నిడిగుండ అరుణ ప్రియుడు శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపింది. కరడుగట్టిన నేరస్తుడు, హత్య కేసులో నిందితుడు అయిన శ్రీకాంత్ కి పెరోల్ ఇప్పించింది ఎవరనే విషయం వైసీపీ, టీడీపీ రెండు పార్టీల నేతల్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హస్తం కూడా ఉందనే ఆరోపణలు రావడంతో ఆయన నేరుగా మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. శ్రీకాంత్ కి పెరోల్ ఇవ్వాలని తాను సిఫారసు లేఖ ఇవ్వడం వాస్తవమే అయినా శ్రీకాంత్ తండ్రి తన వద్దకు వస్తే మానవతా దృక్పథంతో సిఫార్సు లేఖ ఇవ్వాల్సి వచ్చిందన్నారాయన.
అది నాకొక పాఠం..
పెరోల్ లేఖ ఇవ్వడం తనకు ఓ పాఠం అని ఆవేదన వ్యక్తం చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇకపై తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎవ్వరికీ పెరోల్ విషయంలో లేఖలు ఇవ్వబోనన్నారు. ప్రతి విషయం రాజకీయ నాయకులకు పాఠాలు నేర్పిస్తుందని, తనకి ఇది ఒక పాఠం అని అన్నారు. తాను కూడా రాజకీయాల్లో నిరంతర విద్యార్థినేనని చెప్పుకొచ్చారు. వివిధ సమస్యలతో వచ్చే వారికి ఎమ్మెల్యేలు లేఖలు ఇస్తారని, అయితే చివరిగా అధికారులు వాటిని పరిశీలించి సమాధానం చెబుతారని అన్నారు. శ్రీకాంత్ పెరోల్ కోసం తనతోపాటు గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కూడా లేఖ ఇచ్చారని, జులై 16న తమ ఇద్దరి లేఖలను తిరస్కరిస్తూ హోం శాఖ అధికారులు రాత పూర్వక సమాధానం ఇచ్చారని అన్నారు. ఈ విషయంలో వైసీపీ నేతలు, వైసీపీ మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు కోటంరెడ్డి.
మీరు చేసిందేంటి?
లేఖలు ఇవ్వడమే తప్పు అని వైసీపీ అంటోందని, అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖలు ఇచ్చారని గుర్తు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య.. ఇద్దరూ శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖలు ఎలా ఇచ్చారని, వాటి ఆధారం అతడు జైలునుంచి పెరోల్ పై విడుదలయ్యాడని గుర్తు చేశారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలను అధికారులు పరిగణలోకి తీసుకోలేదన్నారు. తమ లేఖల వల్ల శ్రీకాంత్ కి పెరోల్ రాలేదన్నారు. ఎలా వచ్చిందనే విషయంపై హోంశాఖ అధికారులు ఆరా తీస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలని తాను తప్పుబట్టడం లేదని, లేఖలు ఇవ్వడం సాధారణం అని, అధికారులు నియమ నిబంధలకి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
మీ గుట్టు విప్పనా..?
తనపై వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తాను దందాలు చేసి ఉంటే అధికారానికి 18 నెలల ముందే అప్పటి సీఎం జగన్ ని విభేదించి బయటకు వచ్చేవాడినా అని ప్రశ్నించారు. ఒకవేళ తాను దందాలు చేసి ఉంటే అప్పుడే తనపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. 2004 నుంచి 2014 మధ్యలో నెల్లూరు రూరల్ లో అప్పటి అధికార పార్టీ ఇంచార్జ్ గా ఇప్పటి వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న వ్యక్తి హయాంలో హత్యలు, ఇసుక, గ్రావెల్ స్మగ్లింగ్ గురించి మాట్లాడుదామా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరులో ఏ ఒక్క వైసీపీ కార్యకర్తని అయినా వేధించామా, దాడులు చేసామా అని అడిగారు. అధికారంలో నుంచి 18 నెలల ముందు తాను బయటకి వచ్చినప్పుడు తనతోపాటు తన కుటుంబ సభ్యుల్ని కూడా వేధించారని, వారిపై తాను ప్రతీకారం తీర్చుకోవాలంటే చుక్కలు చూపించేవాడినని, నరకం ఎలా ఉంటుందో చూపించేవాడినని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు తమ చేతులు కట్టేశారని, లోకేష్ అంగీకరించరు కాబట్టి సైలెంట్ గా ఉన్నామని చెప్పుకొచ్చారు.