– మెడ్ ప్లస్ మెడికల్ మాఫియా ఆగడాలు
– ఆఫర్ల పేరుతో లాభార్జనే లక్ష్యంగా డ్రగ్స్ దందా
– ప్రిస్క్రిప్షన్ లేకుండానే అలవాటుపడే మెడిసిన్స్ అమ్మకం
– ఫార్మాసిస్ట్ లేకుండానే సైలెంట్‌గా వ్యవహారం
– ఇష్టారాజ్యంగా మెడికేషన్ ఎర్రర్స్
– 50 షాపుల్లో స్వేచ్ఛ-బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్
– చాలా చోట్లా అదే వైనం
– ఏటా మెడికేషన్ ఎర్రర్స్‌తో డేంజర్‌లో 7.70 లక్షల మంది
– మత్తుకు బానిసై చిత్తవుతున్న యువత
– మెడ్ ప్లస్‌లో అనుమతుల్లేకుండా అలవాటుపడే మత్తు గోళీల విక్రయాలు?
– డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఏం చేస్తున్నట్టు?
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: మెడ్ ప్లస్.. ఇదో రిటైల్ ఫార్మసీ చెయిన్. 600 పట్టణాల్లో 4230 స్టోర్స్ కలిగి ఉంది. 25 వేల మంది ఉద్యోగులతో 10 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. బయట బోర్డులు చూడటానికి 20 నుంచి 80 శాతం డిస్కౌంట్ అని కనిపిస్తాయి. ప్రతి మెడిసిన్ దొరుకుందని అందరి నమ్మకం. కానీ, ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తోంది మెడ్ ప్లస్. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతోంది. విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. డ్రగ్స్ పెడ్లర్లపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. కానీ, మెడికల్ మాఫియా సైలెంట్‌గా పదేపదే తీసుకోవడానికి పురికొల్పే మత్తు గోళీలను ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నది.
స్వేచ్ఛ-బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్
దేశంలోనే అత్యధికంగా షాపులు ఉండే మెడ్ ప్లస్ మాటున ఏం జరుగుతుందో స్వేచ్ఛ-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం 50 సార్లు వివిధ స్టోర్స్‌లో స్టింగ్ ఆఫరేషన్ చేసింది. ఎలాంటి రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చిన మెడిసిన్ అమ్మేస్తున్నారు. నోటికి వచ్చింది చెబితే చాలు ఆ మెడిసిన్ చేతిలో పెడుతున్నారు. బిల్ కావాలని అడిగితే ఇట్టే ఇచ్చేస్తున్నారు. అయితే, డాక్టర్ పేరు మనం చెప్పం. అక్కడ ఫార్మాసిస్ట్ ఉంటారా అంటే లేడనే సమాధానం వస్తుంది. నిద్రమాత్రలతో పాటు అనేక షెడ్యూల్ H డ్రగ్స్, H1 డ్రగ్స్, OTCలాగానే అమ్మేస్తున్నారు. ఎలాంటి మెడిసిన్‌కి కాంబినేషన్ ఉండాలి. ఎంత మోతాదు వాడాలో కనీస అవగాహన లేకుండానే అమ్మేస్తున్నారు. ఎన్ని పూటలు వేసుకోవాలో 10వ తరగతి చదివి స్టోర్‌లో పనిచేసే వారే చెబుతున్నారు. స్టోర్స్ అంతటా ఇంటర్ ఫెయిల్ అయిన బాపతే ఎక్కువ. వారందరికీ రూ.11 వేల నుంచి రూ.12,500 వరకు ఇస్తున్నారు. 2 నెలలు మెడికల్ షాపులోనే ట్రైనింగ్ ఇస్తున్నారు. వారి టెన్త్ సర్టిఫికెట్ 2 సంవత్సరాల బాండ్ పెట్టుకుని అగ్రిమెంట్లపై ఉద్యోగంలో చేర్చుకుంటున్నారు. ఇలా ప్రజల జీవితాలకు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇస్తుండటంతో మత్తులో యువకులు చిత్తు అయిపోతున్నారు. ఎలాంటి సిరప్ నైనా ఇట్టే ఇస్తుండడంతో మత్తు దొరకని సమయంలో ఇవే మత్తుగా లాగేస్తున్నారు. వీటిపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దృష్టి పెట్టడం లేదు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకుండా ఉండేలా స్వేచ్ఛ-బిగ్ టీవీ అప్రమత్తం చేస్తోంది. బాధ్యతాయుతంగా వ్యవహరించి మెడికల్ మాఫియాను దారిలో పెట్టే పనికి కంకణం కట్టుకుంది.
నెట్‌వర్క్ పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై ఏది?
ఎన్నో ఆఫర్స్ ఇస్తూ ప్రజలకు మెడ్ ప్లస్ గతేడాది నుంచి అమ్మిన మొత్తం ఔషధాల విలువ రూ.614 కోట్లు. కానీ, వినియోగదారులకు మాత్రం రూ.253 కోట్లకే ఆఫర్లతో ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారు ఎండీ, సీఈఓ మధుకర్ రెడ్డి. ఇన్నాళ్లపాటు లేని లేబొరేటరీని ఇప్పుడు ప్రతి బ్యాచ్ ఔషధాలను పరీక్షించేందుకు ఏర్పాటు చేస్తామని ఇటీవలనే ప్రకటించారు. గత త్రైమాసిక లాభాల్లో 125 శాతం లాభాలు పొందినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే, వీరి ఓమ్ని ఛానల్ నెట్ వర్క్ ఎంత పగడ్బందీగా పనిచేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. మామూలుగా ఎవరైనా కంపెనీ పెట్టుకున్నప్పుడు లాభాలు ఆశిస్తారు. కానీ, ప్రజల ఆరోగ్యంపై రూల్స్ పాటించకుండా మెడ్ ప్లస్ వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.
Also Read: 35 Chinna Katha Kadu: నివేథా థామస్ సినిమా వాయిదా.. వారి వల్లనేనా.. ?
రోడ్డు ప్రమాదాల కంటే.. మెడికేషన్ ఎర్రర్స్‌తోనే ఎక్కువ
దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలతో ఎంతమంది క్షతగాత్రులు అవుతున్నారో, అంతకంటే ఎక్కువ ఇలాంటి విచ్చలవిడి ఔషాధ విక్రయాల వల్ల తయారు చేస్తున్నారు. ప్రజల ఆయుష్షును హరిస్తున్నారు. కడుపు నొప్పి నుంచి మొదలు కొని ఏ రోగానికైనా ఇట్టే మందులు కుప్పలు తెప్పలుగా ఇచ్చేస్తున్నారు. నిద్ర మాత్రలకైతే అడ్డూ అదుపు లేకుండా పోతోంది. యాంటీబయోటిక్‌కి అడగకుండానే కాంబినేషన్స్‌లో ఇచ్చేస్తున్నారు. ఒక్కొక్క మెడికల్ షాపులో రోగం చెబితే చాలు అన్ని మెడిసిన్ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్లే డిసైడ్ చేస్తున్నారు. ఇలాంటి మాఫియాను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియాలో చట్టాలు బలంగా ఉన్నా, అమలు చేయడంలో విఫలమవుతున్న యజమాన్యాలు, ఆఫీసర్స్ ఆటలు ఇక సాగవు. ఎవరైనా సరే ‘స్వేచ్ఛ’-బిగ్ టీవీ వారి బండారాన్ని బయటపెడతాయి.
తర్వాతి కథనంలో సంచలన నిజాలు
ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టిన మెడికల్ షాపుల్లో మేజర్‌గా మెడ్ ప్లస్ చేస్తుంది ఏంటి? వారి బాగోతం ఎలా ఉంటుందో స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడిన వాస్తవాలను మీకు కళ్లకు కట్టేలా చూపిస్తాం. ఆ ట్యాబ్‌లెట్స్ తీసుకుంటే ఎలాంటి అనర్ధాలకు దారి తీస్తాయి. మెడికల్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఆఫీసర్స్ ఎలాంటి బాధ్యత వహించాలి? అనే విషయాలపై మరో కథనంలో డీటెయిల్డ్‌గా చూద్దాం.