BRS Government: ఉప్పు నుంచి పప్పు దాకా తినే ప్రతీ వస్తువుకు.. కాలికి వేసుకునే చెప్పు నుంచి తలకు పెట్టుకునే నూనె దాకా ప్రతీ ప్రొడక్టుకూ పన్ను కట్టేది మనం. కొనే ప్రతీ ప్రొడక్ట్‌పైనా GST, పెట్రోల్, ఆల్కహాల్‌పై వ్యాట్ వాత తప్పడం లేదు. ఇన్ని ట్యాక్సులు కట్టాక మనకు మిగిలేది కూడా ఏమీ ఉండదు.. అయినా సరే మన ఆదాయం ఓ లిమిట్ దాటితే.. ఖర్చులతో సంబంధం లేకుండా ఆదాయపన్ను కట్టాల్సిందేనంటోంది కేంద్ర ప్రభుత్వం. ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. ఇది చాలదన్నట్లు.. మనకు తెలియకుండానే మనమంతా ఇంతకాలం కట్టిన పన్ను ఇంకోటి ఉంది. ఆ ట్యాక్స్ ఏంటి.. గత పదేళ్లలో మనం ఎందుకు ఆ ట్యాక్స్ కట్టాం.. దీన్నే మీముందుకు తెచ్చింది బిగ్‌టీవీ ది నేకెడ్ ట్రూత్.. ఈ మ్యాటర్‌లోని పూర్తిగా వెళ్లేముందు.. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ మధ్య చేసిన ఓ కామెంట్‌ను ఓ సారి విందాం..
ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించి, ప్రజలకు ఉపయోగపడకుండా తమకు నచ్చిన రేసును నిర్వహించడానికి డబ్బు ఎందుకు కట్టారో తేల్చడానికి జరుగుతున్న విచారణపై కేటీఆర్ చేసిన కామెంట్ ఇది. ఓ విచారణకు నిజంగా అంత ఖర్చవుతుందా అంటే కానే కాదు.. అయినా, ఆ ఖర్చంతా వృథా అని.. అదేదో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయొచ్చు కదా అన్నది కేటీఆర్ పాయింట్. కరెక్టే.. ప్రజలకు ఉపయోగపడే పనులే చేయాలి.. మరి ప్రైవేటు స్పాన్సర్ కట్టాల్సిన వాటాను… ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఎందుకు చెల్లించినట్లు.. ఎవడబ్బ సొమ్మని తేరగా పంపించేసినట్లు..? దాన్ని తేల్చడానికే కదా.. ఈ ఎంక్వైరీ.. అదే తప్పంటే ఎలా..? నిజంగా ప్రజాధనానికి కేటీఆర్ అంత విలువ ఇస్తారా..? పదేళ్లలో ఇలానే ప్రతీ రూపాయిని జాగ్రత్తగా ప్రజల కోసమే ఖర్చుపెట్టారా..? ఈ ప్రశ్నలకు సమాధానమే ఇవాళ్టి ది నేక్డ్ ట్రూత్..
మాటలు చెప్పడంలో కేటీఆర్ తర్వాతే ఎవరైనా.. చేతల సంగతి మాత్రం దేవుడెరుగు. గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని లెక్కలు చూస్తే.. ప్రజాధనాన్ని ఎంత బాగా సొంతానికి వాడుకున్నారో అర్థమైపోతుంది. అది తెలుసుకోవాలంటే.. ఒక్కసారి ఈ లెక్కలు చూడండి..
⦿ మాజీ సీఎం కేసీఆర్ 2014-15లో చెల్లించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రూ.15,39,111
⦿ 2015-16లో అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కట్టిన ఆదాయపు పన్ను రూ.13, 92,173.
⦿ 2015-16లో అప్పటి వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెల్లించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రూ.8,23,389.
⦿ 2015-16లో ప్లానింగ్ కమిషన్ వైఎస్ చైర్మన్‌గా పనిచేసిన ఎస్.నిరంజన్‌రెడ్డి చెల్లించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రూ.7,96,935.
⦿ 2016-17లో అప్పటి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెల్లించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రూ.7,22, 030
⦿ 2016-17లో అప్పటి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చెల్లించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రూ.16,18,788.
⦿ 2016-17లో అప్పటి ఎక్సైజ్ మినిస్టర్ పద్మారావు గౌడ్ చెల్లించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రూ.15,98, 914
⦿ 2019-20లో అప్పటి ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్‌గౌడ్ చెల్లించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రూ.3,35,663
⦿ 2021-22లో అప్పటి కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి చెల్లించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రూ.8,85,193.
⦿ 2021-22లో అప్పటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్‌రావు చెల్లించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రూ.5,85,024
ఇవి ఒక్కో ఏడాదికి అప్పటి సీఎం, మంత్రులు కట్టిన ఆదాయపన్ను వివరాలు. దీన్ని బట్టి పదేళ్లలో ఎంత ట్యాక్స్ కట్టారో మీరే లెక్కేసుకోండి. ట్యాక్సులు బాగానే కట్టారని సంతోషపడకుండి. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ పన్నులన్నీ కట్టింది వాళ్ల సొంత డబ్బులతో కాదు.. జనం డబ్బుతో. అంటే మీ డబ్బుతో.. మనందరి డబ్బుతో. ప్రజలపై పన్నులు వేసి వసూలు చేసి ప్రజల అవసరాలు తీర్చడానికి వాడాల్సిన డబ్బును ఇలా బీఆర్‌ఎస్ హయాంలో ముఖ్యమంత్రి, మంత్రులు తమ ఆదాయపన్ను కట్టుకోవడానికి వాడేసుకున్నారు. పైగా ఈ వివరాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయంతో జీవోల్లో మెజార్టీ వాటిని దాచి పెట్టారు. ఒకటీ అరా మాత్రమే వెబ్‌సైట్‌లో పెట్టారు. ఈ వ్యవహారాన్ని జనం ముందుకు తేవడం కోసం.. బిగ్‌టీవీ టీమ్ ఎంతో శ్రమపడి మంత్రుల ఆదాయపన్ను చెల్లించడానికి జారీ చేసిన జీవోల్లో చాలా వరకూ సేకరించింది.
వాస్తవానికి ఎవరి సంపాదనకు వాళ్లే పన్ను కట్టుకోవాలి. కానీ, సీఎం, మంత్రుల ఆదాయానికి మాత్రం జనమే ఆదాయపన్ను కట్టాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తమకు తాముగా డబ్బులు మిగుల్చుకోవడానికి అప్పటి పాలకులు తెచ్చిన ఓ జీవోను.. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో విచ్చలవిడిగా వాడేశారు. ముఖ్యమంత్రి, మంత్రులకు అప్పట్లో జీతాలు గౌరవ వేతనం పేరుతో చాలా తక్కువగా ఉండేవి కాబట్టి, ఆదాయపన్నును ప్రభుత్వమే భరించాలన్న నిబంధన తెచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను భారీగా పెంచారు. కానీ, ఆదాయపన్ను ప్రభుత్వమే కట్టాలన్న రూల్‌ను మాత్రం మార్చలేదు. దీంతో సొమ్ము మంత్రులది.. పన్ను జనానిది అన్నట్లుగా సీన్ మారిపోయింది. సర్లే పాపం సీఎం, మంత్రులు ఎప్పుడూ పాలనలో ప్రజా సేవలే మునిగి తేలుతుంటారు.. వాళ్లకు ప్రభుత్వం చెల్లించే జీతభత్యాలకు ఆదాయపన్ను కడితే తప్పేముందిలే అని జాలి పడేవాళ్లు మన మధ్య ఉండొచ్చు. వాళ్ల కళ్లు తెరిపించే నిజాలను కూడా బిగ్‌టీవీ మీ ముందుకు తెచ్చింది.
తెలంగాణలో సీఎం శాలరీ ఎంతో ముందుగా చూద్దాం
ఇది తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం జారీ చేసిన రాజపత్రం. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను సవరించాక జారీ చేసిన గెజిట్ ఇది. దీని ప్రకారం ముఖ్యమంత్రికి బేసిక్ శాలరీ గా రూ.51 వేలు, ప్రత్యేక అలవెన్స్‌గా రూ.8 వేలు, అతిథులకు అయ్యే ఖర్చుల కోసం రూ.7 వేలు, సెక్యూరిటీ కార్ అలవెన్స్ గా రూ.25 వేలు, బుల్లెట్ ప్రూఫ్ కారు సెక్యూరిటీ అలవెన్స్‌గా రూ.30వేలు ఇస్తారు.. ఇవి కాక నియోజకవర్గ అలవెన్స్‌గా 2 లక్షల 30 వేల రూపాయలను అదనంగా ఇస్తారు. అంటే మొత్తం సీఎంగా పనిచేస్తున్నందుకు ప్రభుత్వం చెల్లించే జీతం 3 లక్షల 51 వేలు అన్నమాట. ఇందులో పన్ను పరిధిలోకి వచ్చేది కేవలం 59 వేలు మాత్రమే.
దీన్ని బట్టి ఏడాదికి లెక్కగడితే సీఎం ట్యాక్సబుల్ ఇన్‌కమ్ 7 లక్షల 8వేలు.. సేవింగ్స్ అవీ తీసేస్తే కట్యాల్సిన ట్యాక్స్ ఐదు వేలు కూడా ఉండకపోవచ్చు. పోనీ ఎప్పటి నుంచో ఉన్న వ్యాపారాలతో వస్తున్న ఆదాయంతో 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లోకి వెళ్లారనుకున్నా.. ప్రభుత్వం కట్టాల్సింది ఈ ఐదు వేల రూపాయల ట్యాక్సే.. కానీ 2014-15లో అప్పటి సీఎం కేసీఆర్ కోసం ప్రభుత్వం కట్టిన ఆదాయ పన్ను ఏకంగా 15 లక్షల39 వేల 111 రూపాయలు. వాస్తవానికి తెలంగాణ ఏర్పడే నాటికి సీఎంకు ఇచ్చే బేసిక్ శాలరీ కేవలం 16వేలు మాత్రమే. 2017లో దాన్ని కేసీఆర్ 51వేలకు పెంచారు.
ఈ లెక్కన 2014-15లో ప్రభుత్వం నుంచి అందిన జీతభత్యాల్లో కేసీఆర్‌కు పన్ను కట్టాల్సింది 2 లక్షల 88 వేల రూపాయలకే.. అసలది పన్ను పరిధిలోకి వచ్చే మొత్తమే కాదు. అంటే ప్రభుత్వ ఖజానా నుంచి పైసా కూడా కట్టక్కర్లేదు. మరి 15 లక్షల39 వేల 111 రూపాయలు ఎందుకు కట్టినట్లు..? ఏ రూపంలో వచ్చిన ఆదాయానికి పన్ను చెల్లించారు..? ఎవడబ్బ సొమ్మని తీసుకున్నట్లు..? ఈ లెక్కన పదేళ్లలో తీసుకున్న మొత్తం ఎంత..? బంగారు పాలన అంటే జనం సొమ్ముతో జల్సాలు చేయడమేనా..? సీఎంగా ఉండి ప్రైవేటు వ్యాపారాలు చేస్తూ సంపాదించిన దానికి జనం సొమ్ము ఎందుకు కట్టాలి..?
సీఎం, మంత్రులకు అందే జీతభత్యాల్లో దేనికి ట్యాక్స్ పడుతుంది అన్న దానిపై గతంలో చాలా కేసులు నడిచాయి. అందులో ఒకటి 2005-06లో ఎమ్మెల్యే ఎం.రంగారెడ్డికి.. ఇన్‌కంట్యాక్స్ అధికారులకు మధ్య జరిగిన వివాదం. ఎమ్మెల్యేగా ప్రభుత్వం అందించే అలవెన్సులకు ట్యాక్స్ కట్టాల్సిందేనంటూ ఐటీ అధికారులు.. కట్టాల్సిన అవసరం లేదంటూ ఎమ్మెల్యే రంగారెడ్డి.. ఇన్‌కం ట్యాక్స్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. అక్కడ వాదోపవాదల తర్వాత ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది. దీనిలో చెప్పిన దాని ప్రకారం.. ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి తన బాధ్యతలు నిర్వహించడానికి ఇచ్చే అలవెన్సులకు ఎలాంటి ట్యాక్స్ విధించాల్సిన అవసరం లేదంటూ ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది.. దీని ప్రకారం సీఎం, మంత్రులకు కేవలం జీతంగా అందుకునే మొత్తానికి మాత్రమే ఆదాయపన్ను కట్టాల్సి ఉంటుందన్నది క్లియర్.. సీఎంగా కేసీఆర్ అందుకున్న శాలరీ.. కట్టిన పన్నును ఇప్పటికే చూశాం కదా.. ఇప్పుడు మంత్రుల శాలరీల సంగతి తేల్చేద్దాం.
2017లో చేసిన సవరణల ప్రకారం.. ప్రతీ మంత్రికి బేసిక్ శాలరీగా 30,000 ప్రత్యేక అలవెన్స్‌గా రూ.8 వేలు, అతిథులకు అయ్యే ఖర్చుల కోసం రూ.7,000, సెక్యూరిటీ కార్ అలవెన్స్ గా రూ.25 వేలు, బుల్లెట్ ప్రూఫ్ కారు సెక్యూరిటీ అలవెన్స్‌గా రూ.30వేలు ఇస్తారు. ఇవి కాక నియోజకవర్గ అలవెన్స్‌గా రూ.2 లక్షల 30,000 లను కూడా అదనంగా ఇస్తారు. అంటే నెలకు ఓ మంత్రికి అందే జీతం 3 లక్షల 30,000. ఇందులో ట్యాక్స్ పరిధిలోకి వచ్చే మొత్తం 38వేలు మాత్రమే. అంటే మంత్రిగా ఏడాదికి అందుకునే టాక్సబుల్ ఇన్‌కమ్.. 4 లక్షల 56 వేలు మాత్రమే.. కానీ బడ్జెట్‌లో ఇచ్చే మినహాయింపుల ప్రకారం ఈ మొత్తానికి అసలు పన్నే పడకూడదు.
కానీ.. 2015-16లో హరీష్‌రావుకు కట్టిన ఆదాయపన్ను 6 లక్షల 64వేల 70 రూపాయలు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌కు కట్టిన ఆదాయపు పన్ను రూ.13, 92,173.. ప్రభుత్వ సొమ్మును ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలంటూ ఉచిత సలహాలిస్తున్నకేటీఆర్ 2016-17లో తన సంపాదనకు ప్రభుత్వ ఖజానా తీసుకుని కట్టిన ఆదాయపన్ను అక్షరాలా 7 లక్షల 22 వేల 30 రూపాయలు. డిప్యూటీ సీఎంగా పనిచేసిన మహమూద్ అలీకి 16 లక్షల 18 వేల 788 రూపాయలు, ఎక్సైజ్ మినిస్టర్‌గా పనిచేసిన టి.పద్మారావుగౌడ్‌కు 15 లక్షల 98 వేల 914 రూపాయలను ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించారు. 2019-20లో అప్పటి ఎక్సైజ్ మినిస్టర్‌కు 3లక్షల 35వేల 663 రూపాయలు, 2021-22లో కార్మికమంత్రి సిహెచ్. మల్లారెడ్డికి 8 లక్షల 85వేల 193 రూపాయలు చెల్లించారు.. ఇలా పదేళ్ల పాటు మంత్రులకు ఆదాయపన్ను చెల్లింపులన్నీ ప్రభుత్వ ఖజానా నుంచే సాగాయి. పెట్రోల్ మీద రూపాయి పన్ను తగ్గించడానికి కుదరదంటే కుదరని చెప్పేసిన కేసీఆర్ పాలనలో.. తనతో పాటు మంత్రుల ఆదాయపన్నులను మాత్రం ఇలా జనం ముక్కుపిండి వసూలు చేసిన పన్నుల డబ్బుతో కట్టేసుకున్నారు.
ముఖ్యమంత్రి , మంత్రులకు ఆదాయపన్నును ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించుకోవచ్చంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయని కదా అని తెలివిగా వాదించొచ్చు. కానీ.. ప్రభుత్వం నుంచి అందుకునే జీతభత్యాలకు మాత్రమే ప్రభుత్వ ఖజానా నుంచి పన్ను చెల్లింపులు జరగాలి.. అలాంటప్పుడు ఒకేరకమైన జీతం ప్రభుత్వం నుంచి అందుకునే మంత్రులదరికీ ఒకే మొత్తంలో పన్ను పడాలి. కానీ, ఒక్కో మంత్రికి ఒక్కోలా ఎందుకు కట్టారు.. ఏటేటా ఆ మంత్రులకు కూడా చెల్లించిన పన్ను మొత్తం ఎందుకు మారిపోయింది. కేసీఆర్ పాలన మొదలుపెట్టిన ఏడాది లెక్కలు ఓ సారి చూస్తే మనకు మ్యాటర్ అర్థమైపోయింది.
⦿ 2014-15లో ప్రభుత్వం చెల్లించిన ఆదాయపన్ను
⦿ కె.చంద్రశేఖర్‌రావు మాజీ ముఖ్యమంత్రి రూ.15,39,111
⦿ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి రూ.4,04,409
⦿ టి. హరీష్‌రావు నీటిపారుదలశాఖ మంత్రి రూ.4,90,860
⦿ కె.తారకరామారావు ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి రూ.7,01,593
⦿ మహమూద్ అలీ రెవెన్యూశాఖ మంత్రి రూ.6,42,170
⦿ టి. పద్మారావుగౌడ్ ఎక్సైజ్ మంత్రి రూ.7,81,510
⦿ తలసాని శ్రీనివాస్ యాదవ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి రూ. 39,360
⦿అజ్మీరా చందూలాల్ గిరిజన శాఖ మంత్రి రూ.1,44,908
అప్పటి సీఎం కేసీఆర్‌తో కలిసి మంత్రులకు ఒక్క ఏడాదిలో కట్టిన మొత్తం ఇది. అప్పటి నుంచి ప్రతీ ఏటా మంత్రులందరికీ ఆదాయపన్నును ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించారు. ఇప్పుడు ప్రజల సొమ్మును జాగ్రత్తగా వాడాలంటున్న కేటీఆర్ విషయానికి వస్తే.. 2017-18లో ఆయన సంపాదనకు జనం కట్టిన సొమ్ము లక్షా 65 వేల 68 రూపాయలు. 2020-21లో కట్టింది లక్షా 66 వేల 670 రూపాయలు. 2021-22లో కట్టింది కూడా లక్షా 66 వేల 670 రూపాయలే. వీటిని కూడా ఒక్కో ఏడాది ఒక్కో డిపార్ట్‌మెంట్ నుంచి చెల్లించారు. చాలా సంవత్సరాల జీవోలను రహస్యంగా ఉంచారు.. ప్రభుత్వ సొమ్మును ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు పెట్టడం అంటే ఇదేనా కేటీఆర్ గారూ.. మీ సొంత ఆదాయానికి పన్నులు కట్టడమేనా.. ?
అసలు మంత్రులదరికీ ఒకే శాలరీ ఉన్నప్పుడు అందరికీ ఒకే పన్ను కట్టాలి కదా.. మరి ఇలా వేర్వేరు పన్నులు ఎందుకు కట్టారు..? దీనికి ఆన్సర్.. వాళ్లకు ప్రభుత్వం నుంచి అందే జీతభత్యాలతో పాటు ఇతరత్రా ఆదాయాలు ఉన్నాయి. అందుకు ఎగ్జాంపుల్.. ప్రభుత్వం జారీ చేసిన జీవోలే. 2014-15లో పద్మారావుగౌడ్ చూపించిన ఆదాయం రూ. 31,12, 497 . అదే ఏడాది తలసాని శ్రీనివాస్ యాదవ్ చూపించిన ఆదాయం 5 లక్షల 66 వేల 59 రూపాయలు మాత్రమే. మంత్రులందరికీ ఒకే జీతం అందుతున్నప్పుడు.. ఆదాయంలో ఇంత తేడా ఉంటుందా..? ఇంత భారీ ఆదాయం ఉన్న వాళ్లు సొంతగా ట్యాక్స్ కట్టుకోలేరా..? దానికి జనం సొమ్మే కావాలా..? దీన్నే ప్రశ్నిస్తోంది బిగ్‌టీవీ.
ప్రభుత్వం ఇచ్చే అన్ని సౌకర్యాలను అనుభవిస్తూ.. ప్రైవేటు వ్యాపారాలు చేస్తూ సంపాదించుకున్నదానికి మేం ఎందుకు పన్నులు కట్టాలి..? . ఇలా ముఖ్యమంత్రికి, మంత్రులకు ఆదాయపన్నులు కడుతూ జారీ చేసిన జీవోలను ఎందుకు దాచి పెట్టారు.. అన్నింటినీ పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టలేదు.. మీరు చేసింది తప్పు కానప్పుడు అంతగా దాచుకోవాల్సిన అవసరం ఏంటి..? ప్రభుత్వ ఖజానాలో ప్రతీ రూపాయికి ఎంతో వాల్యూ ఉంది. ప్రతీ పైసా కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి గానీ, ఇలా వ్యక్తిగత పన్నులు కట్టుకోవడానికి వీల్లేదు. గతంలో ఎప్పుడో ఇచ్చిన ఓ ఆర్డర్‌ను అడ్డం పెట్టుకుని ఇలా అడ్డగోలుగా జనం సొమ్మును వాడుకోవడాన్ని ఎవరూ ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇప్పటి ప్రభుత్వమైనా.. ఆ ఆర్డర్‌ను పక్కన పెట్టాలి. సామాన్యులంతా పన్నులను ఎలా కట్టుకుంటున్నారో.. మంత్రులు కూడా ఎవరి పన్నును వాళ్లే కట్టుకోవాలి.
కేటీఆర్‌కు బిగ్‌టీవీ స్ట్రెయిన్ క్వశ్చన్.. ప్రజాధనం ఖర్చు పెట్టాల్సింది ఇలానేనా..? ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు పెట్టడం అంటే సొంత ఆదాయానికి జనం సొమ్ముతో పన్నులు కట్టుకోవడమేనా..? ప్రజాధనం వృథా అయిపోతుందని అంత బాధపడుతున్న కేటీఆర్.. తన ఆదాయానికి సర్కార్ ఖజానా నుంచి పన్నులు ఎందుకు చెల్లించినట్లు.. తన కేబినెట్ మంత్రులంతా జనం సొమ్ముతోనే ట్యాక్స్‌లు చెల్లిస్తుంటే ఎందుకు ఆపనట్లు..? ఎవడబ్బ సొమ్మని జనం నుంచి వసూలు చేసిన డబ్బులతో మీ ఆదాయపన్ను కట్టించుకున్నారు..? ఆన్సర్ ఉందా.. కేటీఆర్.