Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో అముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్యల మధ్య వివాదం కుల రాజకీయాలకు తెరలేపింది .. ఈ ఎపిసోడ్‌లోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కాళింగ యుద్ధమంటూ పెద్దపెద్ద స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. జిల్లాలోవెలమల ఆదిపత్యాన్ని అంగీకరించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. అసలు ఈ వివాదం కుల రాజకీయాల వైపు ఎందుకు టర్న్ తీసుకుంది?
కూన రవిపై కేబీబీవీ ప్రిన్సిపల్ సంచలన ఆరోపణలు
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై లోలుగు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచనలంగా మారాయి. తనను కూన రవికుమార్ మానసికంగా, శారీరకంగా వేధించారని ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అంతేకాదు ఆమె ఆత్మహత్యయత్నం చేయడంతో వివాదం తారాస్థాయికి చేరింది. అయితే.. కూన రవికుమార్ మాత్రం ప్రిన్సిపల్ ఆరోపణలను కొట్టి పారేశారు. లోలుగు నుంచి కంచలి ట్రాన్స్ఫర్ అవ్వడం ఇష్టం లేక ఆమె తనపై బురద చల్లుతుందని మండిపడ్డారు. ఈ అంశాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవడానికి సౌమ్యను వెనకుండి నడిపస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో తనను మించిన నాయుకుడు లేడని తనపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఫైర్ అవుతున్నారు.
టైమ్ వచ్చినప్పుడు ఆడియో టేపులు బయటపెడతానంటున్న కూన రవి
జిల్లాలో జరుగుతున్న ప్రచారానికి కూన రవికుమార్ కామెంట్స్ కూడా బలాన్నిస్తున్నాయి. తను చుట్టూ కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన ఆడియోలు కూడా తన దగ్గరున్నాయని.. టైం వచ్చినపుడు అన్ని బయట పెడతానని అంటున్నారు. ఓవైపు వైసీపీ నేతల పేర్లను ధైర్యంగా ప్రస్తావిస్తున్న ఆయన.. ఆడియో టేపులంటూ సొంత పార్టీ నేతల గురించే మాట్లాడుతున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కుల రాజకీయాల ఉచ్చులో ప్రిన్సిపల్ పావుగా మారారా?
అయితే ప్రిన్సిపాల్ సౌమ్య వివాదం సిక్కోలులో అటు తిరిగి ఇటు తిరిగి కులరాజకీయాలకు దారి తీస్తోంది. కుల రాజకీయాల ఉచ్చులో ప్రిన్సిపల్ పావుగా మారిపోయారన్న వాదన వినిపిస్తోంది. నిజం ఏదైనప్పటికీ శ్రీకాకుళంలో క్యాస్ట్ పాలిటిక్స్ వేడెక్కాయి. నిజానికి అభివృద్ధిలో వెనకబడిన ఈ ప్రాంతం.. కుల రాజకీయాల్లో ఎప్పుడూ ముందే ఉంటుంది. ప్రతీ విషయంలో.. ప్రధానంగా రాజకీయాల్లో వెలమ, కాళింగులు పోటీ పడుతూ ఉంటారు. ఈ పోటీ సందర్భానుసారంగా చర్చకు వస్తుంది. కేజీబీవీ ప్రిన్సిపల్ వివాదం, దువ్వాడ శ్రీనివాస్ కామెంట్స్ తో మరోసారి ఈ డిస్కషన్ జరుగుతోంది.
కాళింగ వర్గానికి చెందిన కూన రవి, దువ్వాడ శ్రీను
శ్రీకాకుళం రాజకీయాలను ఈ రెండు సామాజికవర్గాలే శాసిస్తాయి. కింజరాపు, ధర్మాన లాంటి కుటుంబాలు వెలమ సామాజిక వర్గానికి చెందినవైతే.. తమ్మినేని, కూన, దువ్వాడ లాంటి వారు కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారు. రాజకీయంగా ఒకింత వెలమ సామాజిక వర్గానిదే పైచేయి అని ఈ పేర్లను చూస్తేనే అర్థం అవుతోంది. కాళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణి కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రి పని చేసినా.. ఆమె మెరుపు తీగలా కొంతకాలానికే మాయమైపోయారు. మొత్తానికి కాళింగులు కాసింత వెనకబడ్డారనేది నిజం. కాదు కాళింగులు తొక్కివేయబడుతున్నారని అంటున్నారు దువ్వాడ లాంటి వారు.
వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను
దువ్వాడ ప్రస్తుతం వైసీపీ నుంచి సస్పెండ్ అయి స్వేచ్చా జీవిలా ఉన్నారు కాబట్టి ఏమైనా మాట్లాడగలరు. కానీ, జిల్లా ప్రజల్లో కూడా ఈ కుల క్యాలిక్యూలేషన్స్‌పై అదే రకమైన చర్చ జరుగుతోంది. గతేడాది దువ్వాడ శ్రీనివాస్, ఈ ఏడాది కూన రవికుమార్ వివాదాల్లో చిక్కుకున్నారు. చిక్కుకోవడం కాదు ప్లాన్ ప్రకారం చిక్కుకునేలా కుట్ర చేశారనేది వారి వాదన. వైసీపీలో ఉన్నపుడు ధర్మాన ప్రసాద్ తనపై కుట్రలు చేశారని.. అందులో అచ్చెన్నకు కూడా వాటా ఉందని దువ్వాడ వెర్షన్. టీడీపీలో కూన రవికుమార్‌ను బలహీన పరచడానికి అచ్చెన్న కుట్రలు చేస్తున్నారని.. ఈ కుట్రలో వైసీపీ నేతలు పాత్రదారులుగా ఉన్నారని మరో కొత్త ఆరోపణ. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే కాళింగ సామాజిక వర్గాన్ని రాజకీయంగా భూస్థాపితం చేయడమే వారి లక్ష్యమని ఆయన అంటున్నారు.
కింజరాపు, ధర్మాన కుంటుంబాలు ముఖాముఖీ పోటీ చేయవని ఆరోపణలు
దువ్వాడ తన వాదనలను బలపరుచుకోవడానికి కొన్ని వాదనలు కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. కింజరాపు, ధర్మాన కుటుంబాలు రాజకీయంగా ప్రత్యర్థులైనా ఒకరిపై ఒకరు పోటీ చేయరని ఆయన విశ్లేషణ. అంతేకాదు.. ఎన్నికల్లో ఒకరికి ఒకరు సాయం కూడా చేసుకుంటారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా.. శ్రీకాకుళంలో టీడీపీ రెండు ఎమ్మెల్యే స్థానలకే పరిమితమైనా ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలవడానికి ధర్మాన ప్రసాద్ సహకారమే కారణమని అంటున్నారు దువ్వాడ.
Also Read: వెంకన్న ఖజానాలో ఉన్న బంగారం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!
అచ్చెన్న, ధర్మానలపై ఆరోపణలు గుప్పిస్తున్న దువ్వాడ
వెలమల్లోని ఆ ఐక్యత వారిని రాజకీయంగా పటిష్టం చేస్తుందని సిక్కోలు ప్రజలు సైతం కాదనలేకపోతున్నారు. కానీ కాళింగులు బలంగా ఉన్న దగ్గర అచ్చెన్నాయుడు, ధర్మాన ఫ్యామిలీస్ డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ ప్లే చేసి తమను బలహీన పరుస్తున్నాయని దువ్వాడ అంటున్నారు. టెక్కలి వైసీపీలో పేరాడ తిలక్, ఆమదాలవలసలో చింతాడ రవి లాంటి వారిని తయారు చేసి తనను, తమ్మినేని సీతారాంను బలహీన పరిచారని దువ్వాడ పొలిటికల్ విమర్శలు చేస్తున్నారు. అందుకే.. ఇక కాళింగులను కూడా ఏకం చేస్తానని భీష్మ శపథం చేస్తున్నారు. కాళింగ యుద్దం మొదలు పెడతానని జిల్లాలో వెలమ ఆధిపత్యానికి తెర దించుతానంటున్నారు దువ్వాడ. మరి చూడాలి పొలిటికల్ ఫ్లాట్‌ఫాం లేని దువ్వాడ శ్రీను ఫ్యూచర్ రాజకీయం ఎలా ఉంటుందో?
Story By Rami Reddy, Bigtv