MahaKumbh Mela Mamata Banerjee: మహాకుంభమేళా తొక్కిసలటాలో భక్తులు చనిపోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల తీవ్రంగా స్పందించారు. అది మహా కుంభ మేళా కాదు ‘మృత్య్ కుంభ్’ అని.. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మేళా నిర్వహణ సరిగా చేయకవోవడం వల్లే ఇదంతా జరిగిందని ఆమె ఆరోపణలు చేశారు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ మమతా బెనర్జీపై అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో మమతా బెనర్జీ ఈ మాటల యుద్ధంపై స్పష్టత ఇచ్చారు.
తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని ఆమె విమర్శించారు. “నేను ప్రతి మతాన్ని గౌరవిస్తాను. కానీ, నా వ్యాఖ్యలను వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది” అని మమతా స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేసినందుకు కౌంటర్ ఇచ్చారు.
Also Read: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య భాషా గొడవ.. బస్సు సిబ్బందిపై ఇరువైపులా దాడులు
“యోగి నాపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలతో నాకు బొప్పి ఏమీ కట్టదు. ఒక సీఎంగా యోగికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాను. నేను చెప్పింది ఒక్కటే: మహా కుంభమేళా ఏర్పాట్లు సరిగా లేని కారణంగా కొన్ని కుటుంబాలు బాధపడ్డాయి. మీరు వారికి మరణ ధృవపత్రాలు, పోస్ట్ మార్టమ్ సర్టిఫికెట్లు లాంటి ఇవ్వాలి. అవి యుపి ప్రభుత్వం ఇవ్వకపోయినా.. మేము వారికి పోస్ట్ మార్టమ్ నిర్వహించాం. మిగతా రాష్ట్రాల్లో ఏమి జరిగిందో నాకు తెలియదు. మీరు వారికి పరిహారం ప్రకటించి ఉంటే, పరిహారం ఇవ్వండి” అని మమతా ఘాటుగా స్పందించారు.
ప్రజలు భారీ సంఖ్యలో హాజరైనప్పుడు వారికి తగిన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి మమతా నొక్కి చెప్పారు. “ఎంతమంది వస్తున్నారో, ఏర్పాట్లు ఎలా ఉండాలో ముందుగానే పర్యవేక్షించాలి. మహా కుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందనే హైప్ అక్కర్లేదు. ఏర్పాట్లు సరిగా లేకపోతే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతాయి. అందుకే అవసరమైన ఏర్పాట్లు చేయాలి, అవసరం లేనివి అక్కర్లేదు. ఉదాహరణకు నేనే ఒక పెళ్లి నిర్వహణ బాధ్యతలు తీసుకుంటే ముందుగా ఎంతమంది అతిథులు వస్తున్నారు. వారి కోసం ఏర్పాట్లు ఎలా చేయాలి? అని ప్లాన్ చేసుకుంటా. అలాగే మతపరమైన సామూహిక కార్యక్రమాకు కూడా ఇలా ముందస్తుగానే ప్లాన్ చేసుకొని ఏర్పట్లు కట్టు దిట్టం చేయాలి.
ఇంకా ఈసారి జరిగిన కుంభమేళానే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా అని కచ్చితంగా ఎలా చెబుతారు. ఈ లెక్కలు సరిగా లేవని అనుమానంగా ఉంది. 12 ఏళ్ల కోసారి వచ్చే కుంభమేళా 2014లో జరిగింది కదా.. మరి ఈ సంవత్సరం మహా కుంభమేళా ఎలా అవుతుంది. నాకు దీనిపై స్పష్టత లేదు. ” అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
తన రాష్ట్రంలో దుర్గా పూజ ఘనంగా నిర్వహిస్తామని, ఆ సమయంలో ప్రతి నిమిషం దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తామని మమతా తెలిపారు.