ రాజకీయాలు, అంతర్గత విభేదాలుపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..

Story by Apparao, Big Tv

 

Related News

JC Brothers: జేసీ బ్రదర్స్.. టార్గెట్ పోలీస్!

DCC Presidentship: మేడిపల్లికి.. డీసీసీ పగ్గాలు

Jubilee Hills Bypoll:జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారాల్లో కనిపించని ఆ ఇద్దరు కీలక నేతలు..?

CM Chandra Babu: పార్టీ పరువు తీస్తున్నారు.. సొంత పార్టీ నేతలపై చంద్రబాబు సీరియస్

Jubilee Hills Bypoll: సొంత నేతలపై బీఆర్ఎస్ నిఘా..

TTD Vedic University: వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ అక్రమాలు

Komatireddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి?

Big Stories

×