Dubai Company Vanish| దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ బ్రోకరేజ్ కంపెనీ రాత్రికి రాత్రే ఆచూకీ లేకుండా మాయమవడం భారతీయ ఇన్వెస్టర్లకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించింది. గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ అనే సంస్థ దుబాయ్ బిజినెస్ బేలోని క్యాపిటల్ గోల్డెన్ టవర్‌లో సూట్ నంబర్లు 302, 305లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేది. ఈ సంస్థ విదేశీ కరెన్సీ మార్కెట్‌లో పెట్టుబడులకు ఉపాధి కల్పిస్తామని ఆశ చూపించి అనేకమంది ఔత్సాహిక ఇన్వెస్టర్ల నుంచి కోట్ల రూపాయల మొత్తంలో డబ్బు సేకరించింది.
అయితే, ఇటీవల ఒక్కసారిగా ఆ సంస్థ కార్యాలయాన్ని పూర్తిగా ఖాళీ చేసి, ఆఫీసు బయట ఒక బకెట్, మాప్, చెత్త సంచి మాత్రమే మిగిల్చి వెళ్లిపోయింది. సంస్థ సిబ్బంది, నిర్వాహకులు ఎవ్వరూ కనబడకుండా పోవడం, ఫోన్ లైన్లు పని చేయకపోవడం, ఆఫీసు గదులు దుమ్ముతో నిండిపోవడం వంటి విషయాలన్నీ కంపెనీ మోసం చేయడం స్పష్టంగా వెల్లడించాయి. క్యాపిటల్ గోల్డెన్ టవర్ సెక్యూరిటీ గార్డు ఇచ్చిన సమాచారం ప్రకారం.. వారు తాళాలు తిరిగి అప్పగించి హడావుడిగా ఆ కార్యాలయం విడిచిపెట్టారు. ఇప్పటికీ రోజూ చాలామంది అక్కడికి వచ్చి కంపెనీ గురించి విచారణ చేస్తున్నారట.
ఈ మోసానికి బలైనవారిలో అధికంగా భారతీయులే ఉన్నారు. కేరళకు చెందిన మహ్మద్, ఫయాజ్ అనే ఇద్దరు వ్యక్తులు గల్ఫ్ ఫస్ట్ సంస్థ ద్వారా తమ బ్యాంకర్ సహాయంతో దాదాపు $75,000 అంటే సుమారు రూ.64 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయారు. మరో భారతీయ ఇన్వెస్టర్ అయితే ఏకంగా $230,000 అంటే సుమారు రూ.2 కోట్లు నష్టపోయారని వెల్లడించారు. మొదట చిన్న లాభాలు చూపించి, డబ్బును తీయడానికి అవకాశం కల్పించిన కంపెనీ, తర్వాత అదే నమ్మకం మీద అధిక మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేయించి డబ్బుతో పరారైంది.
కంపెనీ సిబ్బంది సంబంధిత ఇన్వెస్టర్లతో మాట్లాడే సమయంలో గల్ఫ్ ఫస్ట్, సిగ్మా-వన్ అనే రెండు పేర్లు వాడుతూ మోసం చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ రెండు పేర్లతో ఉన్న కంపెనీలు ఒకటేనని బాధితులు చెబుతున్నారు. వీరిలో మహమ్మద్ అనే వ్యక్తి సుమారు $50,000 (రూ.42 లక్షలు) నష్టపోయారు.
Also Read: ఇండియా పాక్ యుద్ధం.. కుదేలైన రియల్ ఎస్టేట్
ఇప్పటికే బాధితులు పోలీసులు, సంబంధిత అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయగా, దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA) లేదా సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ అథారిటీ (SCA) నుండి ఈ కంపెనీలకు ఎటువంటి అనుమతులు లేవని ధృవీకరించారు.
ఈ మోసం ఘటన భారతీయ ఇన్వెస్టర్లకు ఒక హెచ్చరికగా నిలవాలి. విదేశాల్లో పెట్టుబడి పెట్టే ముందు సంస్థల బ్యాక్‌గ్రౌండ్, అధికారిక అనుమతులు నిర్థారించుకోవడం అత్యంత అవసరం. లేకపోతే ఇటువంటి మోసాలకు బలి కావడం తధ్యం.