BigTV English

Social Media Influencers: ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇలా చేస్తే.. ఊచలు లెక్కించాల్సిందే..!

Social Media Influencers: ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇలా చేస్తే.. ఊచలు లెక్కించాల్సిందే..!

పెరుగుతున్న ఆన్ లైన్ బెట్టింగ్ ప్రమోషన్స్

రండి వచ్చి ఆడండి.. అంటూ తలా కొంత మొత్తం ముందే ఇచ్చి ఇష్టంలేని వారిని కూడా ఈ కూపంలోకి లాక్కురావడం వేరు. రెండింటికీ చాలా తేడా ఉంది. బలవంతంగా ఈ ఆన్ లైన్ బెట్టింగ్ లోకి దింపే బ్యాచులు ఎక్కువవుతున్నాయి. సోషల్ మీడియాలో ఏది చూసినా అయితే బెట్టింగ్.. లేదంటే డేటింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు.


రాత్రికి రాత్రే డబ్బులు సంపాదించేలా డీల్స్

సోషల్ మీడియాలో లక్షలాది ఫాలోవర్స్, సబ్ స్క్రైబర్స్ ఉన్న వాళ్లు తాము ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారు. ఆడిందే ఆట పాడిందే పాట.. అడిగేవారు ఎవరూ లేరనుకుంటున్నారు. రాత్రికి రాత్రే ఫుల్ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. అందుకే బెట్టింగ్ యాప్స్ ను గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. నిజానికి ఏపీ, తెలంగాణలో ఆన్ లైన్ బెట్టింగ్స్, గేమింగ్స్ పై బ్యాన్ ఉంది. అయినా సరే ఈ బ్యాన్ మమ్మల్ని ఏం చేస్తుందని అనుకుంటున్నారు. ఎవరికీ బెదిరేదే లేదనుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే ఇదీ లోకల్ బాయ్ నాని పరిస్థితి. బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ అరెస్టై రిమాండ్ లో ఉన్నాడు.

బెట్టింగ్ లపై అవేర్ నెస్ తెస్తున్న సజ్జనార్

సీనియర్ ఐపీఎస్ సజ్జనార్.. చాలా కాలం నుంచి ఇలాంటి ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దంటూ సోషల్ మీడియాలో అలర్ట్ చేస్తూనే వస్తున్నారు. అంతే కాదు.. ఇన్ ఫ్లూయెన్సర్లు ఇలాంటివి ప్రమోట్ చేయొద్దని వార్నింగ్స్ ఇస్తూనే వచ్చారు. అయినా చాలా మంది పెడచెవిన పెడుతున్నారు. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరనుకుని విచ్చలవిడిగా జనాన్ని ఆన్ లైన్ బెట్టింగ్ లలోకి లాగుతున్నారు. కొందరు ఈజీగా బుట్టలో పడుతున్నారు. బుట్టలో పడని వారి కోసం తామే కొంత మనీ ఇప్పించి అలవాటు చేయిస్తున్నారు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనన్న నాని

మీరు చూస్తున్న ఈ లోకల్ బాయ్ నాని విశాఖకు చెందిన యూట్యూబర్. చేపలు పట్టడం వృత్తి. అవే సముద్రం వీడియోలు తీస్తూ జనంలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ ఈ మధ్య బెట్టింగ్ ప్రమోషన్స్ షురూ చేయడంతో అది సజ్జనార్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ మీరు డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయని, ఇవేం దిక్కుమాలిన పనులు అంటూ పోస్ట్ పెట్టారు. ఇప్పటికైనా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లను ఆపండి అంటూ ట్వీట్ చేశారు సజ్జనార్. ఈ పోస్ట్ వైరల్ కావడంతో యూట్యూబర్ లోకల్ బాయ్ నాని రియాక్ట్ అయ్యాడు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఇకపై బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్లు చేయనని, ప్రమోట్ చేస్తే సోషల్ మీడియా నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పాడు నాని. ఈయనలో మార్పు వచ్చినందుకు సజ్జనార్ ప్రశంసించారు కూడా.

చదువుకున్న వాళ్లు కూడా ప్రమోట్ చేస్తున్నారన్న నాని

సజ్జనార్ ట్వీట్‌కు స్పందించిన వైజాగ్ పోలీసులు.. కేసు నమోదు చేసి ఫిబ్రవరి 23న మధ్యాహ్నం నానిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. తాను చదవుకోలేదని.. చాలా మంది చదువుకున్న వాళ్లు కూడా ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారని నాని చెప్పుకొచ్చాడు. అందరిలాగే తాను కూడా చేశానని.. కానీ తాను చేసింది తప్పని.. కానీ అది తప్పని తెలిసిన తర్వాత వెంటనే వాటిని ప్రమోట్ చేయటం ఆపేశానని చెప్పుకొచ్చాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పుడు నాని సంగతి సరే.. మరి మిగితా ఇన్ ఫ్లూయెన్సర్ల పరిస్థితి ఏంటన్నది చర్చకు వస్తోంది. నానిని లోపలేశారు.. చాలా మంది ఇంకా రెచ్చిపోయి ఆన్ లైన్ బెట్టింగ్ లవైపు జనాన్ని తోస్తూనే ఉన్నారు. వీళ్ల సంగతి కూడా తేల్చాల్సిన టైమ్ వచ్చేసింది.

భయ్యా సన్నీయాదవ్ పోస్ట్ పైనా సజ్జనార్ ఫైర్

అంతకు ముందు భయ్యా సన్నీయాదవ్ అనే యూట్యూబర్ స్క్రీన్ షాట్ తో సజ్జనార్ పోస్ట్ పెట్టారు. షాప్ కు వెళ్లి అక్కడే బెట్టింగ్ పెట్టి.. వచ్చిన లాభంతో నచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు అంటూ చెప్పిన విషయాన్ని పోస్ట్ చేశారు. ఇంతకన్నా దిక్కుమాలినతనం ఉంటుందా అని కూడా క్వశ్చన్ చేశారు. ఆన్ లైన్ బెట్టింగ్ లకు చాలా మంది బలవుతున్నా ఏమీ పట్టనట్లు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ఉంటున్నారన్నారు. అయినా సరే ఎవరూ మారడం లేదు.

సోషల్ మీడియాలో సంపాదనకు చాలా మార్గాలు

సోషల్ మీడియా ముసుగులో ఏది చేసినా చెల్లుతుందని చాలా మంది అనుకుంటున్నారు. లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న వారి సంగతి చెప్పక్కర్లేదు. యూట్యూబ్, గూగుల్, పెయిడ్ ప్రమోషన్స్, అఫిలియేట్ మార్కెటింగ్ ఇలా రకరకాల రూపాల్లో సోషల్ మీడియా నుంచి డబ్బులు వస్తున్నా.. చాలా మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలు ఇంకా అత్యాశకు పోతున్నారు. ఎక్కువ కమీషన్లు వచ్చే పనులు చేస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఆన్ లైన్ బెట్టింగ్స్, గేమింగ్స్ బ్యాన్ ఉన్నా సరే.. నిస్సిగ్గుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. రండి ఆడండి గెలుచుకోండి అంటున్నారు. తీరా చూస్తే మొదట్లో బాగానే డబ్బులు వస్తుంటాయి.

ఉన్నదంతా ఊడ్చి రోడ్డున పడేస్తారు జాగ్రత్త

దీన్ని చూసి ఇంకా పెడుతూ పోతే అప్పుడు అసలు కథ స్టార్ట్ చేస్తారు. అవసరమైతే అధిక వడ్డీకి లోన్ యాప్ ద్వారా ఇన్ స్టంట్ గా లోన్లు కూడా ఇప్పిస్తుంటారు. తీరా ఉన్నదంతా ఊడ్చేసి.. రోడ్డున పడేస్తారు. ఉన్నది అమ్ముకునేలా చేస్తారు. చివరికి కట్టుబట్ట కూడా మిగలకుండా చేస్తున్నారు. దీంతో సూసైడ్ తప్ప మరో మార్గం ఉండడం లేదు. అందుకే ఆన్ లైన్ బెట్టింగ్ లతో చాలా మంది నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సోషల్ ఇన్ ఫ్లూయెన్సర్లు

రైట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల విషయానికి వద్దాం. కొందరు ట్రావెలింగ్ చేస్తూ vlogs పెడుతున్నారు. ఇంకొందరు తాము చేసే పనులనే వీడియోలుగా తీసి పెడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో ట్యాలెంట్ ఉంది. అయితే ఇందులో కొందరు చాలా తెలివి మీరుతున్నారు. ఈ డబ్బులు సరిపోవడం లేదని ఎక్కువ కమీషన్లు ఇచ్చే ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్స్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్ పెడుతున్న వారైతే డేటింగ్ యాప్ లను పరిచయం చేస్తున్నారు. ఫుల్ సెక్యూరిటీ అంటున్నారు.

జనాన్ని నిండా ముంచే అతి తెలివి తేటలే ఎక్కువ

ప్రైవసీ అంటున్నారు. ఒక్కొక్కడిది ఒక్కో స్టైల్. జనాన్ని నిండా ముంచే అతి తెలివి తేటలే ఇక్కడ పని చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎవరు యూట్యూబ్ ఓపెన్ చేసినా ఠంచనుగా కొన్ని వీడియోలు కనిపిస్తుంటాయి. అదే వారికి ప్లస్ అయింది. జనాన్ని ఇంకెలా బురిడీ కొట్టించాలో తెలుసుకుని మరీ నిషేధం ఉన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. నిజానికి వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్రకారం ఇలాంటి బెట్టింగ్ ప్రమోషన్స్ చట్టరీత్యా నేరం. సోషల్ మీడియా అకౌంట్లు పర్మినెంట్ గా క్లోజ్ చేస్తారు. కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న వారు మారుతారా?

ఇప్పుడు లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యాడు. తాను చదువుకోలేదని, తెలిసో తెలియకో ప్రమోట్ చేశానని, ఇకపై వీటికి దూరమని ప్రకటించాడు. మరి ఇప్పటికే ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిలో భయం మొదలవుతుందా.. ఇంకా రెచ్చిపోతారా అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. రెచ్చిపోతే చూస్తూ ఊరుకునేది లేదని పోలీసులు అంటున్నారు. ఇప్పటికైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపుతారా లేదా అన్నది చూడాలి. ఆపినా ఆపకపోయినా.. ఇదివరకు జనాన్ని రెచ్చగొట్టి డబ్బులు పోగొట్టించిన వారి సంగతి తేల్చాల్సిందే అన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.

ఎవరు చస్తే మాకేంటి అనుకుంటున్న ధోరణి

కుటుంబాలను నాశనం చేసేందుకు ఇదే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ప్రత్యక్షంగానే కారణమవుతున్నారు. జనాల చావులకు కారణమవుతున్నారు. ఎవరు చస్తే మాకేంటి అనుకున్న ధోరణితోనే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చింది. ఇకపై ఆటలు సాగబోవంటూ పోలీస్ డిపార్ట్ మెంట్ స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇస్తోంది. అంతే కాదు.. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయొద్దంటూ మరికొందరు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ఎంత ప్రయత్నించినా వర్కవుట్ కావడం లేదు.

క్షణాల్లో డబ్బులు సంపాదన అన్నది బలహీనత

డబ్బు మనిషి బలహీనత. ఎటూ కదలకుండా.. ఫోన్ ఆపరేటింగ్ చేస్తూ క్షణాల్లో డబ్బులు సంపాదించండి అంటే ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. అదే వీక్ నెస్ తో సోషల్ మీడియా కేటుగాళ్లు ఆడుకుంటున్నారు. జనం శవాలపై డబ్బులు దండుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడాది కిందటే ఇలా ప్రమోట్ చేయడం నేరమని ప్రకటించింది. సైబర్‌ ముఠాలు కొన్ని నకిలీ ట్రేడింగ్‌ వెబ్‌సైట్లు సృష్టించి ఇన్‌ఫ్లుయోన్సర్లతో ప్రచారం చేయిస్తున్నారు. నిండా ముంచేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఫోన్ కాల్ రింగ్ కు ముందు అపరిచిత వ్యక్తుల నుంచి పెట్టుబడి సలహాలు తీసుకోవద్దని, ఎలాంటి లింకులు ఓపెన్ చేయొద్దని పదే పదే చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కూడా అవగాహన కల్పించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.

లక్షలు సంపాదించామని ఫేక్ వీడియోలతో గాలం

ప్రభుత్వాలు ఒకవైపు ఆన్ లైన్ బెట్టింగ్ లను కట్టి చేస్తుంటే.. ఇంకోవైపు ఈ సోషల్ కేటుగాళ్లు రెచ్చిపోతూ ప్రమోట్ చేస్తూ అందరినీ అందులోకి లాగుతున్నారు. FB, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా ఏది ఓపెన్ చేసినా ఇవే పనికిమాలిన ప్రమోషన్లు కనిపిస్తున్నాయి. ఇక చూస్తూ ఊరుకోబోమని పోలీసులు డైరెక్ట్ గానే వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇది వరకు ఇలా బెట్టింగ్స్ ప్రమోట్ చేసిన వారి వీడియోలు, వారి వివరాలు సేకరిస్తున్నారు. తాము లక్షలకు లక్షలు సంపాదించామని ఫేక్ వీడియో తీసి పెడుతుంటారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను సోషల్ మీడియా వరకే ఆపేయాలి. ఆ ఫాలోయింగ్ అక్కడివరకే ఉండాలి. తప్పుదోవ పట్టించే వారు చెప్పే విషయాలను నిజజీవితం లోకి తీసుకుంటే మొదటికే మోసం వస్తుందన్నది గ్రహించాలి.

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఇటీవలే మీటింగ్

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లపై తెలంగాణలో బ్యాన్ ఉన్నప్పటికీ ఆయా వెబ్‌సైట్ల వినియోగానికి ఇక్కడి ప్రజలను ఎలా అనుమతిస్తున్నారంటూ సంబంధిత వెబ్‌సైట్ల నిర్వాహకులు, ఇంటర్నెట్‌ ప్రొవైడర్లను తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఇటీవలే నిలదీసింది కూడా. పలు బెట్టింగ్‌, గేమింగ్‌ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో నమోదైన ఫోన్‌ నెంబర్‌, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా ఉన్న వ్యక్తులకు నిషేధిత గేమింగ్‌ సైట్లలో లాగిన్‌ అయ్యేందుకు అవకాశం ఎందుకిస్తున్నారని షికా గోయెల్ ప్రశ్నించారు.

బెట్టింగ్‌ వ్యవహారాలపై ఫిర్యాదులకు 1930 నెంబర్

ఆలిండియా గేమింగ్‌ ఫెడరేషన్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫాంటసీ స్పోర్ట్స్‌, పలు గేమింగ్‌ కంపెనీల సీఈఓలు, ఇంటర్నెట్‌ సర్వీసు ప్రోవైడర్లు, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం ప్రతినిధులతో ఇటీవలే మీటింగ్ కూడా పెట్టి స్ట్రిక్ట్ గా చెప్పేశారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌కు బానిసలై పలువురు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. గేమింగ్‌ సంస్థలు జియో ఫెన్సింగ్‌ పాటించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నిషేధిత గేమింగ్‌ యాప్‌ల్లో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిపై 1930కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పిలుపునిచ్చింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×