Big Stories

Cartoonist RK Laxman : కార్టూన్‌తో దేశాన్ని ట్యూన్ చేసిన లక్ష్మణ్..!

Cartoonist RK Laxman

Cartoonist RK Laxman : పనిమనిషి నుంచి ప్రధాని వరకూ ఆయన కార్టూన్‌ బారిన పడనివారు లేరు. ఆయన రాతల్లో తమ తలరాతలను చూసుకోని వారు లేరు. ఈయన సృష్టించిన కామన్ మ్యాన్‌ రోజూ బోలెడు కష్టాలు పడుతూ కనిపిస్తుంటాడు. కానీ.. ఆ కష్టంలోనే సమస్యలకు పరిష్కారాలూ చూపించాడు. అదే సమయంలో సామాన్యుల ప్రతినిధిగా నాటి ప్రభుత్వాలకూ నిద్ర పట్టనీయకుండా చేయగలిగాడు. ఉదయాన్నే నిద్రలేవగానే.. ఆ రోజు లక్ష్మణ్‌ ఎవరి కార్టూన్ వేశాడో చూడందే దేశ ప్రధానీ మరో పని గురించి ఆలోచించేవాడు కాదు. దీనిని బట్టే.. లక్ష్మన్ కుంచెకున్న బలమేంటో అర్థమవుతుంది.

- Advertisement -

ఆర్కే లక్ష్మణ్‌.. 1921 అక్టోబర్‌ 24న మైసూర్‌లో జన్మించారు. పూర్తిపేరు…రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ లక్ష్మణ్. ఆయన తండ్రి కృష్ణస్వామి లక్ష్మణ్‌ అయ్యర్‌ గవర్నమెంట్ స్కూలు హెడ్మాస్టర్. ఆ దంపతులకు ఆరుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. అందరిలోకీ పెద్దవాడు ప్రముఖ రచయిత ఆర్కే నారాయణ్‌ కాగా.. లక్ష్మణ్‌ అందరికంటే చిన్నవాడు. తల్లి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే టెన్నిస్‌, చెస్‌ ఆడేవారు. చదవడం, రాయడం రాకముందే బొమ్మలు గీయడం నేర్చుకుని.. నేల మీద, గోడలమీద, తలుపులు, కిటికీలు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇల్లంతా బొమ్మలు గీసేవాడు.

- Advertisement -

రోజూ పిచ్చిగీతలతో ఇల్లంతా పాడు చేస్తోన్న పిల్లాడ్ని.. స్కూల్లో వేస్తే దారికొస్తారనుకున్న తల్లిదండ్రులు… బడిలో చేర్చారు. అంతే.. మనోడు అక్కడి టీచర్ల బొమ్మలు తనదైన స్టైల్లో గీయటం మొదలుపెట్టాడు. ‘నా బొమ్మ ఇలా గీస్తావా’ అంటూ వారంతా మనోడిమీద కోప్పడేవారు. పదేళ్లనాటికి వ్యంగ్యంగా బొమ్మలు గీయటం మీద ఒక క్లారిటీ వచ్చింది. నాటి నుంచి అదే ధ్యాసగా బొమ్మలు గీస్తూ పోయాడు. ఎంతగా అంటే.. చదువూ సంధ్యా పక్కనపడేసేటంత. దీంతో పదో తరగతి పరీక్షల్లో ఫెయిలయ్యాడు.

దీంతో తల్లిదండ్రులు.. ‘సరే… అదేదో బొమ్మలు నేర్పించే స్కూల్లోనే చేరుద్దాం’ అనుకుని జేజే స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్ వారి స్కూలుకు లక్ష్మణ్ గీసిన రెండు బొమ్మలు జతచేసి, దరఖాస్తు చేశారు. కానీ.. ఆ స్కూలు వారు అతడి బొమ్మలు బాగాలేవని అడ్మిషన్ ఇచ్చేందుకు నిరాకరించారు. మరో దారి లేక.. కాలేజ్‌ ఆఫ్‌ మైసూర్ లో బీఏలో చేరారు. పాలిటిక్స్, ఎకనామిక్స్, ఫిలాసఫీ సబ్జెక్టులతో బీఏలో చేరారు. ఒకవైపు కాలేజీకి వెళ్తూనే.. మరోవైపు ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్‌‌గా బ్లిట్జ్, స్వరాజ్య వంటి పత్రికలకు కార్టూన్లు గీసేవారు. నారద అనే యానిమేటెడ్ చిత్రం కోసం బొమ్మలు గీశారు.

ఇవన్నీ మరెక్కడా ట్రైనింగ్ తీసుకోకుండా ఇదంతా ఎలా సాధ్యమైందని అడిగితే.. చిన్నప్పటి నుంచి తనకు కనిపించిన ప్రతి వస్తువును, మనిషిని, జంతువును., పక్షిని గీయడానికి ప్రయత్నించేవాడినని.. ఆ అభ్యాసమే తనకు ఏ ఆర్ట్స్‌ స్కూలూ చేయలేనంత సాయం చేసిందని అనేవారాయన. బీఏ కాగానే.. హిందుస్థాన్‌ టైమ్స్‌లో ఉదోగం కోసం వెళితే.. వయసు చాలదని పంపేశారు. దీంతో ఆర్కే ముంబై వెళ్లి ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌లో చేరారు. అక్కడ.. బాల్‌ ఠాక్రే సీనియర్ కార్టూనిస్ట్‌గా ఉండేవారు. అయితే.. పత్రికా యాజమాన్యం తన పనిలో జోక్యం చేసుకోవటం నచ్చక.. ఆయన అక్కడినుంచి బయటికి వచ్చేశారు.

లక్ష్మణ్‌కి తన మీద తనకు ఎంత నమ్మకం అంటే.. అదే రోజు నేరుగా.. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆఫీసుకెళ్లి అక్కడి ఆర్ట్‌ డైరెక్టర్‌ వాల్టర్‌ లాంగ్‌హామర్‌‌ను కలిసి.. తన వివరాలు చెప్పి, జాబ్ కావాలని కోరాడు. లక్ష్మణ్‌ ప్రతిభను అంతకుముందే గుర్తించిన వాల్టర్ వెంటనే అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇచ్చేశారు. అది మొదలు.. ఆర్కే లక్ష్మణ్‌ 50 ఏళ్లు ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

ఆ రోజుల్లో ఎవరైనా నాయకుడు పదవెక్కగానే పట్టుకునే మొదటి భయం ఆర్కేలక్ష్మణ్‌ కార్టూనే. నాటి నేతలు తప్పుచేస్తే చాలు.. మర్నాడు ఉదయానికి కార్టూన్ రూపంలో రంగంలోకి దిగిపోయేవాడు లక్ష్మణ్‌ కామన్‌ మేన్‌. లక్ష్మణ్‌‌కి దొరక్కుండా రోజు గడపటం ఆరోజుల్లో నేతలకు సవాలేనంటే అతిశయోక్తి కాదేమో. మధ్యతరగతి వారు ఈ కామన్ మ్యాన్‌ను.. సినిమాల్లో విలన్లను చితకబాదే హీరోగా చూసేవారు. అంతలా సమాజంతో మమేకమై సాగింది ఆయన కెరియర్.

లక్ష్మణ్‌ రూపొందించిన కామన్ మేన్ కాంస్య విగ్రహాన్ని ముంబైలోని జుహు బీచ్‌లో ప్రతిష్టించటం, పూణె నగరంలోని ప్రసిద్ధ సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కేంపస్‌లో లక్ష్మణ్ విగ్రహాన్ని పెట్టటాన్ని బట్టి ఆయన ఘనత ఎంతటిదో అర్థమవుతుంది. టైమ్స్ ఆఫ్‌ ఇండియా 150వ వార్షికోత్సవం సందర్భంగా భారత తపాలాశాఖ ‘కామన్ మేన్’ పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఎయిర్ డెక్కన్.. ఈయన కామన్ మ్యాన్ చిత్రాన్ని తన లోగోగా ఎంచుకుంది.

లండన్‌లో తన కార్టూన్లతో ప్రత్యక సోలో ఎగ్జిబిషన్‌ నిర్వహించిన ఏకైక కార్టూనిస్ట్ లక్ష్మణే. ఆర్కే లక్ష్మణ్‌ మంచి రచయిత కూడా. హోటల్‌ రివేరా, ద మెసెంజర్‌ వంటి నవలతో బాటు కొన్ని చిన్న కథలూ రాశారు. ఈయన విశేష సేవలకు 2005లో భారత ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌ పురస్కారంతో గౌరవించగా, 1984లో రామన్‌ మెగసెసే అవార్డు కూడా వరించింది. జనం మనసులో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న లక్ష్మణ్.. 2015 జనవరి 26న కన్నుమూశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News