Jubilee Hills Bypoll: కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌లు మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై అలిగారా? హైదరాబాద్ లోనే ఉండి జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో తమకు సంబంధం లేదన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? జూబ్లీహిల్స్ కిషన్ రెడ్డి అడ్డా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు? అంటే బీజేపీలో ఎవరి పొలిమేరలు వారివేనా? అసలు ఆ ఇద్దరి అసహనానికి కారణమేంటి?
మాటలు కోటలు దాటతాయి, కానీ కాళ్ళు గడప దాటవు అన్న నానుడికి నిదర్శనంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లు నిలుస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. నిన్నమొన్నటి దాకా మాటలు కోటలు, కాళ్లు గడప దాటేవి. కాని నేడు బండి సంజయ్, అరవింద్‌ల వ్యవహారతీరు సొంత పార్టీలోనే అందర్నీ ఆశ్చర్య పరుస్తోందంట. జూబ్లీహిల్స్‌కు కూత వేటు దూరంలో ధర్మపురి అరవింద్, బండి సంజయ్‌ల నివాసాలు ఉన్నాయి. ఎన్నికల ప్రచార డప్పులు కొడితే వినిపించేంత దూరంలో ఇద్దరు నేతలు ఉన్నా, ప్రచారానికి మాత్రం దూరంగా ఉండటం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ప్రతి అంశంలో మేమున్నామని ముందుండే కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌లు ఇద్దరూ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విషయంలో మాత్రం టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వారు ప్రచారంలో ఎందుకు పాల్గొనడం లేదనే చర్చ కాషాయపార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ జూబ్లీహిల్స్‌లో ప్రచార పర్వాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి. చిన్న చితక నేతలంతా జూబ్లీహిల్స్ లోనే మకాం వేసి, ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా బీజేపీ ప్రచారం కనిపిస్తోంది. చిన్నా చితక నేతలు ఏమో గాని, పెద్ద తలకాయలే ప్రచారంలో ఇన్వాల్వ్ కాకుండా సైలెంట్ మోడ్ లో స్తబ్దతగా ఉండిపోతున్నారనే చర్చ కాషాయ వర్గాల్లో జరుగుతోంది.
పదేళ్ళు జూబ్లీహిల్స్‌ని అభివృద్ధి చేశామంటూ, మాగంటి గోపినాథ్ సెంటిమెంటుతో బీఆర్ఎస్ ఓటర్ల దగ్గరకు వెళ్తోంది. 23 నెలల కాంగ్రెస్ పాలనలో చేపట్టిన పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ ప్రచారరథం సాగుతోంది. ఇక బీజేపీ అందుకు భిన్నంగా కార్పెట్ బాంబింగ్ పేరుతో బీజేపీ ప్రజల్లోకి వెళ్తోంది. మోడీ కార్డ్, కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలే బీజేపీకి పట్టం కడతాయని బీజేపీ చెప్పుకుంటోంది. ఇక్కడివరకు బాగానే ఉన్నా బీజేపీలో కీలక నేతలు ఎక్కడ..? జూబ్లీహిల్స్ కు ఎందుకు దూరంగా ఉన్నారు? ప్రచారం అంటే ఇష్టం లేదా? లేక కిషన్ రెడ్డి నియోజకవర్గం కాబట్టే రావడం లేదా.. అనే చర్చ పార్టీలో నడుస్తోందట.
బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌లు పదే పదే జూబ్లీహిల్స్ కిషన్ రెడ్డి అడ్డా అంటున్నారు. వారలా ఎందుకంటున్నారనేది కాషాయశ్రేణులకు అంతుపట్టకుండా తయారైందంట. ఆ క్రమంలోబండి సంజయ్, ధర్మపురి అరవింద్‌ల పైనే ఇప్పుడు కమలం పార్టీలో చర్చ రచ్చ రేపుతుందట. మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు నేతలు జూబ్లీహిల్స్ ఎన్నికలో తమ అభ్యర్థి కోసం ఎందుకు ప్రచారం చేయడం లేదన్నదే ఆ పార్టీ శ్రేణులకు అంతు చిక్కని ప్రశ్నగా ఉందట.
ఎన్నిక దగ్గర పడుతుండటంతో ఇటు బండి సంజయ్, అటు ధర్మపురి అరవింద్ పైనే చర్చ జరుగుతుందట. రకరకాల కామెంట్స్ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ప్రధానంగా కిషన్ రెడ్డిపై ఉన్న అసహనమే ఆ ఇద్దరి నేతలు ప్రచారానికి రాకపోవడానికి కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కిషన్‌రెడ్డి మీద అసంతృప్తితోనే ఆ ఇద్దరు నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. అంతేకాదు జూబ్లీహిల్స్ కిషన్ రెడ్డి అడ్డా, జూబ్లీహిల్స్ ఎన్నికలో విజయం కిషన్ రెడ్డి బాధ్యత అంటూ వారు కప్పదాటు వైఖరి అవలంభిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో పార్టీలో జరిగిన సంస్థాగత ఎన్నికలకు సంబంధించి ధర్మపురి అరవింద్ అసహనంతో ఉన్నట్టుగా ప్రచారం నడుస్తోంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అంశంలో రాష్ట్ర నాయకత్వం వ్యవహరించిన తీరుపై ధర్మపురి గుర్రుగా ఉన్నారట. అంతేకాదు దీనికంతటికి కారణం కిషన్ రెడ్డే కారణమనే భావనలో ధర్మపురి అరవింద్ వర్గీయులు ఉన్నారంట.
మొత్తo మీద రాష్ట్ర బీజేపీలో ఎవరి పొలిమేరలు వారివి, ఎవరి గేట్లు, ఎవరి పంచాయతీలు వారివి అన్నట్లు నేతలు వ్యవహరిస్తుండటంతో మధ్యలో పార్టికి తీరని డ్యామేజ్ జరుగుతుందని ఢిల్లీ పెద్దలు కూడా గ్రహించారంటున్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలతో పార్టీకి డ్యామేజ్ జరుగుతూ వస్తుందనే గుసగసలు పార్టీలో వినిపిస్తున్నాయి. తాజాగా ఆ పార్టీ సంస్థాగత ఇంచార్జ్ సునీల్ బన్సల్ వచ్చి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేసినా… నేతల తీరు మారడం లేదనే చర్చ జరుగుతుందట. ఈ నేపథ్యం జూబ్లీహిల్స్ లో అనుకున్న లక్ష్యాలతో విజయాన్ని అందుకుంటారా…? పరాజయాన్ని చవి చూస్తారా..? అన్నది అటుంచితే అందరి మధ్యలో మాత్రం పార్టీ శ్రేణులు మాత్రం నలిగిపోతున్నాయంట.
Story by Apparao, Big Tv