4 ఇంటూ 24 ఇజీక్వల్టూ 96
పాకిస్థాన్ సైన్యానికున్న సామర్ధ్యం అంతంత మాత్రమే4 ఇంటూ 24 ఇజీక్వల్టూ 96. ఇది మరేదో కాదు.. పాకిస్థాన్ ఆయుధ సామర్ధ్యానికి సంబంధించిన గణాంకం. ఇంతకీ దీనర్ధమేంటి? ఆ వివరాలేంటని చూస్తే..
భారత్ తో యుద్ధమంటే పాక్ ఆర్మీ దీపావళి లెక్క
భారత్ తో యుద్ధమంటే పాక్ ఆర్మీ దీపావళి లెక్క ఫీలవుతుంది. కానీ దానికంత సీన్ లేదని తెలుస్తుంది. పాకిస్థాన్ ఆర్మీ ఎలాగోలా యుద్ధ వాతావరణం వచ్చేలా చేయడం.. ఆ వెంటనే తన గుప్పెట్లోకి సర్వస్వం తెచ్చుకోవడం. ఇదిక్కడ తరతరాల సంప్రదాయం. ఒకానొక ప్రహనం. భారత్ తో యుద్ధమనగానే వెంటనే అణ్వాయుధాల ప్రస్తావన చేయడం. మీరుగానీ మాకు సింధూ జలాలు ఆపేస్తే మేం మీ మీ పైకి అణ్వాయుధాలను వదులుతామని డైలాగులు కొట్టడం ఇక్కడ సర్వసాధారణం.
NSA పోస్టును వెంటనే ఆర్మీ భర్తీ చేసిందా?
అంతెందుకు 2022 నాటి నుంచీ ఖాళీగా ఉన్న NSA పోస్టును వెంటనే ఆర్మీ భర్తీ చేసిందా? ఐఎస్ఐ చీఫ్ చేతికే జాతీయ భద్రతా సలహాదారు పోస్టునిచ్చి ఆర్మీ చీఫ్ కి రిపోర్ట్ చేయమందా? ఇక సరిహద్దుల్లో యుద్ధ సన్నాహాలు ముమ్మరం చేస్తోందా? ప్రభుత్వాన్ని దాదాపు పక్కకు తప్పించి.. అన్నీ తానై ఆర్మీ వ్యవహరిస్తోందా? అంతా బావుంది. భారత్ తో యుద్ధమనగానే మీకు దీపావళితో సమానం. ఓకేగానీ, భారత్ లాంటి దేశంతో యుద్ధం చేయాలంటే అందుకు తగిన మందు గుండు సామాగ్రి కావాలిగా.. అదెలా? అంటే మాత్రం పాక్ సైన్యం నీళ్లు నములుతుంది. ప్రస్తుతం పాక్ సైన్యం సిట్యువేషన్ సరిగ్గా ఇలాగే ఉందట.
ఆర్మీ పోరాడే శక్తి సామర్ధ్యం కేవలం 4 రోజులకు మాత్రమే
96 అవర్స్.. జస్ట్ 96 గంటలు మాత్రమే ఈ దేశం యుద్ధం చేయడానికి తగిన మందుగుండు సామాగ్రి నిల్వలు కలిగి ఉందట. దీంతో ఆర్మీ జనరల్స్ ఒంట్లో ఒణుకు పుడుతోందట. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే పాకిస్థాన్ ఆర్మీ పోరాడే శక్తి సామర్ధ్యం కేవలం 4 రోజులకు మాత్రమే పరిమితమట. ఆ తర్వాత చేతులెత్తేసి పలాయనం చిత్తగించడమేనని తెలుస్తోంది.
ఉక్రెయిన్ తో పాక్ చేసుకున్న ఆయుధ ఒప్పందం కారణంగా
పాకిస్తాన్ ఇంతటి దారుణమైన ఫిరంగి మందుగుండు సామాగ్రి కొరతను ఎదుర్కోడానికి గల కారణమేంటని చూస్తే.. ఉక్రెయిన్ యుద్ధమేనట. ఉక్రెయిన్ తో పాక్ చేసుకున్న ఆయుధ ఒప్పందం కారణంగా ఆయుధ నిల్వలు ఖాళీ అయ్యాయట. సైన్యానికి మందుగుండు సామాగ్రి సరఫరా చేసే పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ.. పెరుగుతున్న డిమాండ్.. కాలం చెల్లిన సౌకర్యాల కారణంగా.. తీవ్ర ఇబ్బందులు పడుతోందట. పాకిస్థానికి అవసరమయ్యేంతగా ఇక్కడ ఉత్పత్తి జరగటం లేదట.
M 109 హోవిట్జర్లకు తగిన 155 MM షెల్స్ లేవు
పాక్ సైన్యం ఎక్కువగా.. ఆర్టిలరీ, సాయుధ యూనిట్లపైనే డిపెండ్ అవుతుంది. ప్రస్తుతం పాక్ దగ్గర M 109 హోవిట్జర్లకు తగిన 155 MM షెల్స్ లేవు. BM 21 సిస్టమ్స్ కి అవరమయ్యే 122 MM రాకెట్లు అంతకన్నా అందుబాటులో లేవు. ఇవి లేకుండా భారత్ ను ఎదుర్కోవడం పాకిస్థాన్ కి అస్సలు సాధ్యం కాదంటారు నిపుణులు. ఒకపక్క చూస్తే ఆర్ధిక సంక్షోభం, మరో పక్క అప్పులు- ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలు వెరసీ పాక్ సైన్యాన్ని ప్రభావితం చేశాయని అంటారు.
చైనా PL- 15E మిస్సైళ్ల ఫోటోలను ట్రోల్ చేసి హంగామా
పాకిస్థాన్ స్థితిగతులు ఇలా ఉన్నాయి కాబట్టే మూడేళ్ల క్రితం ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ బజ్వా.. కాల్పుల విరమణ ఒప్పందం కోసం పట్టుబట్టారు. ఇప్పుడున్న ఆర్మీ చీఫ్ మునీర్.. ఈ విషయం తెలిసి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో తెలీదు కానీ.. సరిహద్దుల వెంబడి ముమ్మర యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు. అంతేనా మొన్నటికి మొన్న చైనా PL- 15E మిస్సైళ్ల ఫోటోలను ట్రోల్ చేసి.. మా దగ్గర ఇవి కూడా ఉన్నాయంటూ హంగామా చేయడం తప్ప అక్కడెలాంటి ఆయుధ సత్తా లేదని చెబుతున్నాయి కొన్ని అంతర్జాతీయ వార్ ఫేర్ రిపోర్ట్స్.
పాకిస్థాన్ సైన్యానికున్న సామర్ధ్యం అంతంత మాత్రమే
ఒక వేళ భారత్ తో యుద్ధం వస్తే.. మా దగ్గర అణ్వాయుధాలున్నాయని భయపెట్టడం కేవలం మేక పోతు గాంభీర్యం తప్ప మరేం లేదని అంటున్నారు యుద్ధ రంగ నిపుణులు. ఇప్పటి వరకూ మూడు యుద్ధాలు జరిగితే వాడని న్లూక్లియర్ వెపన్స్ ఈసారి వాడతారని ఎలా చెప్పగలమని ప్రశ్నిస్తారు భారత మాజీ సైనికాధికారులు. ఒక వేళ వారలా చేస్తే.. కొన్ని వందల ఏళ్ల వరకూ.. పాక్ లో కనీసం గోధుమ గింజ కూడా పండకుండా చేయగలమని వీరు హెచ్చరిస్తున్నారు. ఇదిలాగుంటే ఉగ్రవాదాన్ని అడ్డు పెట్టుకుని.. పాకిస్థాన్ లో ఒక రాజకీయ అలజడి సృష్టించడానికి ఆర్మీ ఆడే యుద్ధ నాటకం తప్ప.. ఇందులో పాకిస్థాన్ సైన్యానికున్న సామర్ధ్యం అంతంత మాత్రమేనంటారు నిపుణులు.
GFP వార్షిక సమీక్ష ప్రకారం చూస్తే.. 145 దేశాల్లో పాకిస్థాన్ 12వ స్థానంలో ఉంది
ఒక్క అణ్వాయుధాల విషయంలో మాత్రమే భారత్ తో సమ ఉజ్జీగా ఉంది పాకిస్థాన్. మిగిలిన విషయాలన్నిటిలోనూ పాకిస్థాన్ కన్నా భారతే టాప్ పొజిషన్లో ఉంది. ఇక గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్ ప్రకారం భారత సాయుధ దళాల సామర్ధ్యం.. ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. GFP వార్షిక సమీక్ష ప్రకారం చూస్తే.. 145 దేశాల్లో పాకిస్థాన్ 12వ స్థానంలో ఉంది. ఇక ఆయా దేశాల సైనిక శక్తి స్థాయిలను విభజించే మరో సర్వే ప్రకారం చూస్తే భారత్ టైర్ 2 దేశాల్లో ఉండగా.. పాక్ టైర్ త్రీ మిలిటరీ పవర్ గా మాత్రమే ఉంది.
జీడీపీలో 1. 7 శాతం మాత్రమే ఉన్నట్టు చెబుతోంది డాన్ న్యూస్ రిపోర్ట్
ఒక దేశపు సైనిక శక్తి సామర్ధ్యం ఆదేశపు సైనిక వ్యయం మీద ఆధారపడి ఉంటుందంటారు నిపుణులు. డాన్ పత్రిక తాజా రిపోర్ట్ ప్రకారం భారత్ పాకిస్థాన్ కంటే పది మెట్లు పైనే ఉన్నట్టు తెలుస్తోంది. 2025 కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ. 6.8 లక్షల కోట్లు, సైనిక ఆధునీకరణ కోసం రూ. 1.8 లక్షల కోట్లు కేటాయించింది భారత్. ఇది భారత GDPలో 1.9 శాతం, కేంద్ర బడ్జెట్‌లో 13.45 శాతంగా ఉంది. ఇదే పాకిస్థాన్ తన సైన్యం కోసం వెచ్చిస్తున్న మొత్తం ఆ దేశ జీడీపీలో 1. 7 శాతం మాత్రమే ఉన్నట్టు చెబుతోంది డాన్ న్యూస్ రిపోర్ట్. 2024లో భారత్ చేసిన సైనిక వ్యయం పాకిస్థాన్ కంటే సుమారు 9 రెట్లు ఎక్కువగా తెలుస్తోంది.
పాక్ దగ్గర ఈ సంఖ్య కేవలం తొమ్మిదిన్నర లక్షలు మాగ్రమే
స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్త ఐదవ అతిపెద్ద సైనిక శక్తి భారతదేశం. సైనిక సిబ్బంది విషయానికి వస్తే భారత్ లో 51 లక్షల మంది వరకూ ఉండగా.. వీరిలో యాక్టివ్ గా ఉన్న వారి సంఖ్య 14 లక్షలు. ఇక పాక్ కి 17 లక్షల సైనిక సిబ్బంది ఉండగా.. వీరిలో యాక్టివ్ గా ఉన్న వారి సంఖ్య కేవలం ఆరున్నర లక్షలు మాత్రమే ఉంది. మిలిటరీ వాచ్ మ్యాగజైన్ ప్రకారం భారత్ లో 42 లక్షల మంది యుద్ధ సిబ్బంది ఉండగా.. పాక్ దగ్గర ఈ సంఖ్య కేవలం తొమ్మిదిన్నర లక్షలు మాగ్రమే ఉంది.
భారత లో 2,229 విమానాలు ఉన్నాయి
భారత లో 2,229 విమానాలు ఉన్నాయి. వీటిలో 1,672 యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. 513 యుద్ధ విమానాలు కాగా, 130 దాడి చేయగల సామర్ధ్యం గల విమానాలున్నాయి. భారత వైమానిక దళంలో 270 రవాణా విమానాలు, 74 ప్రత్యేక మిషన్ విమానాలు ఉన్నాయి. వీటిలో 899 హెలికాప్టర్లు కూడా ఉన్నాయి.
పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ చెంత 64 రవాణా విమానాలు
పాకిస్తాన్ వైమానిక దళంలో 1,399 విమానాలు ఉన్నాయి. వీటిలో 797 యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో కేటగిరి వైజ్ గా చూస్తే యుద్ధ విమానాల సంఖ్య 328 కాగా, 90 దాడి విమానాలు మాత్రమే ఉన్నాయి. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ చెంత 64 రవాణా విమానాలు, కేవలం 27 ప్రత్యేక మిషన్ విమానాలు మాత్రమే ఉన్నాయి. వారి హెలికాప్టర్ ఫ్లీట్ సంఖ్య 373గా ఉందని చెబుతోంది గ్లోబల్ ఫైర్‌పవర్ రిపోర్ట్.
మూడు మైన్ వార్ ఫేర్ నౌకలున్నాయని చెబుతోంది GFP రిపోర్ట్
నావికా శక్తి అంశానికి వస్తే భారత్ దగ్గర ఈ సంఖ్య 293 వరకూ ఉన్నట్టు కనిపిస్తోంది. వీటిలో రెండు విమాన వాహక నౌకలు, 13 డెస్ట్రాయర్లు, 14 ఫ్రిగేట్లు, 18 కార్వెట్లు, 135 గస్తీ నౌకలు, 18 జలాంతర్గాములను కలిగి ఉంది. ఇక పాకిస్థాన్ నౌకా శక్తి సంఖ్య 121 మాత్రమే. వీటిలో 9 ఫ్రిగేట్లు, 69 పెట్రోల్ నౌకలు, తొమ్మిది కార్వెట్లు, 8 జలాంతర్గాములు, మూడు మైన్ వార్ ఫేర్ నౌకలున్నాయని చెబుతోంది GFP రిపోర్ట్. అయితే పాక్ దగ్గర విమాన వాహక నౌకలు, డెస్ట్రాయర్లు లేవు.
భారత నౌకా దిగ్బంధాన్ని తిప్పికొట్టే సామర్థ్యం పాక్ నేవీకి లేదు
భారత నేవీ బలం, బలగం ముందు పాకిస్తాన్ నౌకాదళం ఎందుకూ పనికిరాదు. చైనా వార్‌షిప్‌లే ప్రస్తుతం పాకిస్థాన్ దగ్గరున్నట్టు తెలుస్తోంది. ఇక ఆధునికీకరణ నత్తనడకన సాగుతోంది. పాక్ నేవీకి.. చైనా తయారీ ఫ్రిగేట్లు, తుర్కియే నిర్మిత మిల్జెమ్ కార్వెట్‌లే ఆధారం. వీటిలో అనేకం ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. చైనా నుంచి సేకరిస్తున్న హంగోర్ తరగతి సబ్‌మెరైన్లు 2028 నాటికిగానీ అందే అవకాశం లేదు. మరోవైపు భారత నౌకాదళ ఆధునికీకరణ జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో భారత నౌకా దిగ్బంధాన్ని తిప్పికొట్టే సామర్థ్యం పాక్ నేవీకి లేదనన్నది స్పష్టంగా తెలుస్తోంది.
యూఎస్ నుంచి మనకు పెద్ద సపోర్టే ఉంది.
ఇవన్నీ ఒక ఎత్తైతే.. భారత ఆర్ధిక బలం ముందు పాకిస్థాన్ బలం నామమాత్రంగా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే.. భారత్ ఎంతైనా తట్టుకోగలదు. కావల్సిన ఏర్పాట్లను వెంటనే సమకూర్చుకోగలదు. ప్రపంచ దేశాలు కూడా భారత్ సై అంటే సైసై అనడానికి సదా సిద్ధంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా యూఎస్ నుంచి మనకు పెద్ద సపోర్టే ఉంది. ఇక ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇజ్రాయెల్ వంటి దేశాల మద్ధతు సరే సరి. మరి పాకిస్థాన్ సంగతేంటి? కొన్నాళ్లుగా పూటగడవటమే కష్టమన్న చందంగా ఉందీ దేశం. తినడానికి తిండిలేక నానా తంటాలు పడుతోంది. ఈ సమయంలో ఒక పక్క చూస్తే మందుగుండు సామాగ్రి సరిగా లేక, మరో పక్క చూస్తే సరైన ఆహార సదుపాయమే లేక.. ఎలా? అన్నది ఈ దేశం యొక్క దురావస్తగా తెలుస్తోంది.
పెహల్గాం దాడి తర్వాత ఆఫ్గనిస్థాన్ సైతం భారత్ కే మద్దతు
గట్టిగా నాలుగు రోజులు కూడా నిలబడలేని పాకిస్థాన్ ఇంత హంగామా చేయడం అవసరమా అన్నదే ప్రశ్న. ఒక వేళ ఆ యుద్ధమూ వచ్చి ముగిసిందే అనుకున్నా.. తర్వాత ఆ దేశానికి సాయం చేయడానికి ఏ దేశమూ ముందుకొచ్చేలా కనిపించడం లేదు. పెహల్గాం దాడి తర్వాత ఆఫ్గనిస్థాన్ సైతం భారత్ కే మద్దతు తెలిపింది. పాక్ తప్పు చేసినట్టుగా తేల్చి చెప్పారు తాలిబన్లు. ఈ సిట్యువేషన్ లో పాకిస్థాన్ కి ఈ నాలుగు రోజుల నాటకం అవసరమా అంటున్నారు యుద్ధ రంగ నిపుణులు.
యుద్ధం వస్తే అథఃపాతాళానికి పడిపోవడం ఖాయం
భారత్ తో పోల్చుకుంటే ఇటు జనాభా పరంగా, అటు సైనిక పరంగా, ఆయుధాల పరంగా, ఆర్ధిక పరంగా, రాజకీయ సుస్థిరత పరంగా, అంతర్జాతీయ సహాయ సహకారాల పరంగా.. ఏరకంగానూ సమాన స్థాయిలో ఉన్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పాక్ పరిస్థితి.. యుద్ధం వస్తే అథఃపాతాళానికి పడిపోవడం ఖాయంగా తెలుస్తోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటి పోయాయి. రోజు గడవాలంటేనే అంతర్జాతీయ సంస్థల ముందు చేతులు చాచాల్సిన దుస్థితి.
ఇన్నేసి సవాళ్ల మధ్య పాకిస్థాన్ ఇటు గన్ను తీసి అటు పెట్టగలదా?
ఇటు ఆర్ధికంగానే కాదు.. అటు అంతర్గతంగా అనేక రాజకీయ వేర్పాటు వాద సవాళ్లు కాచుకుని ఉన్నాయి. మరో పక్క చూస్తే ప్రభుత్వం సైన్యం మధ్య సఖ్యత లేదు. ఇరు పక్షాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. భారత్ తో యుద్ధం అంటే పాకిస్థాన్ పూర్తిగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇన్నేసి సవాళ్ల మధ్య పాకిస్థాన్ ఇటు గన్ను తీసి అటు పెట్టగలదా? అన్న ప్రశ్న అణు విస్పోటనమంత శబ్ధం చేస్తోంది.