KCR: ఉపరాష్ట్రపతి ఎన్నికలపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ డిబెట్ నడుస్తోంది. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఆ రెండు పార్టీల రహస్య మైత్రిపై సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర ప్రచారం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో అది నిజమని నిరూపితమైందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గులాబీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎన్డీఏ కూటమి అభ్యర్ధికి మద్దతిస్తుందా? ఇండియా కూటమికి గులాబీ పార్టీ రాజ్యసభ సభ్యులు ఓటేస్తారా?
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్ధిగా జస్టీస్ సుదర్శనరెడ్డి
తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శనరెడ్డిని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్ధిగా ప్రకటించింది కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి. తెలంగాణ సెటిమెంట్‌తో పునాదులు నిర్మించుకున్న బీఆర్ఎస్ తెలంగాణ నుంచి పోటీలో ఉన్న అభ్యర్ధికి మద్ధతుగా ప్రకటిస్తుందా.. లేదా తెలంగాణ బిడ్డను తెలుగువారు గెలుపించుకోవాలని పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పిలుపును విస్మరిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలకు అతీతంగా సుదర్శన్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత తెలుగు వారిపై ఉందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి.. పీవీ నరసింహారావు ప్రధాని రేసులో ఉన్న సమయంలో ఎన్టీఆర్ అభ్యర్ధిని నిలపకుండా మద్ధతు ప్రకటించారని.. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ చూపించిన రాజకీయ విజ్ఞతను అందరూ ప్రదర్శించాలని సీఎం రేవంత్ కోరుతున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌ను కలిసి ఆ దిశగా కోరతానని ప్రకటించారు.
కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు ఇవ్వబోమని ప్రకటించిన కేటీఆర్
ఇండియా కూటమి అభ్యర్ధికి మద్ధతు ప్రకటించాలని సీఎం కోరిన 24 గంటల్లోనే బీఆర్ఎస్ నుంచి వ్యతిరేక రియాక్షన్ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్ధతు ఇవ్వబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. దాంతో కేటీఆర్ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఏకగ్రీవంగా ప్రకటించిన అభ్యర్ధి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వబోమని కేటీఆర్ ప్రకటించడంతో బీఆర్ఎస్ మద్ధతు ఎవరికి ఉండబోతుందనేది చర్చినీయాంశంగా మారింది.
ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతిస్తామని కేటీఆర్ పరోక్షంగా ప్రకటించారా?
ఎన్నికల్లో బరిలో ఉంది ఎన్డీఏ అభ్యర్ధి, ఇండియా కూటమి అభ్యర్ధులు ఇద్దరే. మరి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్ధతు ఇవ్వమంటూ కేటీఆర్ వ్యాఖ్యలు బట్టి చూస్తే ఇండైరెక్ట్‌గా ఎన్డీఏ అభ్యర్ధికి మద్ధతు ఇస్తున్నామనే ప్రకటించనట్లై అనే చర్చ స్టార్ట్ అయింది. బీజేపీ,బీఆర్ఎస్ విలీనంపై చర్చ నడుస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ఎన్డీఏ అభ్యర్ధికి మద్ధతు ప్రకటిస్తే రాజకీయంగా బీఆర్ఎస్ ఇబ్బంది పడే పరిస్ధితులు ఉన్నాయనేది పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తున్న చర్చ. ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్, బీజేపీలో విలీనం చేయబోతున్నారనేది తెలంగాణ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందనే ప్రచారం తెగ నడుస్తోంది. కవిత కూడా కేసీఆర్‌కు రాసిన లేఖలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో రాజకీయంగా బీఆర్ఎస్ ఇరుకుపడుతున్న పరిస్ధితి. సమయం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్, బీజేపీ విలీనం అంశం తరచూ రాజకీయ అస్త్రంగా మారుతుంది. ఇలాంటి తరుణంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి బీఆర్ఎస్ మద్ధతు ప్రకటిస్తుందా..లేదా అనేది ఆసక్తి రేపుతోంది.
Also Read: స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్..
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో స్టాండ్‌పై క్లారిటీ అవ్వని కేటీఆర్
ఎన్డీఏ అభ్యర్ధి సీపీ రాధకృష్ణన్‌కు మద్ధతు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ పరోక్షంగా ప్రకటించినట్లే అంటున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్థంగా ఉంటుందని కేటీఆర్ క్లారిటీ ఇవ్వని పరిస్థితుల్లో ఆ వాదనకు బలం చేకూర్చినట్లు అయింది. ఎన్నికల్లో పాల్గొని ఎన్డీఏ అభ్యర్ధికి ఓటు వేస్తే రాజకీయంగా బీఆర్ఎస్ ఎలా సమర్ధించుకుంటుదనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది.. ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటిస్తే రాజకీయంగా ఎదురయ్యే ప్రశ్నలకు బీఆర్ఎస్ నాయకత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందనే చర్చ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ అడుగులు ఎటు వైపు పడబోతున్నాయనేది వేచి చూడాలి.
Story By Rami Reddy, Bigtv