Dulquer Salman: మలయాళ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman)టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈయన మహానటి, సీతారామం సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో నటిస్తూ తెలుగు హీరోగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కొనసాగుతున్న దుల్కర్ సల్మాన్ కు ఇటీవల వరుస షాక్ లు తగులుతున్నాయి.
గత కొద్ది రోజుల క్రితం దుల్కర్ సల్మాన్ ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేయడమే కాకుండా ఆయన ఖరీదైన లగ్జరీ కార్లను సీజ్ చేయడంతో వార్తల్లో నిలిచారు. అయితే ఈ విషయంలో దుల్కర్ సల్మాన్ కు కోర్టు నుంచి పూర్తి ఉపశమనం లభించడమే కాకుండా తన కారును కూడా విడుదల చేశారు. ఇక ఈ వివాదం మర్చిపోకముందే మరోసారి ఈయన నోటీసులు అందుకున్నారు. తాజాగా దుల్కర్ సల్మాన్ కు వివాదాల పరిష్కార కమిషనర్ నోటీసులను జారీ చేశారు. డిసెంబర్ 3 వ తేదీ ఈయన విచారణకు రావాల్సి ఉంటుందని ఈ నోటీసులలో పేర్కొన్నారు. అసలు దుల్కర్ సల్మాన్ కు ఈ నోటీసులు అందజేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే..
సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు కాస్త మంచి సక్సెస్ అందుకున్న తర్వాత ఎన్నో రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. దుల్కర్ సల్మాన్ కూడా ఇలా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదించారు. అయితే ఈయన ప్రమోట్ చేస్తున్న వాటిలో రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్ (Rose Brand Biryani Rice)కూడా ఉంది . ఇక ఈ రైస్ ను ప్రమోట్ చేసిన నేపథ్యంలోనే ఈయనపై కేసు నమోదు అవ్వడమే కాకుండా నోటీసులు కూడా అందాయని తెలుస్తుంది
చిక్కుల్లో పడిన దుల్కర్ సల్మాన్..
కేరళలోని పతనం తిట్ట జిల్లాలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్ లో భాగంగా దుల్కర్ సల్మాన్ ప్రమోట్ చేసిన రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్ చేశారు. అయితే ఈ రైస్ తిన్న బంధువులందరికీ పెద్ద ఎత్తున ఫుడ్ పాయిజన్ అయ్యి వాంతులు కావడంతో దుల్కర్ సల్మాన్ కు నోటీసులు అందజేశారు. డిసెంబర్ మూడో తేదీ ఈయన ఈ విషయంపై విచారణకు హాజరుకావాలని తెలియజేశారు. క్యాటరింగ్ కాంట్రాక్టర్ పిఎన్ జయ రాజన్ చేసిన ఫిర్యాదు మేరకు ఈయనపై కేసు నమోదు చేశారు. అయితే దుల్కర్ సల్మాన్ పై మాత్రమే కాకుండా రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్ మేనేజింగ్ డైరెక్టర్, మలబార్ బిర్యానీ అండ్ స్పైసెస్ మేనేజర్ కూడా ఈ విచారణకు హాజరు కావాలని తెలియజేశారు. రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్ ప్రమోట్ చేసినందుకే దుల్కర్ సల్మాన్ చిక్కుల్లో పడ్డారని తెలుస్తుంది .మరి ఈ వివాదం పై ఈయన ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.