BigTV English
Advertisement

YS Jagan New Plan: సినిమా చూపిస్తా.. జగన్ కొత్త ప్లాన్!

YS Jagan New Plan: సినిమా చూపిస్తా.. జగన్ కొత్త ప్లాన్!

YS Jagan New Plan: ఓటమి తర్వాత పార్టీ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. లిక్కర్ కేసులో ఇప్పటికే కీలక వ్యక్తులను అరెస్ట్ చేసారు. దీని పైన స్పందించిన జగన్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. కేసులు, జైళ్లకు భయపడితే రాజకీయాలు చేయలేమన్నారు. తాజాగా స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన తన స్టైల్లోకూటమి ప్రభుత్వానికి, అధికారులు, పోలీసులకు వార్నింగులు ఇచ్చి పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. అసలు జగన్ అరెస్టుల, కేసుల గురించి మాట్లాడుతుండటంపై జరుగుతున్న చర్చేంటి?


కూటమి నేతలు, పోలీసులు, అధికారులకు జగన్ వార్నింగ్

ఏపీలో జరుగుతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు, నాటి అధికారుల అరెస్టులపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పందించారు. తాజాగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు, పోలీసులు-అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. అన్యాయం చేయాలనుకుంటే, దాడి చేయాలనుకుంటే చేసుకోమనండి కానీ పేర్లు మాత్రం రాసుకోండని వైఎస్ జగన్ సూచించారు. అన్యాయం చేసినవారికి కచ్చితంగా సినిమా చూపిస్తామన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, కలియుగంలో చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలానే ఉన్నాయని విమర్శించారు. రాజకీయాల్లో కేసులు, జైళ్లకు భయపడకూడదంటున్నారు. చంద్రబాబు నేడు నాడుతున్న విత్తనాలు.. రేపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కరికీ సినిమా చూపించేందుకు కారణమవుతాయని జగన్ హెచ్చరిస్తున్నారు.


ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఫుట్‌బాల్‌లా ఎగిరి తంతారని వ్యాఖ్య

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. సంఖ్యా బలం లేకపోయినా నర్సరావుపేట, కారంపూడిలో గెలుచుకున్నామని ప్రకటించుకున్నారని గుర్తు చేసారు. రాప్తాడులో రామగిరి ఉప ఎన్నికలో అక్రమాలకు అంతే లేదని వ్యాఖ్యానించారు. పది శాతం మంది ప్రజలు చంద్రబాబు ఏదో చేస్తారని నమ్మారని.. ఎప్పుడు ఎన్ని కలు వచ్చినా ఫుట్ బాల్ లా ఎగిరి తంతారన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని అప్పుడు మనమేంటో చూపిద్దామని క్యాడర్‌కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

నందిగం సురేశ్, వల్లభనేని అరెస్టుల గురించి ప్రస్తావన

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తప్పుడు కేసులు.. వాంగ్మూలాలతో వేధిస్తున్నారని జగన్ పేర్కొ న్నారు. వైసీపీలో చురుగ్గా ఉన్న కార్యకర్తలను, నాయకులను టార్గెట్ చేసి వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ కార్యకర్త కష్టాన్ని చూస్తున్నానని.. వారికి మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అయిదేళ్లు పాలన లో కోవిడ్ కారణంగా అనుకున్నంత మేర సరిగ్గా చేయలేకపోయామని వివరించారు. దళితుడైన నందిగం సురేశ్ విషయంలోనూ ఇదే రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసుల మీద కేసులు పెడుతూ నెలల తరబడి జైల్లో మగ్గేలా చేస్తున్నారని ఆరోపించారు.

అభివృద్ధి వైసీపీ హయంలోనే జరగిందని ధీమా

రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి జరిగిందంటే అది వైసీపీ హయాంలోనే అని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చున్నామంటే.. చంద్రబాబు పరిస్థితేంటి? ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ప్రజలు ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తంతారని వ్యాఖ్యానించారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడెక్కడి నిధులు సంక్షేమ పథకాలకే వినియోగించారు. అభివృద్ది మాట అటుంచి రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు గుంతలు పడితే కనీసం పూడ్చే దిక్కులేకుండా పోయింది. ఆ ఫలితం గత ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.

స్కీల్ స్కాం కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసిన గత ప్రభుత్వం

ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరెస్టులు నోటీసులు ఇచ్చి సమగ్ర విచారణ జరిపి, ఆధారాలు సేకరించాకే జరుగుతున్నాయన్న అభిప్రాయం ఉంది. అయితే గత ప్రభుత్వంలో కనీసం నోటీసు ఇవ్వకుండా, కనీసం ఎఫ్ఐఆర్‌లో పేరు కూడా లేకుండా స్కీల్ స్కాం కేసులో చంద్రబాబునాయుడ్ని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచారు. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు చంద్రబాబుకి బెయిల్ ఇచ్చింది. లోకేష్‌పై కూడా దాదాపు 23 కేసులు నమోదయ్యాయి. సీనియర్ నేతలైన అచ్చెన్నాయుడు, అయన్నపాత్రుడులను కూడా కేసులతో వేధించారు. రఘురామకృష్ణంరాజుపై పోలీసుల దాడికి సంబంధించి ఆయన పెట్టిన కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయని కూటమి శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. అలాగే అప్పట్లో తీవ్ర వేధింపులకు గురైన మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి ఏబీవీల ఎపిసోడ్లను ప్రస్తావిస్తున్నాయి.

Also Read: సునీతారావుకి షోకాజ్ నోటీస్.. జరగబోయేది ఇదేనా!

అమరావతి రైతులపై నందిగం సురేశ్ దాడులు

వైసీపీలో చురుగ్గా ఉన్న కార్యకర్తలను, నాయకులను టార్గెట్ చేసి వేధిస్తున్నారని జగన్ మండిపడుతున్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గం ముఖం చూడలేదు. వైసీపీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కూడా ఆయన ఎప్పుడూ పాల్గొనలేదు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యే వరకు వంశీ దాదాపు అండర్‌గ్రౌండ్లో ఉన్నట్లే గడిపేశారు. ఆయన యాక్టివ్ నాయకుడా అని కూటమి శ్రేణులు యద్దేవా చేస్తున్నాయి. అమరావతి రాజధాని ఉద్యమం సందర్భంగా రైతులపై మాజీ ఎంపీ నందిగం సురేష్ చేసిన, చేయించిన దాడుల మాటేంటని దెప్పిపొడుస్తున్నాయి. మొత్తానికి తన పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపడానికి జగన్ చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న వార్నింగులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయిప్పుడు.

Related News

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Big Stories

×