కర్నాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రంపై తీవ్ర ఆరోపణలు చేసిన ముసుగు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న మొన్నటి వరకు అతడిని ముసుగు వ్యక్తిగా, మిస్టర్ భీమాగా సంబోధించేవారు. ఇప్పుడు అతడి అసలు పేరు సీఎన్ చిన్నయ్యగా చెబుతున్నారు. సదరు చిన్నయ్య దెబ్బకి దేశమంతా బెంబేలెత్తిపోయింది. ఒక్కసారిగా అందరి దృష్టి ధర్మస్థలపై పడింది. జాతీయ మీడియా, పొరుగు రాష్ట్రాల మీడియా కూడా ఆ వ్యవహారంపై ఆసక్తి చూపింది. చివరకు అందర్నీ చిన్నయ్య తప్పుదారి పట్టించాడని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలుసుకోడానికి చిన్నయ్యను అరెస్ట్ చేశారు పోలీసులు.
అసలేం జరిగింది..?
భీమా అనే ఒక వ్యక్తి ధర్మస్థల పుణ్య క్షేత్రంలో హత్యలు, అత్యాచారాలు జరిగాయని.. బాధితుల శవాల పూడ్చివేతకు తానే ప్రధాన సాక్షిని అని, తనకు రక్షణ కల్పిస్తే అన్ని విషయాలు బయటపెడతానంటూ జులై-3న కోర్టుని ఆశ్రయించాడు. లైంగిక వేధింపులతో అమ్మాయిల్ని, మహిళల్ని దారుణంగా హింసించి చంపారని, చివరకు మగవారిపై కూడా లైంగిక దాడులు జరిగాయని భీమా చెప్పడంతో ఈ వార్త సంచలనంగా మారింది. పోలీసులతోపాటు మీడియా కూడా ధర్మస్థలంపై ఫోకస్ పెట్టింది. భీమాను వెంటబెట్టుకుని పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. అతడు 1995 మరియు 2014 మధ్య కాలంలో ధర్మస్థలలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన మాట వాస్తమే. కానీ ఆ తర్వాత అతడు చెప్పినవన్నీ అబద్ధాలేలని తేలుతోంది. పోలీసులు రెండు వారాల పాటు అవిశ్రాంతంగా అతడు చెప్పిన ప్రాంతంలో వెతుకులాట చేపట్టారు. నేత్రావతి నది వెంబడి ఉన్న అటవీ ప్రాంతాల్లో గాలించారు. రెండు చోట్ల అస్థిపంజరాల అవశేషాలు లభ్యమయ్యాయి, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. అయితే భీమా చెప్పినట్టు వందల కొద్దీ శవాలు అక్కడ దొరకలేదు. కనీసం వాటి ఆనవాళ్లు కూడా లేవు. దీంతో అతడు చెప్పినదంతా అబద్ధం అని తేలింది.
రాజకీయ దుమారం..
కర్నాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేశారు. ఆ టీమ్ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి చివరకు భీమానే అరెస్ట్ చేసింది. అతడు చెప్పిన దానికి, అక్కడ ఉన్న పరిస్థితులకు అస్సలు పొంతన లేకపోవడంతో చివరకు అతడినే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అతడి మానసిక పరిస్థితిపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి.
మరో ట్విస్ట్..
ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. భీమా ఆరోపణల తర్వాత సుజాత భట్ అనే ఓ మహిళ తెరపైకి వచ్చింది. 2003లో ధర్మస్థలంలో తన కుమార్తె, వైద్య విద్యార్థిని అనన్య అదృశ్యమైందని ఆమె ఆరోపించారు. ఆమెను అపహరించి, దాడి చేశారని, చంపేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేసారు. సామూహిక ఖననాలు వార్తల నేపథ్యంలో సుజాత భట్ ఆరోపణలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చివరకు ఆమె కూడా మాట మార్చారు. కొంతమంది తనని ప్రేరేపించడంతో అలా కట్టుకథలల్లానని అన్నారు. తన కుటుంబంలో ఉన్న ఆస్తి తగాదాల వల్ల అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. తన తాతకు చెందిన స్థలాన్ని ధర్మస్థల అధికారులు స్వాధీనం చేసుకున్నారంటూ మరోవాదన వినిపించారు.
చివరకు తేలిందేంటి?
భీమాగా గుర్తించిన చిన్నయ్య చెప్పిన మాటల్లో వాస్తవం లేదు, సుజాత భట్ తన మాటలన్నీ అబద్ధాలేనని తానే ఒప్పుకుంది. చివరకు ఈ వ్యవహారంలో హడావిడి చేసిన రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర జరిగిందని, దర్యాప్తులో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు కర్నాటక డిప్యూటీసీఎం డీకే శివకుమార్. తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.