AI Chatbot Hospital Bill Error| అమెరికాలో చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మరణించాడు. మృతుడి సోదరుడు ఆ దు:ఖంలో ఉండగా.. హాస్పిటల్ యజమాన్యం అతని తలపై ఒక పిడుగు లాంటి బిల్ వేసింది. ఆ బిల్ మొత్తం చూసి అతను షాక్ అయ్యాడు. బిల్లు మొత్తం 1.95 మిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1.64 కోట్లు). గుండె పోటు కారణంగా అతని సోదరుడిని తీసుకొని ఆస్పత్రికి రాగా అక్కడ ఐసీయూలో కేవలం 4 గంటలు చికిత్స ఇచ్చారు. కానీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ అతని సోదరుడు చనిపోయాడు. అతడి ఆరోగ్య బీమా కూడా రెండు నెలల క్రితం ముగియడంతో ఆస్పత్రి బిల్లు చెల్లించాల్సిన పరిస్థితి. అందుకే ఆ బిల్లులో అంత మొత్తం ఎలా వచ్చిందని ఆరా తీశాడు.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ థ్రెడ్స్‌లో ‘nthmonkey’ అనే యూజర్‌గా ఆస్పత్రి బిల్లు గురించి పోస్ట్ చేశాడు. ఆ బిల్లుని బాగా పరిశీలించాలని ఏఐ సాయం తీసుకున్నాడు. అందుకోసం అన్థ్రాపిక్ కంపెనీ తయారు చేసిన క్లాడ్ ఏఐ చాట్‌బాట్‌ను సంప్రదించాడు. బిల్‌ను అప్‌లోడ్ చేసి, ప్రతి ఐటమ్‌ను విశ్లేషించమని చెప్పాడు. ఏఐ వెంటనే పని మొదలుపెట్టింది – ప్రతి ఛార్జ్‌ను ఒక్కొక్కటిగా చూసి, సమస్యలు కనిపెట్టింది.
ఏఐ చేసిన విశ్లేషణలో పెద్ద మోసాలు బయటపడ్డాయి. ఉదాహరణకు, సర్జరీకి గ్లోబల్ ఫీ చార్జ్ చేశారు. కానీ అందులోని ప్రతి చిన్న ఐటమ్‌కి మళ్లీ విడిగా బిల్ చేశారు. ఇది సుమారు 1 లక్ష డాలర్లు (రూ.84 లక్షలు) అనవసర ఛార్జ్! మెడికేర్ నియమాల ప్రకారం ఇలా చేయకూడదు. ఇంకా చాలా కన్ఫ్యూజింగ్ ఛార్జ్‌లు ఉన్నాయి. వెంటిలేటర్ సర్వీస్‌లు, ఇన్‌పేషెంట్ vs ఎమర్జెన్సీ కోడ్‌లలో తప్పులు. హాస్పిటల్ తమదైన నియమాలు, ధరలు వేసి, బిల్లింగ్ చేసిందని ఏఐ తెలిపింది.
ఏఐ సహాయంతో ఆ వ్యక్తి హాస్పిటల్‌కు ఒక లెటర్ రాశాడు. బిల్లింగ్ ఎర్రర్లను వివరంగా చెప్పాడు. “ఎక్స్‌ట్రీమ్ ఓవర్‌బిల్లింగ్” కోసం లిటిగేషన్ (కోర్టు కేసు) చేస్తామని హెచ్చరించాడు. రెగ్యులేటర్లు, మీడియా, లెజిస్లేటర్లకు ఫిర్యాదు చేస్తామని కూడా రాశాడు. అతడి లెటర్ చదివిన ఆస్పత్రి యజమాన్యం.. తమ బిల్లింగ్ డిపార్ట్‌మెంట్ తప్పులు చేసిందని అంగీకరించింది. “కంప్యూటర్ అప్‌గ్రేడ్‌ల వల్ల బిల్లింగ్ లో తప్పు జరిగింది” అని మొదట చెప్పారు, కానీ వాస్తవం అనూహ్యంగా బయటపడింది.
హాస్పిటల్ యజమాన్యం ఆ తరువాత రివైజ్డ్ బిల్ ఇచ్చింది – అందులో టోటల్ చూస్తే.. కేవలం 33,000 డాలర్లు (సుమారు రూ.29 లక్షలు)! అంటే బాధిత కుటుంబం 1.62 మిలియన్ డాలర్లు (రూ.1.35 కోట్లు) ఆదా చేసింది. ఇంకా హాస్పిటల్ చారిటీ ఎయిడ్ (సహాయం) అప్లై చేయమని కూడా సూచించింది. ఆ కుటుంబానికి ఇంత పెద్ద మొత్తం సేవ్ కావడానికి ఏఐ టెక్నాలజీనే కారణం.
కేవలం ఆ యూజర్ 20 డాలర్లు (రూ.1,700) ప్రతినెలా క్లాడ్ సబ్‌స్క్రిప్షన్ చెల్లిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఫీజు “బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్” అని చెప్పాడు. తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి, ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారికి ఏఐ ఉపయోగపడుతుందని చెప్పాడు.
బాధితుడి సోదరుడి అభిప్రాయం ప్రకారం.. చాలా ఆస్పత్రులు మెడికల్ బిల్లింగ్ గురించి తెలియని వారిని టార్గెట్ చేస్తాయి. కాంప్లెక్స్ బిల్లులు చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తాయి. చాలామంది ప్రశ్నించకుండా చెల్లిస్తారు. ఇది అసలు మోసం – “అమాయకుల నుంచి డబ్బు దోచుకోవడం” అని nthmonkey అభిప్రాయపడ్డాడు. మెడికేర్ నియమాల రేట్ల కంటే ఎక్కువ చెల్లించకూడదని హెచ్చరించాడు.
సోషల్ మీడియాలో అందరూ ఏఐ టెక్నాలజీని ప్రశంసించారు. చాలామంది తమ మెడికల్ బిల్లింగ్ స్టోరీలు కూడా షేర్ చేశారు. ఏఐ టూల్స్ లాంటివి మెడికల్ బిల్లులను వెరిఫై చేయడానికి ఎంతో ఉపయోగపడతున్నాయని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ.
Also Read: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి