AP Politics: నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గం నిప్పుల కుంపటిలా మారింది. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా సంచలనం కలిగిస్తోంది. ఇక్కడ అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య జరుగుతున్న రచ్చ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఒకరిపై, ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్న రాజకీయ వైరం కాస్తా..ఇప్పుడు హత్యాయత్నం కేసు వరకు దారి తీసింది. అసలు కావలిలో ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిల మధ్య ఎందుకు ఇంత వైరం? ఈ రాజకీయ దుమారం వెనుక ఉన్న అసలు కారణాలేంటి?
ప్రతాప్‌కుమార్‌రెడ్డి అవినీతిపై ఫోకస్ పెట్టిన వెంకట కృష్ణారెడ్డి
నెల్లూరు జిల్లాలో రాజకీయ చైతన్యం ఉన్న నియోజకవర్గాల్లో కావలి ఒకటి. అలాంటి కావలిలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వెంకట కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే గత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతిపై ఆయన దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో కావలి అభివృద్ధి కుంటుపడిందని అమృత్ పైలాన్ పథకంలో కోట్ల రూపాయల నిధులు దారి మళ్ళించారని, అక్రమ గ్రావెల్, ఇసుక, లేఅవుట్ల ద్వారా కోట్లు సంపాదించారంటూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు 126 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, దాని విలువ సుమారు రూ. 500 కోట్లు ఉంటుందని, వాటిని తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తామని కూడా ప్రకటించారు.
గాలిలో గెలిచిన గాలి ఎమ్మెల్యే అని వైసీపీ విమర్శలు
ఎమ్మెల్యే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆ 126 ఎకరాల అక్రమ భూమిని వెలికితీసి ప్రభుత్వానికి అప్పగిస్తే తాను సంతోషిస్తాను అంటూ సవాల్ విసిరారు. అమృత్ పథకంలో అవినీతి జరగలేదని, కాంట్రాక్టర్లు మాత్రమే పనిచేశారని ఆయన వివరణ ఇచ్చారు. అయితే ఆ తర్వాత కూడా రాజకీయ దుమారం ఆగలేదు. కావలిలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, అక్రమ కేసులు పెడుతున్నారని, అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని ప్రతాప్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గాలిలో గెలిచిన గాలి ఎమ్మెల్యే అంటూ ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డిని విమర్శించారు. దానికి కృష్ణారెడ్డి కూడా అంతే గట్టిగా బదులిచ్చారు. ఆ గాలి తగిలి ఎక్కడికో కొట్టుకుపోయావు, రాబోయే ఎన్నికల్లో వీచే గాలికి అడ్రస్ లేకుండా కొట్టుకుపోతావంటూ కౌంటర్ ఇచ్చారు..
వివాదాన్ని మరింత పెంచిన తుమ్మపెంట వివాదం
ఇది కేవలం మాటల యుద్ధంతో ఆగలేదు.. తాజాగా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో జరిగిన ఒక ఘటన ఈ వివాదాన్ని మరింత పెంచింది. జలజీవన్ మిషన్ పైలాన్‌ను ధ్వంసం చేయడంతో ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి నేరుగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఈ పైలాన్ దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రారంభించడం జరిగిందని దాన్ని కూడా వైసీపీ వారు ధ్వంసం చేయడం మరింత దారుణమని మండిపడ్డారు. ప్రతాప్, నువ్వు కావలికి రా! నీ అంతు చూడడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు. అయితే ప్రతాప్ కుమార్ రెడ్డి దీనికి స్పందిస్తూ, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అహంకారంతో విమర్శలు చేస్తున్నారని..ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. కావలిని అభివృద్ధి చేస్తే సహకరిస్తానని, లేకపోతే ప్రతిరోజూ ప్రశ్నిస్తూనే ఉంటానని హెచ్చరించారు. ఈ ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు ఏ మలుపు తీసుకుంటాయో అని ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
వెంకట కృష్ణారెడ్డిని చంపడానికి కుట్ర పన్నారని ఐదుగురిపై కేసు
తాజాగా కావలి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డిని చంపడానికి కుట్ర పన్నారని ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కుట్ర వెనుక మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అతని అనుచరులు ఉన్నారని కావలి డీఎస్పీ శ్రీధర్ మీడియాకు వెల్లడించారు. జలదంకి మండలం, గట్టుపల్లిలోని శ్రీ గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్ వద్ద డ్రోన్ సహాయంతో మాజీ ఎమ్మెల్యే అనుచరులను గుర్తించారు. వారు కత్తులు, రాళ్లతో ఎమ్మెల్యేను హతమార్చేందుకు సిద్ధంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. క్రషర్ సిబ్బంది డ్రోన్‌ను గుర్తించి అడ్డుకోవడంతో, నిందితులు దాడికి విఫలమై పారిపోయారని పోలీసులు అంటున్నారు.
Also Read: హైడ్రా అదుర్స్.. రూ.400 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది..
కావలి రాజకీయాల్లో సంచలనం రేపిన హత్యాయత్నం ఘటన
పోలీసుల దర్యాప్తులో ఇస్సారపు వేణు, గోళ్ళ వినోద్ కుమార్లను అరెస్ట్ చేశారు. అయితే దామెర్ల శ్రావణ్ కుమార్, ఆత్మకూరు రాజేష్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయిని డీఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఘటన కావలి రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించింది. ఒక సాధారణ రాజకీయ పోరు, ఇప్పుడు హత్యాయత్నం కేసుగా మారడం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తుందని టాక్. ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం, ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇప్పుడు ఏకంగా హత్యాయత్నం కేసు వరకు దారితీశాయి. రానున్న రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో..కావలి రాజకీయాలు ఏ దిశలో పయనిస్తాయో చూడాలి.
Story By Rami Reddy, Bigtv