Elon Musk: మాములుగా ఓ పది లక్షల ప్యాకేజీనో.. పాతిక లక్షల ప్యాకేజీనో అంటేనే నోరెళ్లబెడతాం. కానీ ఏకంగా ఒక ట్రిలియన్ డాలర్ల ప్యాకేజ్ ఇచ్చారని తెలిస్తే మీ రియాక్షన్ ఏంటి? బుర్ర గిర్రున తిరిగిందా? మైండ్ బ్లాంక్ అయ్యిందా? కానీ ఇది నిజంగా నిజం. ఒక ట్రిలియన్ డాలర్ల ప్యాకేజ్‌ను.. ఒక ప్రముఖ కంపెనీ ఒకే వ్యక్తికి ఇచ్చింది. ఇంతకీ ఇంత డబ్బును ఎందుకు కుమ్మరించింది? దానికి కారణమేంటి? ఈ ట్రిలియన్ డాలర్లతో మారబోయేది ఏంటి?
అటు ఇటుగా రూ.84 లక్షల కోట్లు..
ఒక ట్రిలియన్ డాలర్ల ప్యాకేజ్.. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే.. అటు ఇటుగా 84 లక్షల కోట్ల రూపాయలు.. కార్పొరేట్ ఇండస్ట్రీలో ఇలాంటి ప్యాకేజ్ న భూతో.. న భవిష్యత్ అనే చెప్పాలి. ఇలాంటి ప్యాకేజ్ ఇవ్వాలంటే అతనికి ఎన్ని అర్హతలు ఉండాలి? అతని క్యాలిబర్ ఎంతై ఉండాలి? అసలు ఆ కంపెనీ వాల్యూ ఎంత ఉండి ఉండాలి? కానీ ఇవన్నీ టెస్లా కంపెనీకి.. ఎలాన్ మస్క్‌కు ఉన్నాయి. అందుకే ఆ కంపెనీ ఇంత భారీ ప్యాకేజ్‌ను ఆఫర్ చేసింది.. మస్క్ ఈ ప్యాకేజ్‌ను తీసుకునేందుకు అర్హత కూడా సాధించాడు. అందుకే టెస్లా హిస్టరీలో ఒక కొత్త అధ్యాయం కాదు.. పుస్తకమే ప్రారంభమైందని అనౌన్స్ చేశాడు.
75 శాతం మంది షేర్ హోల్డర్ల ఆమోదముద్ర
మస్క్‌కు ట్రిలియన్ డాలర్ల ప్యాకేజ్ అందించడానికి టెస్లాలో 75 శాతం మంది షేర్ హోల్డర్లు ఆమోదముద్ర వేశారు. దీంతో అతనికి ఈ ప్యాకేజ్ దక్కింది. నిజానికి ఒక వ్యక్తికి ఈ స్థాయిలో ప్యాకేజ్ ఇచ్చేందుకు ఎవ్వరైనా విమర్శలు చేస్తారు.. కాస్త తటపటాయిస్తారు.. టెస్లా కంపెనీ బోర్డులోని చాలా మంది కూడా అదే చేశారు. కానీ ఈ ప్యాకేజీకి ఓకే చేయకపోతే మస్క్ కంపెనీకి టాటా చెప్పేసి వెళ్లిపోతారని చెప్పడంతో నచ్చినా.. నచ్చకపోయినా.. ఇష్టమైనా.. కష్టమైనా.. అందరూ ఓకే చేశారు. అమోద ముద్ర వేశారు దీంతో మస్క్ స్టెప్పులు షురూ అయ్యాయి.
ప్రస్తుతం మస్క్ సంపద 473 బిలియన్స్ డాలర్లు
మాములుగానే మస్క్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు.. ఒకరు అనేకంటే అతనే ప్రస్తుతం టాప్‌లో ఉన్నారని చెప్పడం కరెక్ట్. ప్రస్తుతం అతని సంపద 473 బిలియన్ డాలర్లుగా ఉంది. కాస్త అటు ఇటు అయినా.. ఇప్పట్లో అతని పోజిషన్‌ను బీట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అతడికి సెకండ్ ప్లేస్‌లో ఉన్న ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌కు మధ్య వంద బిలియన్ డాలర్ల తేడా ఉంది. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ప్యాకేజ్ దక్కడం చూస్తుంటే.. స్పేస్ ఎక్స్ రాకెట్ నింగిలోకి దూసుకుపోయినట్టే.. అతని సంపాదన కూడా దూసుకుపోతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు.
టెస్లా కంపెనీ పరిస్థితి అంత బాగా లేదనే ప్రచారం
కానీ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి.. ప్రస్తుతం టెస్లా కంపెనీ పరిస్థితి అంత బాగా లేదనే ప్రచారం జరుగుతోంది. కంపెనీ లాభాల్లోనే కనిపిస్తున్న.. ఆశించినంత లాభాల్లో అయితే లేదనే చర్చ బిజినెస్ సర్కిళ్లలో జరుగుతోంది. ఎలక్ట్రిక్ కంపెనీ కార్ల తయారీలో ప్రస్తుతం చైనాకు చెందిన BYD కంపెనీ గట్టిపోటీనిస్తోంది. రోజురోజుకు అంతకంతకు విస్తరిస్తోంది. మరి ఇలాంటి సమయంలో ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ఎలా అనౌన్స్ చేసింది? ఎందుకు చేసింది? ఇక రెండోది.. ట్రిలియన్ డాలర్ల ప్యాకేజ్ ఇస్తున్నారంటే దాని వెనక ఏదో ఒక మతలబు ఉంటుంది. అంతా ఊహించినట్టే మస్క్ ముందు కొన్ని కండిషన్స్ పెట్టింది టెస్లా కంపెనీ. ఆ కండిషన్స్ ఏంటి?
పదేళ్లలో మస్క్ కొన్ని టాస్క్‌లు పూర్తి చేయాలి
ముందుగా టెస్లా మస్క్ ముందు ఉంచిన కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ ఇది ఒక్క ఏడాదికి సంబంధించిన ప్యాకేజీ కాదు. రాబోయే పదేళ్లలో మస్క్ కొన్ని టాస్క్‌లను పూర్తి చేయాలి. అప్పుడే ఆయనకు ఈ ప్యాకేజ్ అందుతుంది. అది కూడా టెస్లాలో అదనంగా 12 శాతం షేర్ల రూపంలో. ఇక కండిషన్స్ విషయానికి వస్తే రెండు కోట్ల టెస్లా వాహనాలు, పది లక్షల రోబోలను ఉత్పత్తి చేయాలి.. వాటిని డెలివరీ చేయాలి.. టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్‌కు కోటిమంది సబ్‌స్క్రైబర్లను సంపాదించాలి.. వాణిజ్య వినియోగానికి పది లక్షల రోబోటాక్సీ వాహనాలను మార్కెట్‌లోకి రిలీజ్ చేయాలి.. కంపెనీ నాలుగు వరుస క్వార్టర్లలో 400 బిలియన్ డాలర్ల వరకు నెట్ ప్రాఫిట్‌ను పొందడం.. ఇక ప్రస్తుతం 1.4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న టెస్లా మార్కెట్ విలువను 8.5 ట్రిలియన్ డాలర్లకు పెంచడం.. ఇవన్నీ చేస్తే మస్క్‌కు ఈ ప్యాకేజ్ అందుతుంది. మరో విషయం ఏంటి అంటే.. ప్రస్తుతం మస్క్‌కు జీతం ఉండదు.
వాల్యూయేషన్ 500 బిలియన్ డాలర్లు పెరుగుతున్న కొద్ది..
అంటే టెస్లా కంపెనీ వాల్యూయేషన్ 500 బిలియన్ డాలర్లు పెరుగుతున్న కొద్ది.. మస్క్‌కు ఒక్కో శాతం షేర్లు చేరుతూ ఉంటాయి. మొదటి దశ రివార్డ్ పొందాలంటే మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలి.. అప్పుడు ఫస్ట్ గ్రాంట్‌ను రిలీజ్ చేస్తారు. ఇలా అన్నీ లక్ష్యాలను సాధిస్తే.. టెస్లాలోని 25 శాతం షేర్లు మస్క్‌కు చేరుతాయి. ఈ టార్గెట్స్‌లో ఏ ఒక్కదాన్ని చేరుకోలేకపోయినా.. మస్క్‌కు ఎలాంటి చెల్లింపులు ఉండవు. సో.. మస్క్ చేయాల్సింది చాలానే ఉంది. మరి ఇదైతే అంత సులభంగా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం టెస్లా కంపెనీ లాభాల్లోనే ఉన్నా.. ఆశించిన తీరులో అయితే లేదు. టెస్లా కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గాయి.. ఈ ఎఫెక్ట్ లాభాలపై పడింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు తగ్గిపోవడంతో.. వాహనాల అమ్మకాలు 13 శాతం తగ్గాయి. దీంతో అమ్మకాలను పెంచడానికి కంపెనీ కొన్ని మోడళ్ల ధరలు తగ్గించింది. ఇది కూడా లాభాలపై ఎఫెక్ట్ చూపించింది.
ఫోర్ట్, టయోటా నుంచి గట్టి పోటీ
అంతేకాదు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఫోర్డ్, టయోటా నుంచి గట్టి పోటీ ఉంది. ముఖ్యంగా చైనా కంపెనీ BYD నుంచి అయితే తట్టుకోలేనంత పోటీ ఎదురవుతోంది టెస్లాకు. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటిని మస్క్ ఓవర్‌కమ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇదంతా అంత సులభమేనా? అసలు మస్క్ ఇంత డబ్బుతో ఏం చేస్తున్నారు? అంతా బాగుంది.. డబ్బు వర్షం కురుస్తోంది.. కానీ తన ముందు టెస్లా ఉంచిన ఈ టాస్క్‌లో మస్క్ పాసవుతాడా? అసలు అయ్యే చాన్స్ ఉందా? ఇంతకీ ఇప్పటికే ప్రపంచ కుబేరుడుగా ఉన్న ఎలాన్ మస్క్ ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు..? వచ్చే డబ్బుతో ఏం చేయబోతున్నాడు? ఇప్పుడివే ప్రశ్నలు అందరికి ఎదురవుతున్నాయి. మరి నిజంగానే ఈ డబ్బుతో మస్క్ ఏం చేయబోతున్నాడు?
2 ట్రిలియన్లకు చేర్చడ పెద్ద కష్టమేమి కాదనే చర్చ
టెస్లా పెట్టిన కండిషన్స్ మస్క్‌కు ఇప్పుడు పెద్ద టాస్క్. దీనిపై చాలా డిఫరెంట్ ఓపినియన్స్ వినిపిస్తున్నాయి. ఇందులో కొన్ని టాస్క్‌లు అసాధ్యమనేలా ఉన్నాంటున్నారు. ఫస్ట్ టాస్క్ మార్కెట్ విలువను 2 ట్రిలియన్లకు చేర్చాలి. ఇది పెద్ద కష్టమేమీ కాదనే చర్చ ఉంది. కానీ ఓవరాల్‌గా 8.5 ట్రిలియన్లకు చేర్చడం అనేది అత్యంత అసాధ్యమైన టాస్క్‌గా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ గోల్‌ను రీచ్ అవ్వాలంటే.. ఆపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీల మార్కెట్ వాల్యూ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువకు చేరుకోవాలి. కేవలం కార్ల అమ్మకాలతో ఈ టార్గెట్‌ను రీచ్ అవ్వడం కాస్త కష్టమైన పని. కానీ రోబో టాక్సీలు, ఆప్టిమస్ రోబోలు, AI టెక్నాలజీ రంగంలో విజయం సాధిస్తేనే ఇది సాధ్యమవుతుంది.
టెస్లా ఏడాదికి 20 లక్షళ యూనిట్ల అమ్మకాలు
2 కోట్ల వాహనాలు అమ్మకాలు, 400 బిలియన్ డాలర్ల నెట్ ప్రాఫిట్.. ఇది కూడా కాస్త కష్టమైన టాస్కే. ఎందుకంటే ప్రస్తుతం టెస్లా ఏడాదికి 20 లక్షల యూనిట్లు మాత్రమే అమ్ముతుంది. దీనిని 10 రెట్లు పెంచాలి.. ఇది చాలా పెద్ద టాస్క్. ఇక 400 బిలియన్ డాలర్ల నెట్ ప్రాఫిట్ అనేది కూడా అన్‌రీచబుల్ అన్నట్టుగా ఉంది. ఈ స్థాయిలో లాభాలు రావాలంటే.. AI సేవలు, రోబోటిక్స్‌పైనే పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి అని చెప్పాలి. 10 లక్షల రోబో టాక్సీలు.. 10 లక్షల ఆప్టిమస్ హ్యుమనాయిడ్ రోబోలను సర్వీస్‌లోకి తీసుకురావడం అనేది కూడా స్పెక్యులేటివ్ టెక్నాలజీలపైనే ఆధారపడి ఉంది. ఎందుకంటే రోబోలను ఇంకా మనుషుల మధ్యలోకి తీసుకొచ్చేందుకు కావాల్సిన అనుమతులు, వాటిని పర్‌ఫెక్ట్‌గా నియంత్రించడం ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. రోబో టాక్సీల టార్గెట్ మాత్రం రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది సక్సెస్ అయితే ఈ ఒక్క రంగం నుంచే ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూను తెచ్చి పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఓవరాల్‌గా చూస్తే ఇందులో కొన్ని టార్గెట్‌లను మస్క్ ఖచ్చితంగా రీచ్ కాగలడు. కానీ 8.5 ట్రిలియన్ డాలర్ల టార్గెట్‌ను రీచ్ అయ్యేది మాత్రం కాస్త కష్టమనేది ఇప్పుడు నిపుణులు చెబుతున్న అభిప్రాయం.
స్పేస్ ఎక్స్ సక్సెస్‌కు కారణం ఎలాన్ మస్క్
కానీ మస్క్ ట్రాక్ రికార్డ్ మాత్రం పెద్దదనే చెప్పాలి. ఎందుకంటే స్పేస్ ఎక్స్ లాంటి సంస్థలు ఈరోజు ఇంత సక్సెస్ అయ్యిందంటే దానికి కారణం మస్క్. ఎన్నోసార్లు ఫెయిల్యూర్ ఎదుర్కొన్నా.. వెనుతిరగకుండా దానిని నిలపెట్టాడు. సక్సెస్ అయ్యాడు. అందుకే అసాధ్యం అనేది నా డిక్షనరీలో లేదంటాడు మస్క్. మరి ఈ టాస్క్‌ను కూడా చాలెంజింగ్‌గా తీసుకున్నానని ఇప్పటికే అనౌన్స్ చేశాడు. మరి మస్క్ ఈ డబ్బునంతా ఏం చేస్తాడు? అనేది మరో ప్రశ్న. ఇప్పటికే మస్క్ చాలా ఏళ్లుగా ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్‌లో ఉంటూ వస్తున్నాడు. కానీ తనకు సింపుల్ లైఫ్ ఇష్టమని చెబుతుంటాడు. మ్యాన్షన్‌లు, ఫ్యాన్సీ ఫుడ్ తనకు అవసరం లేదంటూ ఇంటర్వ్యూలలో చెబుతుంటాడు. అంతేకాదు తనకున్నవాటిలో ఏడు ఇళ్లను కూడా అమ్మేశాడు మస్క్. ప్రస్తుతం మస్క్ ఓ చిన్న ఇంటిలో ఉంటున్నాడు. తాను ఎర్త్, మార్స్ ప్రాజెక్ట్‌లపైనే ఫోకస్ చేశానని గతంలోనే చెప్పాడు.
Also Read: 3 రోజుల క్రితం జలుబు, ఆయాసం.. ఈలోపే అమెరికాలో తెలుగమ్మాయి మృతి..
మస్క్‌కు టెక్సాస్‌లో ఓ పెద్ద ప్రాపర్టీ ఉంది. 295 కోట్లతో దానిని కొనుగోలు చేశాడు. దీనిని తన ముగ్గురు మాజీ భార్యలు, 11 మంది పిల్లల కోసం కొనుగోలు చేశాడు. కానీ లగ్జరీ కార్లపై మాత్రం ఎక్కువగా ఖర్చు చేస్తున్నాడు మస్క్. కానీ చాలా సేవలు మాత్రం చేస్తున్నాడు. అయితే దీనిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ట్యాక్స్‌లు తప్పించుకోవడానికే ఇవన్నీ చేస్తున్నాడనేది కొందరి వాదన. విషయం ఏదైనా ఇప్పటికే ప్రపంచ కుబేరుడైన మస్క్.. మరో ట్రిలియన్ డాలర్లను తన అకౌంట్‌లో వేసుకుంటాడా? లేదా? అనేది త్వరలోనే తేలనుంది.
Story By Vamshi Krishna, Bigtv